
పదవ తరగతి పరీక్షలు బాగా రాసింది శిల్ప. పేరున్న కాలేజీలో చేరుస్తానన్నాడు నాన్న. శిల్ప చాలా సంతోషంగా ఉంది. తన స్నేహితురాళ్ళు- వెన్నెల, మౌనికలకు ఈ సంగతి చెప్పింది. ముగ్గురూ కలిసి ఎక్కడికైనా వెళ్ళి వద్దామనుకున్నారు.
'కొండమీద స్వామీజీ వచ్చారంట- వెళ్ళి వద్దామా?' అంది వెన్నెల. 'అమ్మను అడిగి పోదాం' అంది శిల్ప. అమ్మను అడిగితే 'తొందరగా పోయి వచ్చేయండి'- అని పూజా సామగ్రి కోసం కొన్ని డబ్బులిచ్చింది.
ఊరి దగ్గర కొండమీద స్వామీజీ వచ్చి నెలరోజులు కావస్తోంది. జాతరను తలపించే జనం. కొండ క్రింద టెంకాయలు, పూలు అమ్మే అంగళ్ళు వెలిశాయి. రెండొందల మెట్లెక్కి కొండపైకి వెళ్ళాలి- స్వాములవారిని చూడాలంటే.
మెట్లెక్కబోతున్న పిల్లల్ని పిలిచింది పూలమ్మే ఆవిడ- "స్వామీజీకి పూలు పండ్లు తీసుకుపోండమ్మా!" అని. శిల్ప ఒక కొబ్బరికాయ, పూజాసామగ్రి ఇమ్మన్నది. "మంచివి ఇమ్మంటావామ్మా?" అడిగింది పూలామె.

"మంచివే ఇవ్వు; చెడ్డవి దేనికి?!" నవ్వారు మిత్రులు.
ఆవిడ కూడా నవ్వుతూ టెంకాయ, పూలు ఇచ్చింది- చిల్లర వెనక్కి ఇస్తూ "ఏం పేరు?" అడిగింది.
"శిల్ప".
"ఏం కావాలనుకుంటున్నావ్?"
"డాక్టరు" జవాబిచ్చింది శిల్ప.
ముగ్గురూ పైకి వెళ్ళి క్యూలో నిలబడ్డారు. తమ వంతు వచ్చేసరికి రెండు గంటలకు పైగా పట్టింది. ఎదుట నిలచి స్వాముల వారికి నమస్కరించారు.
అకస్మాత్తుగా స్వామి కళ్ళు తెరచి 'శిల్పా! అమ్మవారికి టెంకాయ సమర్పించు తల్లీ!" అన్నాడు!
శిల్ప నివ్వెరపోయింది.
ఆమె తేరుకునేలోపు స్వామీజీ అడిగాడు- "డాక్టరు కావాలనుకుంటున్నావు కదూ!?" అని.
మౌనంగా తల ఊపింది శిల్ప.
"అయితే నేను చెప్పింది చెయ్యి. ముందు టెంకాయ కొట్టు, అమ్మవారి ముందు!" అన్నాడు స్వామీజీ.
టెంకాయ కొట్టింది శిల్ప.
ఆశ్చర్యం! టెంకాయలోంచి నీళ్ళు రాలేదు! మల్లెపూలు రాలాయి!
మరుక్షణం అక్కడ చేరిన వాళ్ళంతా "స్వామి వాక్కు బ్రహ్మ వాక్కు!" అని భజన మొదలు పెట్టారు బిగ్గరగా.

ఒక శిష్యుడు ముందుకొచ్చి "తల్లీ! స్వామి వారికి దక్షిణ ఏదైనా సమర్పించుకో! నీ పంట పండింది!" అన్నాడు.
చిల్లర ఇవ్వబోయింది శిల్ప.
"అదికాదు! నీ మెడలోని బంగారు గొలుసు ఇవ్వు. అమ్మవారికి బంగారం ప్రీతిపాత్రం. అది సమర్పిస్తే నీ కోరిక తప్పక ఫలిస్తుంది" అన్నారు అక్కడ చేరిన వాళ్ళెవరో.
స్నేహితులు కూడా వంత పాడారు. ఇక వెనకా ముందు ఆలోచించకుండా గొలుసు ఇచ్చి ఇంటికొచ్చింది శిల్ప.
బోసిపోయిన మెడను చూసీ చూడగానే 'గొలుసేదే?' అని అడిగింది అమ్మ.
'స్వామీజీకి సమర్పించాను' అన్నది శిల్ప.
అమ్మ ఏడుపు ముఖం పెట్టింది. నాన్న చిందులేశాడు. శిల్ప ఏడుపు లంకించుకున్నది. స్నేహితులు అంతకు ముందే మాయమయ్యారు!
పట్నంలో కాలేజీ చదువులు చదువుతున్న 'డౌసు' అన్న అదే సమయానికి ఇంటికొచ్చాడు. పరుగున పోయి అన్నను పట్టుకొని ఏడ్చింది శిల్ప. అమ్మ అంతా వివరించింది.
డౌసు నవ్వాడు- "కొబ్బరి కాయలోంచి పూలు రాలితే మహాత్యం అనుకున్నావు కదూ!" అన్నాడు.
"అవును" అన్నట్లు తల ఊపింది శిల్ప.
"నీ పేరు కూడా చెప్పేసేసరికి ఇక నోరెత్తలేకపోయావు!" నవ్వాడు డౌసు. "అదంతా గారడీ శిల్పా; ఒట్టి మ్యాజిక్ అది! మాయ మంత్రాలు కాదు- ఆ స్వామి బలే మోసగాడు. అంతెందుకు; కావాలంటే నువ్వూ తెప్పించగలవు, కొబ్బరి కాయలోంచి పూలు!" అన్నాడు.

"అదెలా?" అని ప్రశ్నమార్కు మొహం పెట్టింది శిల్ప.
నేను నేర్పుతాను ఆగు- "అమ్మా! ఒక కొబ్బరికాయ, కొన్ని మల్లెపూలు ఇవ్వు- అట్లాగే ఒక స్ట్రా కూడా!" అని అడిగి తీసుకున్నాడు డౌసు.
"ముందు టెంకాయను ఒలచాలి. జుట్టు కొంచెం ఎక్కువ ఉండేట్లు వదలాలి"
శిల్ప టెంకాయను వలిచి తీసుకు వచ్చింది.
"బాగుంది- తెలుసుగా, టెంకాయకు మూడు కన్నులు ఉంటాయి- వీటిని ఒత్తి చూడాలి. ఒక కన్ను పొర పలచగా ఉంటుంది-ఎందుకో తెలుసా?
మొక్క మొలకెత్తి ఆ కన్నులోంచే బయటికి వస్తుందన్నమాట!- దాన్ని గుర్తు పట్టాలి" చెప్పాడు డౌసు.
"దొరికింది- ఈ కన్నే గద! కొంచెం పలచగా ఉంది" చెప్పింది శిల్ప.
"అవును- అదే. ఇప్పుడు దాని మీద ఉన్న జుట్టును కొంచెం ప్రక్కకు నెట్టి, జుట్టు ఊడకుండా ఆ కన్నుకు రంధ్రం చెయ్యాలి-" శిల్ప అప్పటికే రంధ్రం చేసేసింది ఓ మేకుతో.
"ఇప్పుడేం చెయ్యాలో తెలుసుగా? ముందు ఎంచక్కా స్ట్రా పెట్టి కొబ్బరి నీళ్ళు త్రాగెయ్యాలి! చాలా బాగుంటై, తియ్యగా- నాకు టెంకాయ నీళ్లంటే చాలా ఇష్టం!" నవ్వాడు డౌసు.
ఇద్దరూ తలా కొన్ని నీళ్ళు త్రాగారు.
"ఊఁ..ఇప్పుడు మల్లెపూలను రంధ్రంలోంచి దూర్చాలి, కొబ్బరికాయలోకి. ఎన్ని కావాలనుకుంటే అన్ని దూర్చచ్చు.." ఇద్దరూ కలిసి చాలా పూలను టెంకాయలోకి దూర్చారు.
"కానీ..నేను తీసుకెళ్ళిన కొబ్బరికాయకు రంధ్రం లేదు!" అంది శిల్ప.
"దీనికీ ఉండదు- చూడు- కొంచెం కర్పూరం ఇవ్వమ్మా!" అమ్మ కర్పూరం తెచ్చి ఇచ్చింది.
"దీంతో రంధ్రాన్ని మూసేస్తాం!..ఇలాగ" నవ్వుతూ, కొబ్బరికాయ పైనున్న జుట్టును రంధ్రం పైకి జరిపి, సర్దేశాడు డౌసు.
"చూడు ఈ కొబ్బరి కాయకు రంధ్రం ఏముంది?!"
శిల్ప కొబ్బరి కాయను చేత పట్టుకొని చూసింది. 'నిజమే..తేడా ఏమీ కనబడటం లేదు.'
"ఇప్పుడు ఈ కొబ్బరికాయను కొడితే నీళ్ళెందుకు వస్తాయి? పూలే రాలతాయి గానీ!!" నవ్వాడు డౌసు. అమ్మ కూడా నవ్వేసింది.
"కానీ మరి, ఆ టెంకాయను స్వామీజీ ఇవ్వలేదు నాకు!" అనుమానంగా అంది శిల్ప.
"అవును చెల్లీ, ఇలాంటి టెంకాయల్ని టెంకాయలు అమ్మేవాళ్లద్వారానే అమ్మిస్తారు. స్పెషల్ కొబ్బరికాయని అమ్మినప్పుడే దాన్ని కొన్నవారి పేరును, కోరికలను కనుక్కొని, సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ చేసేది ఎంత పని!? స్వాముల వారు తలచుకొంటే ఇలాంటి ఏజంట్లకు ఏం కొదవ?!" అన్నాడు డౌసు.
"మరి, మొన్న ఎవరి టెంకాయలోంచో పసుపు నీళ్ళు వచ్చాయటనే, అది ఎలా సాధ్యం?" అడిగింది శిల్ప.
"పసుపు కుంకుమ నీళ్ళను సిరెంజిలో తీసుకొని, కొబ్బరికాయ కన్నుకు ఇంజక్షన్ చేయటం! అంతే!" నవ్వారు అందరూ.
"మరి ఇప్పుడేం చేద్దాం?" అంది శిల్ప తన బంగారుగొలుసును తలచుకొని చిన్నబోతూ. "ఏముంది, పదండి పోలీస్ స్టేషన్‌కు!" అని డౌసు బయటికి దారి తీశాడు.
"సారీ నాన్నా, ఇప్పుడు ఏమీ చెయ్యలేము. మీరు ఇట్లా రావటం చూసి స్వామీజీ అట్లా జెండా పీకేశారు- కాదు కాదు, 'అత్యవసరంగా సమాధిస్థులయ్యారు'. -అయినా బాబాలు చెబితే ఎవ్వరూ డాక్టరు కారమ్మా, కష్టపడి చదివి డాక్టర్లవ్వాలి!" అన్నారు యస్సైగారు, సంగతి కనుక్కొని.
ఆనాటినుండీ శిల్ప నేర్చుకున్నది- 'ప్రపంచంలో గమనించిన ప్రతి విషయాన్నీ 'ఎందుకు, ఏమిటి, ఎలా?' అని ప్రశ్నించటం. మీరూ ప్రశ్నిస్తారు కదూ? ఊరికే మోసపోకండి మరి, శిల్ప మాదిరి!