క్రీస్తు శకం 4250వ సంవత్సరం. భూ ప్రపంచంలో అప్పటికి చాలా యుద్ధాలు వచ్చాయి. మనుషులంతా ఆ యుద్ధాల్లో చెలరేగిన రసాయనిక జ్వాలల్లోను, అణుజ్వాలల్లోను మాడి మసై పోయారు. ఎవరో కొందరు మనుషులు మాత్రమే, అక్కడక్కడా మిగిలి ఉన్నారు. వాళ్ళు అయినా ఎలా మిగిలి ఉన్నారో చెప్పటం కష్టం..ఉన్నారంటే ఉన్నారు; లేరంటే లేరు.
ఆ సమయంలో ఒక ఊళ్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు భాస్కర్. అతను ఉండే ప్రాంతం అంతా పెద్ద ఎడారిలాగా ఉండేది. అతను పొలానికి వెళ్ళే దారిలో మటుకు కొన్ని పొదలు, కొన్ని చెట్లు ఉండేవి. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉండడం గమనించాడు భాస్కర్. ఆ అమ్మాయి ఒక రోజు వచ్చి ఏడుస్తుంది; మరుసటి రోజు రాదు- భాస్కర్ ఆమెని ఇలా చాలా సార్లు చూశాడు; కానీ పెద్దగా పట్టించుకోలేదు. భూ ప్రపంచంలో ఎవరూ ఇంకొకరిని గురించి పట్టించుకోకూడదు.
ఒకరోజు అతను ఆగలేకపోయాడు- ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.
"మా అమ్మానాన్నలు నాకు ఇష్టంలేని పెళ్ళి చేస్తున్నారు. అందుకనే నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాను" అంది ఆమె.
"'నాకు ఇష్టం లేదు' అని చెప్పచ్చుకదా, మీ అమ్మానాన్నలకు?" అడిగాడు భాస్కర్.
"మా అమ్మకు చెప్పినా వినిపించుకోదు-మా నాన్నకి నేను ఇంట్లో ఉంటే బరువు. నువ్వు నన్ను పెళ్ళి చేసుకోరాదూ?" అంది ఆ పిల్ల.
భాస్కర్ కొంచెం ఆలోచించి, అందుకు ఒప్పుకున్నాడు .
వాళ్ల పెళ్ళికి ఎవరూ రాలేదు. వాళ్ళూ ఎవ్వరినీ పిలవలేదు. భూలోకంలో జరిగే పెళ్ళిళ్ళకి ఎవ్వరూ ఎవ్వరినీ పిలవరు.
అయితే నిజానికి ఆ అమ్మాయి ఒక దయ్యం- ఆ సంగతి భాస్కర్‌కు తెలిసినట్లు లేదు.
పెళ్ళి చేసుకొన్నాక కూడా ఎప్పటిలాగే పొలానికి వెళ్ళేవాడు భాస్కర్. ఆ సమయంలో దయ్యం ఆరు కడవల నీళ్ళు తెచ్చి, పెద్ద పాత్రకు అన్నం వండి, రాశి పోసుకొని తినేది. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేది.
ఆమె అలా చేస్తుండగా చూసిందామెను, అటుగా పోతున్న ఒక అవ్వ. భూలోకంలో మనుషులెవ్వరూ అట్లాంటి పని చెయ్యరు.
అవ్వ ఈ విషయాన్ని వెంటనే భాస్కర్‌కు చెప్పాలనుకున్నది. ఆరోజు సాయంకాలం భాస్కర్ ఇంటికి వచ్చాక, అతని భార్య ఇంట్లో లేని సమయం చూసి, ఆ అవ్వ భాస్కర్ ఇంటికి వచ్చి చెప్పింది- "చూడు, నీ ఇంట్లో ఉన్నది ఒక దయ్యం" అని. భాస్కర్ ఏమీ అనలేదు.
"నువ్వు పొలానికి వెళ్ళిన తర్వాత, ఆరు కడవలతో నీళ్ళుతెచ్చి పెద్ద పాత్రకు అన్నం వండి, రాశి పోసి తింటుంది- దయ్యం కాకపోతే ఇలాగ ఎందుకు చేస్తుంది చెప్పు?" అని, వెళ్ళిపోయింది అవ్వ.
భాస్కర్ కొద్దిసేపు ఆలోచించి, పడుకున్నాడు. మరుసటి రోజు భార్యతో "నేను పక్క ఊరు వెళుతున్నాను" అని చెప్పి, బయటకు వెళ్ళినట్లుగా వెళ్ళి, కనబడకుండా తిరిగివచ్చి, అటకమీదికి ఎక్కి దాక్కున్నాడు.
'ఎవరూ లేరుకదా' అనుకొని, ఆరు కడవల నీళ్ళూ ఒకేసారి తెచ్చి, అన్నంవండి రాశి పోసి తినటం మొదలు పెట్టింది దయ్యం.
అంతలోనే భాస్కర్ అటక దిగి, వెనుక నుండి వచ్చి, ఆ దయ్యానికి కళ్ళు మూసిపెట్టాడు: దయ్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గబుక్కున విడిపించుకొని, చూసి "భాస్కర్, నేను ఎవ్వరో నీకు తెలిసి పోయిందా? నేను దయ్యాన్ని కదా, నీకు నేనంటే భయం వేయలేదా?" అని అడిగింది.
అప్పుడు భాస్కర్ బిగ్గరగా నవ్వేసి, "ఓసి పిచ్చి దయ్యమా! నీకు అస్సలు మెదడు లేదు కదా! ఈ భూమి మీద మనుషులు ఎందుకుంటారు? ఉన్నదంతా మనమే! ఏదో, మన పిచ్చికొద్దీ 'అవతలివాళ్ళు మనుషులేమో' అని ఆశపడుతూ ఉంటాం, అంతే!" అన్నాడు.
అప్పటివరకూ 'తన భర్త ఒక మనిషి' అని గర్వపడుతూ ఉన్న దయ్యానికి 'అతనూ దయ్యమే' అని అర్థం అయి, నిర్ఘాంతపోయింది.
క్రీస్తుశకం 4250లో నిజంగానే ఈ భూప్రపంచంలో మనిషన్నవాడు భూతద్దం పెట్టి వెతికినా కనబడడు' అని దానికీ తెలిసివచ్చినట్లుంది, గట్టిగా నిట్టూర్చి ఊరుకున్నది.