సత్తి రాజు లక్ష్మీనారాయణ (బాపు)
డిగ్రీలో చేరిన కొత్తల్లో, అంటే 1952లో గీసిన
ఈ చక్కని బొమ్మ గొప్పదనం ఏంటో తెలుసా? దీన్ని ఒకే గీతతో గీశాడాయన!
మీరూ గీయచ్చు, ప్రయత్నించి చూడండి!
1945 నుండి 1959 వరకూ, 14 సంవత్సరాల
పాటు వెలువడిన 'బాల' పత్రిక బాపు,
ముళ్ళపూడి వెంకట రమణ లాంటి పిల్లలు
చాలామందిని రాసేందుకు, గీసేందుకు
ప్రోత్సహించింది. రమణ ఆ రోజుల్లో 'బాల'
కథలకు సంపాదకుడుగా కూడా వ్యవహరించాడు!
విజ్ఞానం
ఆకులు పచ్చగా ఎందుకుంటాయి?
ఆకులలో పత్రహరితం అనే పచ్చని పదార్థం ఉంటుంది. దానివల్ల ఆకులు పచ్చగా కనిపిస్తాయి. సూర్యరశ్మిని, నీటిని ఉపయోగించుకొని పత్రహరితం చెట్టుకు అవసరమైన పిండిపదార్థాన్ని తయారు చేస్తుంది. కొన్ని రకాల మొక్కలకు రంగురంగుల ఆకులుంటాయి. వాటిలో పత్రహరితం ఉండదు, పిండి పదార్థం తయారుకాదు.
సముద్రంలో నీళ్లు నీలంగా ఉంటాయా?
ఉండవు.
సముద్రంలో నీళ్లు పై నున్న ఆకాశాన్ని ప్రతి ఫలించటం వల్ల నీలంగా కనిపిస్తాయి.
మరి కృష్ణానదిలో నీళ్లు నల్లగా ఎందుకు కనిపిస్తాయి?
నదీగర్భంలో మట్టి నల్లగా ఉండటం వల్ల, కృష్ణా నది నల్లగా అనిపిస్తుంది.
చేసి చూడండి!
ఒకచేత్తో బొజ్జ నిమురుకుంటూ, అదే సమయంలో రెండో చేత్తో తల పై భాగాన్ని తట్టుకోండి, చూద్దాం! కష్టమైందా?!
ప్రయత్నిస్తూంటే కొద్ది సేపటికి ఆ పని సులభమౌతుందట - ఎందుకు, అలాగ?
'మన మెదడుకి త్వరగా నేర్చుకునే గుణం ఉంది' అనటానికిది నిదర్శనమట!
అలర్జీ!
చిన్న చిన్న ధూళి కణాలు, బూజు కణాలు, పూల పుప్పొడి, గట్టి వాసనలు- ఇలాంటివి ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినట్లయితే, ఒక్కోసారి కొన్ని శరీరాలు వాటికి అతిగా స్పందిస్తాయి- వాటిని బయటికి నెట్టివేసే ప్రయత్నంలో ఆశరీరాలు తుమ్ములను తెప్పించుకుంటాయి; కళ్ళలోంచి నీళ్లను కారుస్తాయి; శ్వాసనాళంలో స్రావాలు మొదలయి- చీమిడి తయారవుతుంది. 'యాంటీ హిస్టమిన్' మందులు ఈ స్రావాలను నిరోధిస్తాయి- అయితే ఆ క్రమంలో శరీరపు రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తాయి!
పద్యాలు
తెనుగుదనమువంటి తీయందనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు
నష్టపెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
దేశసేవకంటె దేవతార్చన లేదు
స్వార్థపరతకంటె చావులేదు
సానుభూతికంటె స్వర్గంబు లేదురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
అందమైన సూక్తి అరుణోదయంబట్లు
బాల మానసముల మేలుకొల్పు
సూక్తిలేని మాట శృతిలేని పాటరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
కవితలు
ప్రకృతి
ఓ ప్రకృతీ!
నీ చల్లని ఒడిలోఆడుకునే
అవకాశం ఇచ్చావు
చల్లని నీ గాలులతో
మాకు ఊపిరినూదావు
పచ్చని నీ చెట్లతో
చక్కని ఆరోగ్యాన్నిచ్చావు
నీ స్పర్శే మాకు మాతృస్పర్శ
నీ రూపే మా ఆదర్శం.
రచన: జె.హరిచందన్, 8వతరగతి, తేజ ట్యాలెంట్ స్కూల్, కోదాడ.
ఆట-పాట
పాడేది ఆట కాదు- ఆడేది పాటకాదు
పాటంటే ఆటకాదు-ఆటలా పాడేది పాటకాదు
పాడితే రాళ్ళు సయితం కరిగిపోవాలి
రచన: ఐ.రాహుల్, 8వతరగతి, తేజ ట్యాలెంట్ స్కూల్, కోదాడ.
అమ్మప్రేమ
అమ్మ ప్రేమ మధురం
అన్న ప్రేమ గౌరవం
నాన్న ప్రేమ తీయదనం
చెల్లి ప్రేమ చల్ల దనం
వీళ్ళంతా చూపించిన ప్రేమను
మనం మన దేశంపై కురిపిద్దాం
రచన: ఐ.రాహుల్, 8వతరగతి, తేజ ట్యాలెంట్ స్కూల్, కోదాడ.
గాంధీ
మన గాంధీ
కత్తులు లేవు
శూలము గాండీవము అసలే లేవు.
వైరి మీద దండెత్త
సాయుధ బలగము లేదు
బలహీనమైన కాయము
కోపతాపాలు బొత్తిగా శూన్యము
మనోబలశాలి, వీరధీశాలి, వరమూర్తి
మన మహాత్మ గాంధీ.
రచన: పి. గాయత్రి దేవి, ఖైరాతాబాద్.
జోకులు
మూడింటికి!
టీచర్: మధులికా! ప్రశ్న పత్రం తీసుకుని గంటైనా ఏమీ రాయలేదేమిటి?
మధూలిక: అది కాదు టీచర్... క్రింది ప్రశ్నలకు 'మూడింటికి' సమాధానాలు రాయమన్నారు, మూడు ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను!
రాము: అర్థ శాస్త్రం అంటే ఏంటి, భౌతిక శాస్త్రం అంటే ఏంటి?
సోము: అర్థం కాని శాస్త్రం అర్థ శాస్త్రం. బహు తిక్క శాస్త్రం భౌతికశాస్త్రం !
భజన-విభజన
తెల్లవాడికి , నల్లవాడికి తేడా ఏంటి?
తెల్లవాడు విభజన చేస్తాడు, నల్లవాడు భజన చేస్తాడు.
రివర్సు గేరు!
సోము: 001 నంబరుకు ఫోన్ చేస్తే ఏమౌతుందిరా?
రాము: పోలీస్ జీప్ రివర్స్ గేర్‌లో వస్తుందిరా!
పగటి కుక్క!
పక్కింటాయన: ఏమి నాయనా రామారావూ, ఎక్కడి నుండి తెచ్చావ్ ఈ కుక్కను?! పొద్దంతా మొరుగుతోంది! ఇట్లా అయితే పడుకోవడం కష్టం కదా?
రామారావు: ఇది పగటి కుక్కే సార్, రాత్రంతా పడుకుంటుంది!
తొక్కుదాం!
మాస్టారు: అరటి పండు ప్రత్యేకత ఏంటి పిడుగూ?
పిడుగు: తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం సార్!
పిసినారి!
వ్యాపారస్తుడు: ఏం కావాలి సార్?
పి: కోడి కావాలి. ఏ కోడి ఎంత?
వ్యాపారస్తుడు: పెద్దకోడి అయితే 150 రూపాయలు; చిన్నకోడి అయితే 50 రూపాయలు.
పి: అయితే ఈ 50 రూపాయలు తీసుకోండి; ఈ చిన్న కోడి పెద్దగా అయిన తరువాత ఇవ్వండి.
వ్యాపారస్తుడు: ఆ....!
బహుళార్థ సాధకం!
టీచర్: రామూ! వార్తా పత్రికల వల్ల మూడు ఉపయోగాలు చెప్పు?
రాము: పుస్తకాలకు అట్టలేసుకోవచ్చు, అరల్లో పరచుకోవచ్చు, అవసరానికి అమ్ముకోవచ్చు!