చావు తప్పి- కన్ను లొట్టపోయి వెనక్కి తిరిగివచ్చిన కొంగ, తమ రాజైన హంసకు విన్నవించుకున్నది- "అప్పుడు నేను చెప్పాను ఆ గద్దకు- "వివిధ విద్యలలో నిష్ణాతుడైన 'సర్వజ్ఞుడు' అనే చక్రవాక పక్షి మా ప్రధాని. ఆయనకు సర్వ ధర్మాలూ మూలమట్టంగా తెలుసు. సత్యము, శౌచము మొదలైన సద్గుణాలన్నీ ఆయనలో మూర్తీభవించి ఉన్నాయి.

"స్వదేశంలోనే పుట్టినవాడు, అనేక పరీక్షలలో నెగ్గినవాడు, అన్ని విషయాలూ తెలిసినవాడు, అన్ని పనులూ చేయగల నేర్పు గలవాడు, ధైర్యము-శౌర్యము మొదలైన గుణాలు ఉన్నవాడు, ప్రతిభావంతుడు, అందరికీ ఆమోదయోగ్యుడు, ధర్మం ఏంటో-అధర్మం ఏంటో తెలిసినవాడు, స్వామి కార్య తత్పరత గలవాడు మాత్రమే మంత్రి పదవికి తగినవాడు" అని నీతి కోవిదులు చెబుతారు- దేవుని దయవల్ల ఈ గుణాలన్నీ‌ మా మంత్రిగారిలో నెలకొని ఉన్నాయి" అని.

అరుణముఖుడు అనే చిలుకమంత్రి అప్పుడు ఆ నెమలిరాజుతో ఇలా అన్నది- "ప్రభూ! కర్పూరద్వీపం మొదలైన పేర్లుండే దీవులన్నీ మన ఈ జంబూద్వీపంలోని చిన్న చిన్న దీవులే; కనుక ఈ కర్పూర ద్వీపం కూడా నిజానికి తమరిదే అయి ఉండవచ్చు. అందువల్ల ఆ హంసరాజు కూడా 'అవును-కాదు' అనకుండా తమరి ఆజ్ఞను అనుసరించి మెలగవలసినవాడే అయి ఉంటాడు. అందువల్ల ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి ఏడూ, తమరు పన్ను వసూలు చేయమని ఆజ్ఞాపించినప్పుడు, ఒక దూతను ఆ ద్వీపానికి కూడా పంపటం మొదట చేయవలసి ఉన్నది.

అగ్నిహోత్రుడికి ఎన్ని కట్టెలతోటీ తృప్తి కలగదు; అదే విధంగా రాజన్నవాడు ఎంతకీ తృప్తి చెంది ఊరుకోరాదు. 'తృప్తిలేని బ్రాహ్మణుడు చెడినట్లే, సంతృప్తుడైన రాజుకూడా చెడిపోతాడు' అని పెద్దలు చెబుతారు. కాబట్టి రాజన్నవాడు ఎప్పుడూ‌ ఉత్సాహం వీడక-న్యాయ మార్గాన్నో, అన్యాయ మార్గాన్నో- దుర్మార్గులైన శత్రువులను జయిస్తూ ఉండాలి.

అంతే కాదు; ఇంకొక ధర్మ సూక్ష్మం కూడా‌ ఉన్నది- శ్రద్ధగా వినండి: 'రాజ్యం వీరభోజ్యం'- (వీరులెవ్వరో రాజ్యం వారిదే) అని ధర్మశాస్త్రం తెలిసినవారు చెబుతుంటారు. కాబట్టి ఇప్పుడు తగిన సైన్యంతో బలంగా తరలి వెళ్ళి, ఆ దీవిని చుట్టు ముట్టటం కూడా మంచి పనే- ఆ రాజెవరో మంచి మాటలకు లొంగాడా, సరి! అట్లాకాక, ప్రభువుల వారి మాటను లక్ష్యపెట్టక, తమరిని ఎదిరించబూనితే దానికి తగిన ప్రతిఫలం తక్షణం అనుభవిస్తాడు. అందువల్ల, తమరు నా మాటను త్రోసిపుచ్చకండి- దూతను ఎవరినైనా ఒకరిని పంపి, శత్రువు మనసు తెలుసుకోండి!" అన్నది.

అది విని, చంద్ర మహారాజు కూడా చిరునవ్వుతో, వికసించిన ముఖంతో "అవునవును! అలా చేద్దాం" అని తల ఊపాడు!

ఔరా! ఏమనాలి? 'రాజ్యపు మదంతో కళ్ళు కాననివాడు, మూర్ఖుడు, ధన గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడు, వెర్రివాడు'- వీళ్ళు నలుగురూ 'ఇది సాధ్యం-ఇది అసాధ్యం' అని ఏమాత్రం‌ ఆలోచన చెయ్యక, 'దొరకనివాటిని కూడా దొరికేవిగా తలుస్తారు' అని పెద్దలు చెప్పిన మాటలు తప్పుతాయా?

రాజ్యలోభమే కదా, ఈ చెడు ఆలోచనలకు అన్నిటికీ మూలం? తొఱ్ఱలో ఉన్న నిప్పు ఎలాగైతే చెట్టును కాల్చివేస్తుందో, అట్లాగే హృదయంలోని 'దురాశ' అనే అగ్ని మనిషిని కాల్చివేస్తుంది. అన్ని అనర్ధాలకూ మూలం ఆశే. అట్లాంటి ఆశను విడిచిపెట్టి, అందిన దానితో తృప్తి చెంది సంతోషపడే వాడే ధన్యుడు.

సరే, ఆ సమయంలో నాకు తమరి యుద్ధకౌశలమూ, రణ దక్షత గుర్తుకొచ్చి- 'అయ్యో! వీళ్లకు ప్రాణాలమీద ఏమాత్రం ఆశ ఉన్నట్లు లేదే!" అనిపించింది.

అది అట్లా ఉండనీండి- విషంతో సమానాలైన ఆ దుర్మార్గపు మాటలు విని నా మనస్సుకు చాలా బాధ కలిగింది. అయినా నాకు నేను సర్ది చెప్పుకొని, ఆ రాజువైపు తిరిగి- "నేను ఒక సంగతి విన్నవించుకుంటాను. కోపపడరు కదా?!" అని అడిగాను.

"లేదు లేదు- చెప్పు" అని ఆయనచేత అనిపించుకొని, ఈ హితవచనాలు పలికాను-

"లోకంలో ఇతరుల సొమ్ముల్ని రమ్మనగానే వస్తాయా, ఎక్కడైనా? ఎందుకు, కాని పనిని గురించి వృధాగా సమయం వెచ్చించి ప్రయాస పడతారు? చెప్పేవాళ్ళు ఏదో, చెప్పారు అనుకున్నాగానీ, వినే వాళ్లకయినా జ్ఞానం ఉండాలికదా!

అట్లాకాక, 'దున్న ఈనింది' అనగానే 'దూడను కట్టెయ్యండి' అంటే, బుద్ధి రచ్చకెక్కుతుంది తప్పిస్తే దానివల్ల కోరిన కార్యం నెరవేరనే నెరవేరదే! అన్నీ తెలిసినవాడివి; నీకు తెలీని ధర్మం, అధర్మం వేరే ఏమున్నాయి? అంతులేని శత్రు సమూహాల విజృంభణాన్ని కూడా అణచి-వేయటంలో‌ పండినవాడు మా రాజు హిరణ్యగర్భుడు. వాళ్ళు-వీళ్ళలాగా ఆయన తక్కువవాడు అనుకోకండి. 'పరాక్రమంలో తిరుగు లేనివాడాయన' అని గుర్తించి, అటుపైన ఏదైనా నిర్ణయం తీసుకోండి.

పోగాలం దాపురించి, ప్రాణాలంటే తీపి తక్కువై, పొట్ట ఉబ్బరం తగ్గేందుకు ఏవేవో మాటలు మాట్లాడినంత మాత్రాన రాజ్యం దొరకదు. చింతలేమీ లేనట్లు, ఊరికే ఎందుకు, చెట్టును కొట్టి మీద వేసుకుంటారు? ఆయన పరాక్రమం ముందు ఎంత వారైనా నిలువలేరు. మీమీ పంతాలన్నీ ఆయన నొసలు ముడిచేంతవరకే అని గుర్తుంచుకోండి- అటుపైన అవేవీ చెల్లవు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా గొప్ప యుద్ధవిశారదులు. మీ అహంకారాన్ని వదలండి; మా మహారాజుతో వైరం పెట్టుకోకండి; మీ ప్రాణాల్ని కాపాడుకోండి. నోటి మాటలతోటే రాజ్యాధిపత్యం‌ వచ్చేస్తుందంటే నేను కూడా అనవచ్చు- 'మా ప్రభువైన హిరణ్యగర్భుడికి కూడా ఈ జంబూద్వీపంపైన అధికారం ఉన్నది' అని! అయినా ఈ చప్పిడి మాటలవల్ల ఏం ప్రయోజనం?!

ఇక్కడ చేరిన ఈ కొందరు తక్కువ రకం వారి నోళ్లకు అడ్డు లేదు గనుక, ఏలినవారి ముఖస్తుతి కోసం సభలో నోటికి వచ్చినట్లల్లా వదరచ్చు గానీ, తమ తప్పులవల్ల పని చెడిపోయి, ప్రభువులవారికి ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు, ఏం చెయ్యాలో తోచక, ఆశ్చర్యంతో స్తంభించిపోతాయి, వీళ్ళ మనసులు. అప్పుడు ఆకాశంకేసి చూడటం తప్ప వీళ్ళకి వేరే ఏమీ చేత కాదు. చిత్రవర్ణుడికి మా కర్పూర ద్వీపంపైన అధికారం ఉన్నదో, హిరణ్యగర్భుడికి మీ జంబూద్వీపంపై అధికారం ఉన్నదో నిర్ణయించేందుకు ఎలా వీలౌతుంది?" అన్నాను.

అప్పుడు విషసర్పాలను తినే ఆ నెమలి రాజు చిరునవ్వు నవ్వి, నాతో - "తొందర ఎందుకు? యుద్ధంతోటే అన్ని విషయాలూ తేలతాయి. ఇప్పుడు పోయి మీ రాజును యుద్ధానికి సిద్ధం కమ్మను.

ఇదిగో, ఒక్క క్షణం నిలు- మా దూత కూడా వస్తాడు, నీతో బాటు-" అని, తమ మంత్రివైపు తిరిగి "మంత్రిగారూ! మనకు ఇప్పుడు ఒక దూతను పంపవలసిన అవసరం ఉదయించింది. 'దక్షత, పనిని నెరవేర్చుకునే సమర్ధత, పాండిత్యం, ఇతరుల రహస్యాలను తెలుసుకోవటంలో నేర్పు ఉన్నవాడు' దూత పనికి తగినవాడు. ఈ కొంగతోబాటు హిరణ్యగర్భుడి దగ్గరికి దూతగా పంపేందుకు తగినవాడెవడో చెప్పండి" అన్నాడు.

అప్పుడు దూరదర్శి ఆ చిలుక వైపు చూపించి- "ఇదిగో, ఈ అరుణముఖుడే మీరు చెప్పిన అన్ని గుణాలూ కలవాడు- వయసు మళ్ళినవాడు; ఉత్తమ గుణాలున్నవాడు; మనకు అత్యంత విశ్వసనీయుడు- కాబట్టి దూతగా వెళ్ళేదుకు ఇతనే తగినవాడు. ఇతనిని పంపండి" అన్నది.

అయితే అప్పుడా చిలుక ముందుకు వచ్చి వినయంగా "ప్రభూ! నా నిలువెత్తు డబ్బు ఇచ్చినా అహంకారంతో విర్రవీగే ఈ కొంగతోపాటు పోయేందుకు ఇష్టపడను. ఎన్ని రకాలుగా చూసినా 'నన్ను ఈ కుత్సితపు కొంగతో పాటు పంపటం కొంచెం కూడా మేలు చేయదు' అనే అనిపిస్తున్నది. ప్రభువులవారి మాటకు ఎదురు చెబుతున్నాను అని కోపగించుకోకండి- ముందు నా మనవిని వినండి- అటుపైన తమరికి నచ్చినట్లు చేద్దురుగాని.

ఈ టక్కరి కొంగ ముందు వెళ్లటమే ఉత్తమం. వీడి వెనుకనే నేను కూడా‌ వెళ్తాను. అన్ని ధర్మాలూ తెలిసిన మీ అంతటివారికి చెప్పేవాడిని కాదు- నా తప్పును మన్నించండి- దుర్మార్గుడితో‌ కలిసి నడవటం కూడా ఆపదలనే తెచ్చి పెడుతుంది. ఇతడి గుణాలు ఎలాంటివో మనం మనవారి నుండి కథలు కథలుగా విని ఉన్నాం. కొంచెం దూరం పోనిచ్చి, అక్కడ నన్ను నిశ్శబ్దంగా మట్టుపెడితే ఏది, దిక్కు?

అంతేకాదు- పువ్వుతో కలిసి ఉన్న నారకూడా తలమీదికి ఎక్కి కులికినట్లుగా, మంచివారితో చేరిన దుర్మార్గుడికీ అనవసరపు గౌరవం లభిస్తుంది. అలాగే ఇనుముతో కూడిన అగ్ని దేవుడికి కూడా సమ్మెటపోట్లు తప్పని చందాన, హీనుడితో కలిసి ఉన్న మర్యాదస్తుడికి కూడా అగౌరవం ఎదురవుతుంది. సహవాసం వల్లనే గౌరవం, అగౌరవం లభిస్తుంటాయి కదా? చెడ్డవాళ్ళు చేసే పనుల ఫలితాన్ని వాళ్లకు సన్నిహితులుగా ఉన్న మంచివాళ్ళు కూడా తప్పక అనుభవించాల్సి వస్తుంది. ఇదివరకు ఒక కాకితో సావాసం చేసిన హంస కష్టాల పాలవ్వలేదా? తమరికి ఆ కథ చెబుతాను వినండి- అని హంస కాకి కథ చెప్ప సాగింది. (-ఆ కథ వచ్చేసారి..)