పెద్ద పసుపులలో నివసించే రాము చాలా మంచివాడు- ఎవ్వరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు.

వాళ్ల ఇంటి ప్రక్కనే ఉండే రవి తెలివైనవాడు; అయితే అసూయా పరుడు- ఎవరైనా బాగుపడితే ఓర్వలేడు.

రాముకి, రవికి ఇద్దరికీ‌ పొలం ఉంది. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి. అయితే రవి పైరు ఇంకా కొద్ది రోజుల్లో కాపుకు వస్తుందనగా పురుగు తాకిడికి గురైంది. అదేమో మరి, రాము నాటిన పైరు మటుకు చాలా పచ్చగా ఉంది!

స్వతహాగా అసూయాపరుడైన రవి , రాము పొలం బాగుండటాన్ని జీర్ణించుకోలేక పోయాడు. బాగా ఆలోచించి, ఒక రోజు రాత్రి రాము పొలానికి నిప్పు పెట్టాడు!

పెద్దగా మంటలు లేచాయి. ఆ వెలుగులో ఎవరో పారిపోతుండటం చూసిన కావలివాడొకడు ముందుకు వచ్చి, రాముతోబాటు మంటలు ఆర్పాడు.

ఆ సరికి సగం పంట మాడి మసైంది.

ఆ తర్వాత కావలివాడు రాముతో మాట్లాడుతూ- "పొలానికి ఎవరో మంట పెట్టారు- అవి వాటంతట అవే రేగినవి కావు. ఆ మంట పెట్టిన వాడెవడో పారిపోతుండగా చూశాను... ఏమీ అనుకోకు- వాడు నీ స్నేహితుడు రవి లాగానే ఉన్నాడు మరి. కాస్త జాగ్రత్తగా ఉండు, అతనితో" అన్నాడు.

రాముకి కూడా అది నిజమే అనిపించింది- 'తనూ ఎవరో పారిపోతుండగా చూశాడు- అయితే అది రవి కావచ్చు; కాకపోవచ్చు కూడాను!' అయితే పొలం కాలిన తర్వాత రవి ప్రవర్తన చూసాక రాముకి తన అనుమానం నిజమే అని తెలిసిపోయింది. అయినాకూడా అతనికి రవిని ఏమీ

అనాలనిపించలేదు. 'ఎంత లేదన్నా అతను తన చిన్ననాటి స్నేహితుడు' అని ఊరకున్నాడు.

అయితే ఆ తర్వాత రెండో రోజున, తమ ఇంటి బయట ఎవరివో ఏడ్పులు వినిపించి, బయటికి వెళ్ళి చూశాడు రాము. ఆ వచ్చింది రవి భార్య సుశీలమ్మ- "మా పిల్లవాడు సైకిల్ తొక్కుతూ క్రిందపడ్డాడు. ఇటుగా వస్తున్న ఆటో వాడిని ఢీ కొట్టింది. చాలా రక్తం పోతున్నది. సమయానికి రవి కూడా ఊళ్ళో లేడు" అని ఏడ్చింది సుశీలమ్మ.

రాము వెంటనే ఆ పిల్లవాడిని పదిహేను మైళ్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్ళటమే కాదు; అవసరంకొద్దీ తన రక్తం కూడా దానం చేసి పిల్లవాడిని కాపాడాడు.

సంగతి తెలుసుకున్న రవి గబగబా ఆస్పత్రికి వచ్చాడు- తన పిల్లవాడిని కాపాడిన రాముని చూడగానే పశ్చాత్తాపంతో అతని మనసు తపించిపోయింది.

అతను కళ్ళనీళ్ళు పెట్టుకుని "రామూ! నన్ను క్షమించు. ఇంతకాలమూ మిత్రుడిగా నటిస్తూనే నీకు చాలా అన్యాయం చేస్తూ వచ్చాను. అసూయకొద్దీ నీ పొలానికి నిప్పు పెట్టింది నేనే. ఇకపై ఎప్పుడూ అట్లాంటి తప్పు పని చెయ్యను. నీ మంచి మనస్సుని అర్థం చేసుకోలేక అంత పాపానికి ఒడిగట్టాను. ఆ నష్టాన్ని నేను డబ్బు రూపేణా తీరుస్తాను- కాదనకు" అని ప్రాధేయపడ్డాడు.

రవి రాము మంచి మనస్సుతో రవిని క్షమించి "జరిగిందేదో జరిగిపోయిందిలే; ఇక మీదట ఎప్పుడూ ఇటువంటి పనులు చేయవద్దు" అని మందలించాడు.

అటుపైన రాము, రవిల స్నేహం కలకాలం వర్ధిల్లింది.