బూర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివే రాజేష్ స్వతహాగా తెలివైన పిల్లవాడు. అందువల్లనేనేమో, వాడిలో గర్వం పాలు కూడా ఎక్కువ.

మామూలుగా తరగతిలో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు వాడు. తరగతి పరీక్షలన్నింటిలో కూడా చక చకా సమాధానాలు రాసేవాడు. ఉపాధ్యాయులు అందరూ సహజంగానే రాజేష్‌ను మెచ్చుకొనేవారు. దాంతో వాడు మరింత ఉబ్బిపోయి, తోటి విద్యార్థుల సామర్థ్యాలను చిన్నచూపు చూడటం కూడా మొదలు పెట్టాడు.

కాలచక్రం గిర్రున తిరిగింది. రాజేష్ 5వతరగతికి చేరుకున్నాడు. 'తనే తెలివైన వాడు' అన్న గర్వం నిండింది వాడిలో. దాంతో ఇప్పుడు వాడు తరగతి పుస్తకాలను కూడా సరిగా చదవటం లేదు. ఉపాధ్యాయులు కూడా వాడిని ఈ విషయమై ఒకటికి రెండుసార్లు హెచ్చరించారు- 'సరిగా చదవక పోతే నష్టపోతావురా' అని. వారి మాటల్ని రాజేష్ ఏమాత్రం పట్టించుకోలేదు.

ఇంతలో గురుకుల పాఠశాలలో 6వతరగతి ప్రవేశానికి ప్రకటన వచ్చింది. పాఠశాలలో బాగా చదివే వాళ్ళంతా దానికి దరఖాస్తు చేసు కున్నారు.గురుకులపాఠశాలలో చదువులు బాగుంటాయి.అనుభవజ్ఞులైన అధ్యాపకు

లుంటారు. వసతి, ఖర్చులు మొత్తం ప్రభుత్వం వారు చూసుకుంటారు! గురుకుల పాఠశాలలో ప్రవేశం దొరకటం కూడా గౌరవప్రదమే. దరఖాస్తు చేసిన పిల్లలందరూ కష్టపడి చదవసాగారు.

పరీక్ష రాసేసి బయటికి వచ్చాక రాజేష్ గొప్పలు చెప్పుకోవడం వెంకటేష్, పవన్‌ల కంటబడింది. "గురుకుల పాఠశాలలో నాకు తప్పక సీటు వస్తుంది. ఇంక ఎవరికీ కూడా సీటురాదు" అంటున్నాడు రాజేష్ .

ఐదో తరగతిలో ఉన్న విద్యార్థులందరిలోనూ సున్నిత హృదయులు వెంకటేష్, పవన్. ఇద్దరూ చక్కగా, నిలకడగా చదివేవాళ్ళు. రాజేష్ మాటలు విని వాళ్ళు చాలా ఆందోళనకు గురయ్యారు. అయితే "ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు- బాగా చదివి, పరీక్షలు చక్కగా రాయటం వరకూ మన చేతుల్లో ఉంది. మీరు బాగానే రాశారు కదా, మీకూ సీటు రావచ్చులే. ఆందోళన పడకండి." అని ఉపాధ్యాయులు వాళ్ళను ఊరడించి పంపారు.

కొద్దిరోజుల్లోనే గురుకుల పాఠశాల ఫలితాలు వెలువడ్డాయి. వెంకటేష్, పవన్‌లకు ప్రవేశం వచ్చింది. గర్వంతో విర్రవీగే రాజేష్ మాత్రం సెలెక్టు కాలేదు.

అందరూ వెంకటేష్, పవన్‌లను అభినం-దించారు. చిన్నబోయిన రాజేష్‌ను ఉపాధ్యాయులు ఊరడించారు-"ఫర్వాలేదులే రాజేష్, ఐదో తరగతిలో నువ్వు అంత బాగా చదవలేదుగా?! పై తరగతుల్లో బాగా చదువుదువులే, ఏం కాదు!" అన్నారు.