బుక్కపట్నం సంతకు చుట్టుపక్కల నుచాలా గ్రామాల నుండి ప్రజలు వస్తుంటారు. ఆరోజు సంత రద్దీగా వుంది. సంతలో చివరన, ఒక మూలకు జనం గుమిగూడి వున్నారు. డోలు, డప్పుల శబ్దం వస్తోంది లయ బద్ధంగా- "రండి బాబూ! రండి! అందరూ రండి! తమాషా చూడండి!" అని గట్టిగా పిలుస్తోంది ఒక గొంతు- ఆ పిలుపు వినగానే ముత్యాలు ఇక అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోయాడు. అక్కడొక గడ్డం సాయిబు ఉన్నాడు. గారడి విద్యలు, మొండివిద్యలు ప్రదర్శన ఇవ్వడానికి అంతా సిద్దం చేస్తున్నాడు. మధ్య మధ్యలో "బాబూ! రండి! పాముకు ముంగిసకు పోట్లాట!

నిమ్మకాయల నృత్యం ! తమాషా చూడండి బాబూ! రండి!" అంటూ అందరినీ పిలుస్తున్నాడు.

ముత్యాలుతో పాటు చాలా మంది జనాలు పోగు అయినారు అక్కడ. గడ్డం సాయబు చేతిలో ఒక పుర్రె పట్టుకున్నాడు. ముందుగా వృత్తాకారంలో ఓ గీత గీసాడు. అందరినీ గీత మీదకు రమ్మన్నాడు. పిల్లలను క్రింద కూర్చో మన్నాడు. అందరూ అలాగే చేశారు- ఇక గడ్డం సాయిబు ప్రదర్శన

మొదలయింది:

ముందుగా ఒక బాలుడిని ఉద్దేశించి "ఇధర్ ఆ రే బచ్చా!" అన్నాడు. జనాల్లోంచి ఒక అబ్బాయి అతని దగ్గరికి వెళ్ళాడు.

"నీ పేరేమిటి?"

"ఉదయ్"

"ఏం చదువుతున్నావ్?"

"ఐదవ తరగతి"

"ఏ ఊరు?"

"ఇదే ఊరు" జవాబిచ్చాడు అబ్బాయి.

"ఇధర్ బైఠో" అన్నాడు మొండిసాయిబు.

అబ్బాయి కూర్చున్నాడు. సాయిబు అతని తలమీద చేయి ఉంచి, పుర్రెను అతని తల చుట్టూ మూడుసార్లు తిప్పాడు. అంతే! ఆ అబ్బాయి సృహలేకుండా పడిపోయాడు! సాయిబు అబ్బాయిని తిన్నగా పడుకో-బెట్టాడు. పైన తలనుండి కాళ్ల వరకూ నల్లని వస్త్రం కప్పాడు. ఒక డబ్బాలో నుండి తాయెత్తుల గుత్తిని బయటికి తీసాడు- "వీటిని చూడండి. ఆదివారం అమావాస్య నాడు, మా ఊరి స్మశానంలో పూజలు చేసి తెచ్చిన 'మహిమ గల తాయెత్తులు' ఇవి!" అని ప్రజలకు చూపాడు. "వీటిని ధరిస్తే ఎంత బలం ఉన్న శత్రువైనా నీకు మిత్రుడు అయిపోతాడు; దయ్యాలు, భూతాలు, పరారు అవుతాయి; లక్ష్మీదేవి నీకు తోడు అవుతుంది; దారిద్ర్యం పారిపోతుంది!" అన్నాడు.

చుట్టూ చేరిన జనాలందరూ అనుమానంగా ముఖాలు పెట్టారు.

"మీకు అనుమానంగా ఉంది కదా, ఇప్పుడు ఈ తావీజుల మహిమలు చూడండి!" అన్నాడు గడ్డం సాయిబు.

క్రింద పడి ఉన్న అబ్బాయి మీద నల్ల బట్ట కప్పాడు కదా, ఇప్పుడు ఆ అబ్బాయి ఎదపైన తాయెత్తుల గుత్తిని పెట్టాడు-

"ఇదేంటి రా, బేటా?" అన్నాడు పిల్లవాడితో, చుట్టూ చేరిన వాళ్ళలో ఒకరి కళ్ళజోడును చూపిస్తూ .

"కంటి అద్దాలు" అన్నాడు పిల్లవాడు. వాడి మీద తలనుండి కాళ్ల వరకూ నల్ల బట్ట ఇంకా అలాగే ఉంది!

"ఎలా చెప్పాడు?" ఆశ్చర్యంగా చూస్తున్నారు జనాలు.

"ఇదేందో చెప్పరా, చిన్నా?! అన్నాడు సాయెబు- అక్కడ చేరిన తాతవైపు చూపిస్తూ.

"చేతికర్ర!" అన్నాడు ఆ పిల్లాడు.

"ఎలా చెబుతున్నావురా?" అడిగాడు మొండిసాయిబు.

"తాయత్తు మహిమ!" అన్నాడు అబ్బాయి ఠక్కున.

మళ్ళీ అడిగాడు సాయిబు- "ఇదేమిటిరా, కుర్రాడా?"

"పెన్ను"

"మరి ఇది?"

"తువ్వాలు"

"ఎలా చెప్పావురా?"

"తావీజు మహిమ!"

"మరి ఇది?"

"గడియారం." "ఇది?" "చేతిసంచి." "ఇది?" "తాతయ్య మీసం."- అడిగిన ప్రతి ప్రశ్నకు అబ్బాయి ఠకఠక మని జవాబిస్తున్నాడు.

"ఎలా చెబుతున్నావురా?" అంటే "తాయెత్తు మహిమ!" అంటున్నాడు.

"సరే, బాబులూ! ఇప్పుడు చెప్పండి. ఈ తాయెత్తులు ఎవరెవరికి కావాలో చేతులెత్తండి" అన్నాడు గడ్డం సాయిబు, తాయెత్తుల గుత్తిని ఎత్తి అందరికీ చూపిస్తూ.

అక్కడ చేరిన వాళ్ళు అందరూ ఉత్సాహంగా చేతులెత్తారు.

"అందరికీ ఇవ్వడానికి తక్కువ వున్నాయి. కొందరికి మాత్రమే ఇస్తాను. దీని ఖర్చు వంద రూపాయలు అవుతుంది. 'ఇస్తాం' అనేవాళ్ళు ముందుకు
రండి" అన్నాడు సాయెబు. ముత్యాలు కూడా ముందుకె-ళ్ళాడు. వందరూపాయలిచ్చి, తాయెత్తు తీసుకున్నాడు.

"దీన్ని ఎలా భద్రపరచుకోవాలో చెబుతాను- కూర్చోండి. మిగిలిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు" అన్నాడు సాయెబు. అందరూ వెళ్ళిపోయారు- తాయెత్తు కొనుక్కున్న ఇరవైమంది తప్ప. సాయెబు వాళ్ళందరినీ తన ముందు కూర్చోబెట్టుకొని ఏవో మంత్రాలు చదివాడు. "సరే, ఇప్పుడిక ఇవి భూమికి తగలకుండా మొలకు కట్టుకోండి" అని చెప్పాడు. "ఇక అందరూ వెళ్ళి రండి" అని పంపేసాడు.

అందరూ వెళ్ళిపోగానే అక్కడ ముసుగు పెట్టుకొని పడుకున్న అబ్బాయిని లేపాడు. అతని చేతికి పాముల బుట్ట ఇచ్చాడు; తను మిగతా సామాను చేత పట్టుకున్నాడు. ఇద్దరూ సంతలోని జనాలలో కలసిపోయారు.

తాయెత్తు కట్టుకున్న ముత్యాలు ఇల్లు చేరుకోగానే భార్య "సీతాలు" ఎదురు వచ్చింది. సీతాలు పదవతరగతి వరకు చదువుకున్నది. చాలా తెలివైనది కూడా. భర్త చేతిలో ఖాళీ సంచీని చూసి "డబ్బులు పోగొట్టుకున్నావా?" అని అడిగింది. తాయెత్తు చూపించాడు ముత్యాలు. వెంటనే సీతాలు ఏడుపు లంకించుకున్నది. "సరుకులు తెమ్మని సంతకు పంపిస్తే తాయత్తు తెచ్చాడురో!" అని ఏడ్చింది. "ఈ తాయెత్తు కట్టుకుంటే ఎంతటి శత్రువైనా మిత్రుడైపోతాడు కదా, దయ్యాలు-భూతాలు అన్నీ‌పారిపోతాయి- ఇవన్నీ చెప్పాడా, ఆ సాయెబు, సంతలో?!- కంటి అద్దాలు, చేతికర్ర, పెన్ను..ఇవన్నీ చెప్పాడుగా?!" అన్నది కోపంగా. ముత్యాలు బిక్కమొహం వేసి అడిగాడు- "అవునే, నీకెలా తెలుసు ఇవన్నీ!?" అని.

"నా చిన్నప్పుడు మా నాన్న రామస్వామి కూడా ఇలాగే మోసపోయాడు! తరువాత రహస్యం తెలుసుకొని మోసం వెనక రహస్యం ఏంటో మాకందరికీ చెప్పాడు. పావలా విలువ చేయని తాయత్తు అది. దానికి ఎటువంటి మహత్యం లేదు! ముందుగా సాయెబు "పాముకు-ముంగిసకు పోట్లాట చూడండి" అని జనాలను పోగు చేస్తాడు. ఓసారి జనం పోగయిన తరువాత మాటలతో ఏమార్చి, తాయెత్తులకు మహత్యాలున్నాయంటూ అందరినీ మోసం‌ చేస్తాడు. 'ఇధర్ ఆ రే బచ్చా!' అని పిలువగానే వచ్చే అబ్బాయి అతని కొడుకే! ఇప్పటికైనా అర్థమైందా, తాయెత్తు మహిమ ఏమిటో? సాయెబు కొడుక్కి ముందుగా '1.కంటి అద్దాలు 2.చేతికర్ర 3.పెన్ను 4.తువ్వాలు 5.గడియారం 6.చేతిసంచి 7.తాతయ్య-మీసం' అని ఒక వరసలో జవాబులు చెప్పి, బట్టీ కొట్టిస్తాడు. ప్రశ్నలు అడిగేది తనే కదా- అదే వరస క్రమంలో‌ జవాబులు వచ్చేట్లు ప్రశ్నలు అడుగుతాడు: అంటే ముందుగా ఎవరివైనా కంటి అద్దాలను చూపిస్తూ "ఇదేమిటి?" అని అడుగుతాడన్నమాట. కళ్ళు మూసుకొని పడుకున్న కొడుక్కి ఏమీ కనబడనక్కర్లేదు- వాడు టక్కున "కంటి అద్దాలు" అంటాడు- వాడికి నేర్పిన వరసలో మొదటికి అదే కద! ఆ తర్వాత ఎవరైనా ముసలి వాళ్ళ చేతికర్రను చూపిస్తూ "ఇదేమిటి?" అని అడగాలి. అబ్బాయి ఠక్కున తన దగ్గరున్న లిస్టులో రెండవ జవాబు- 'చేతికర్ర'ని వెలువరిస్తాడు. అట్లా ముందుగా పెట్టుకున్న గుర్తుల ప్రకారం అన్నీ వరసగా ప్రశ్నించాలి; అబ్బాయి వరసగా జవాబులు చెబుతుంటాడు. మధ్యలో వేరేవాళ్ళెవరైనా ప్రశ్నవేశారనుకో- అప్పుడు అబ్బాయిగారి నోట మాట రాదు! ఇది కేవలం చిన్న గారడీ అంతే- తాయెత్తు మహిమ కాదు!

'నీకు మూఢనమ్మకాలు బాగా వంటబట్టినై' అని వాళ్ళకు బాగా అర్థం అయ్యింది- అందుకని తమ గారడీతో నీకు బురిడీ కొట్టారు. నువ్వేమో 'తెల్లనివన్నీ పాలు-తాయెత్తులన్నీ మహిమలు' అనుకున్నావు. రోజంతా కూలిచేసి సంపాదించిన డబ్బును ఉత్తినే తగలేశావు!" అని ముగించింది.

ముత్యాలు ముఖం పాలిపోయింది- "నన్ను క్షమించు సీతాలూ! ఇంకెప్పుడూ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళను! నాకు ఇట్లా కూడా‌ మోసం చేస్తారని తెలీదు కదా, అందుకని అమాయకంగా మోసపోయాను" అన్నాడు.

"ఈ విషయాన్ని అందరికీ చెప్పు, కనీసం ఇంకోళ్ళయినా నీలాగా మోసపోకుండా ఉంటారు!" అన్నది సీతాలు, ముత్యాలుని క్షమించేస్తూ.