రాఘవయ్యకు ఎప్పటినుండో ఒక కోరిక- మాట్లాడే పక్షిని పెంచాలని.
చాలామంది చిలకను పెంచుకొమ్మని సలహానిచ్చారు ఆయనకు. "చిలకైతే ఏవి నేర్పితే అవి నేర్చుకుంటుంది" అన్నారు.
ఒకసారి వాళ్ళింటికి కోయవాడు ఒకడు వచ్చాడు. అతని దగ్గర పంజరంలో ఒక పిచ్చుక ఉంది. "దీనికి మర్యాదగా మాట్లాడటం వచ్చు. చాలా కష్టపడి నేర్పించాను దీనికి" అన్నాడు అతను. రాఘవయ్య దాన్ని పరీక్షించి చూసాడు- నిజంగానే అది చక్కగా మాట్లాడుతున్నది! రాఘవయ్య వెయ్యి రూపాయలిచ్చి దాన్ని కొనుక్కున్నాడు.
పిచ్చుక నిజంగానే చాలా మంచిది. రోడ్డు మీద ఎవరు పోతున్నా అది వాళ్లని పిలిచేది- "రండి! కూర్చొండి! ఏం పుచ్చుకుంటారు, కాఫీనా-టీనా?" అని అడిగేది. అందరూ దాని మర్యాదను చూసి మురిసిపోయేవాళ్ళు. రాఘవయ్య ని ప్రశంసించేవాళ్ళు.
ఒకసారి రాఘవయ్య దుకాణం నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది- దొంగలు పడి ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోయారు!
రాఘవయ్యకు మతి పోయినట్లయింది- "ఆ దొంగల్ని నువ్వు గుర్తు పడతావా?" అని అడిగాడు పిచ్చుకని, రవంత ఆశగా.
"రండి! కూర్చోండి! ఏం పుచ్చుకుంటారు, కాఫీనా-టీనా?" అన్నది పిచ్చుక, ఉత్సాహంగా.
అకస్మాత్తుగా అర్థమైంది రాఘవయ్యకు- 'దారిన పోతున్న దొంగల్ని ఈ పిచ్చి పిచ్చుకే ఆహ్వానించి ఉంటుంది ఇంట్లోకి!' "కాఫీ కావాలా, టీ కావాలా?" అని అడిగేసరికి, కాదనలేక దొంగలు లోనికి వచ్చి, ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఉంటారు!'
మరుక్షణం పిచ్చుకకి విముక్తి లభించింది. రాఘవయ్య దాన్ని వదిలేసి, పంజరాన్ని గిరాటు వేశాడు.
'మాట్లాడే పక్షి చేతలకు బరువు' అని బాగానే అర్థమైంది అతనికి. "ఏ కుక్కనో పెంచినా విశ్వాసంగా ఆ దొంగల కండలు పీకి ఉండేది-అనవసరంగా దీన్ని నమ్మి, చెడ్డాను" అనుకున్నాడతను, నిట్టూరుస్తూ.