రాము మాస్టారికీ, ఆయన విద్యార్థులకీ ప్రకృతికి దగ్గరయ్యే అవకాశం ఇంకా వున్నందుకు సంతోషం. బహుశా వాళ్ళ ఊరు అట్ట మీద బొమ్మలోలా వుండివుంటుంది. కాంక్రీటు అరణ్యాలలో- నిలువెత్తు భవనాలలో- ఎసి తరగతులలో- ప్లాస్టిక్ మొక్కల పచ్చదనమే మహాద్భాగ్యంగా బ్రతుకుతున్నారు పిల్లలు. ప్రకృతి, దాని అందాలు, దాని శక్తి , ప్రకృతిలో బ్రతకడంలోని ఆనందం- ఇవేవీ అనుభవంలోకి కూడా రాని పిల్లలకి, వాటికి దూరంగా బ్రతుకుతున్నామన్న స్పృహ గానీ, ఏదో కోల్పోతున్నామన్న బాధగానీ వుండే అవకాశం లేదు. ఉన్నంతలో, చుట్టాలింటికి వెళ్ళి వచ్చినట్లు "ప్రకృతి" అనే పదార్థం కనబడే చోటికి వెళ్ళి రావడమే చెయ్యగలిగింది.
సంపాదకీయం చదువుతుంటే పుట్టలు పుట్టలుగా వచ్చిపడే కొటేషన్ మార్కులు(".....") హైఫన్లు (-) ఎంత ఇబ్బంది పెట్టాయో! ఇది వరలో కూడా చాలాసార్లు అనుభవమే ఇది! పంక్చుయేషన్ మార్కులు చదవడంలో స్పష్టతని పెంచాలి. చాలా ఎక్కువ రకాలు, అన్నిసార్లు అవసరంలేని చోట్ల, వాడకూడని చోట్ల కూడా వాడడం వల్ల, చదివేటప్పుడు అవి పంటికింద రాళ్ళలా అడ్డం వస్తుంటాయి. కొత్తపల్లి బృందం ఈ విషయంలో కాస్త మనసు పెట్టాలి.
నీతిచంద్రిక పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. క్లిష్టమైన వాక్యాలతో గందరగోళ పరచటం తగ్గించి, పదునుగా, సొంపైన భాషాప్రయోగంతో 'ఇది తప్పక పిల్లలకు మంచి తెలుగులోని రుచిని చూపిస్తుంది' అనిపించేట్లు వుంది.
మానస సేకరించిన 'రహస్యం చెబితే' కథ మనుషుల మనసులని, మానవత్వాన్నీ, డబ్బు ఎంతలా చంపెయ్యగలదో చెప్పింది. ఇది గతంలో చదివినదే ఐనా మళ్ళీ గుర్తుచేసినందుకు మానసకి ధ్యాంక్స్!
ఆశపోతులు, దురాశాపరుల తిక్క చివరికి తిన్నగా కుదరటం ఒక ఎవర్గ్రీన్ టాపిక్. సునీల్ కుమార్ ('దురాశ') నాగుల్ షరీష్('ఆశపోతుల కథ') దీన్ని చక్కగా ఉపయోగించుకున్నారు- కాస్త క్రొత్తగా కూడా! కాకపోతే 'దురాశ' బొమ్మల్లో మొదటి పేజీలోని నడివయసు కొడుకులు చివరిపేజీలో పదేళ్ళ పిల్లలై పరుగెట్టారు - అదేంటో!
గాయత్రీ దేవి వ్రాసిన 'బాధ్యత', యోగి వ్రాసిన 'కోచింగ్టెన్షన్' ప్రస్తుత పరిస్థితులను, అనుభవాలను వాడుకుని అవగాహనతో వ్రాసినట్లున్నాయి.
తనుష్ కథ లాంటిది-కష్టాలనెదిరించి చివరికి ఉన్నత శిఖరాలనధిరోహించడం, ఉన్నత విలువలని నిలపడం లాంటి కథాంశాలతో ఇదివరలో క్రొత్తపల్లిలోనే చాలా కథలొచ్చాయి. కష్టాలకి కుంగి పోనవసరంలేదన్న ఆశాభావాన్ని ఇవి పిల్లలలో నింపుతాయేమో.
'మంత్రగత్తె ఏది?' కొత్తరకం అల్లాఉద్దీన్ కథ! సౌమ్య తెలివిగా దాన్ని చమత్కారంగా ముగించింది.
'దొర్లు దొర్లు పుచ్చకాయ్'ని చాలాసార్లు, చాలా పుస్తకాలలో చదివేశాం!
రాధామండువ గారి 'మారిన శివునాజ్ఞ' ని ఎప్పుడో- నా చిన్నతనంలో- విన్నాను. ఇప్పటికీ అది భలేగా అనిపిస్తుంది. నంది శివుడు చెప్పింది చెప్పినట్లు చెప్పివుంటే ఎలావుండేదో కదా! ఆడవాళ్ళకి బోలెడంత పని తప్పేది!
యువకెరటాలు యధా ప్రకారం - "ఇలాంటి వ్యక్తులు మనమథ్యే వున్నారే!” అనిపించేలా వుంది. "ఎంత పరిణితి కలిగి వున్నారో!” అనిపించేలా వుంది.
అక్టోబరు వస్తోందంటే గాంధీ జయంతి గుర్తొస్తుంది - వెంటనే క్రిందటి సంవత్సరం అక్టోబరు కొత్తపల్లిలో చదివిన ఎంతో మంచి సంపాదకీయం కూడా!