ఒక గొర్రె, ఒక ఆవు, ఒక ఒంటె- మూడూ కలిసి ఎటో పోతున్నాయి ఓసారి. దారిలో వాటికి ఒక చక్కని పచ్చగడ్డి మోపు, నేలమీద పడి కనిపించింది.
గొర్రె కొంచెం ఆలోచించి, "మిత్రులారా! ఈ పచ్చగడ్డి మోపును చూశారుగా, చాలా చిన్నది. దీన్ని మనం ముగ్గురం పంచుకొని తింటే ఒక్కొక్కరికీ నాలుగేసి పోచలు వస్తాయి అంతే. వాటితో ఎవ్వరికీ తృప్తిగా తిన్నట్లు అవ్వదు. అందుకని, మనలో ఎవరో ఒకరం మాత్రమే ఈ గడ్డినంతా తినగలిగితే బాగుంటుంది. మన ముగ్గురిలోనూ వయసులో పెద్దవాళ్ళు ఎవరో చూసి, వాళ్ళకే ఈ గడ్డిమోపును తినే అధికారం ఇద్దాం- ఎందుకంటే ప్రవక్తగారు ఏనాడో సెలవిచ్చి ఉన్నారు కదా, "వయసులో పెద్దవారికి అన్నింటా, ఎల్లప్పుడూ ప్రాధాన్యతనివ్వండి" అని?! అందుకని, మిత్రులారా, మనం ఒక్కొక్కరం ఇప్పుడు మన వయసు ఎంతో చెప్పుకుందాం. అట్లా మనలో పెద్దవాళ్ళు ఎవరో తెలిసిపోతుంది" అన్నది.
ఇది విని ఆవు, ఒంటె- "సరే, కానియ్యి. ముందు నీ వయసెంతో చెప్పు" అన్నాయి.
గొర్రె చిరునవ్వు నవ్వింది. "అబ్బో! నేను చాలా పాతవాడిని! ఖచ్చితంగా చెప్పాలంటే అబ్రహాం కాలం నాటి వాడిని నేను! మీకు గుర్తు ఉందా, ఆనాడు దేవుని ఆజ్ఞ మేరకు అబ్రహాం తన కొడుకు ఇస్మాయేలును బలి ఇచ్చేందుకు తెచ్చాడే, ఆ మైదానంలోనే నేను గడ్డి మేస్తూ కనబడ్డాను! దీన్నించి మీరు లెక్క కట్టుకోండి, నేను ఎంత పాతకాలం వాడినో!" అన్నది.
వెంటనే ఆవు అందుకున్నది: "ఓహో! నేను నీకంటే పాతదానిని. సృష్టిలోనే మొదటి మానవుడు గదా, ఆదాము? అతను ఆనాడు పొలం దున్నేందుకు ఎవరిని వాడాడను-కుంటున్నారు? నన్నే! నేను ఆనాడు అట్లా పొలం దున్నే సమయానికి అబ్రహామూ లేడు, ఇస్మాయేలూ లేడు!" అన్నది.
ఆ సరికి ఒంటెకు అర్థమైపోయింది- "ఈ వాదనలు వ్యర్థం. ఇవి ఎప్పటికీ తెగేవి కావు" అని. అది ముందుకెళ్ళి, గబగబా అక్కడున్న పచ్చగడ్డినంతా మేసేసి, నిర్ఘాంత పోయి నిల్చున్న గొర్రె, ఆవులు తేరుకునే లోపు- "చూడండి, నేను ఎప్పుడు పుట్టానో గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా నాకు ఇంతవరకూ కలగలేదు- నేను అంత పాత దానిని అన్నమాట! 'దేవుడు నా శరీరాన్ని, నా మెడను ఎంత ప్రత్యేకంగా; ఎంత వింత ఆకారంలో, ఎంత వింత పరిమాణంలో సృష్టించాడు' అంటే, అది చాలు-'నేను మీకంటే చాలా చాలా పాతదాన్ని' అని చెప్పేందుకు!" అన్నది ఇకిలించుకుంటూ.
సాధారణమైన తర్కం పనిచెయ్యని చోట అసాధారణమైన తర్కమే పనిచేస్తుంది మరి!