గుంటూరు జిల్లాలో ఓ గ్రామంలో వసతులూ సౌకర్యాలు అంతగాలేవు; ఊరి మొత్తం మీదా ఒకే ఒక బడి ఉంది. ఆ బడిలో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు బోధిస్తారు. అక్కడ ఏడో తరగతి చదివే రాముడు అన్నింటిలోను అందరికంటే ముందుండేవాడు. అతని అన్నయ్య కృష్ణుడు, ఇప్పుడు పదో తరగతి- చదువులో కొంచెం వెనకబడేవాడు.

క్రితంసారి వార్షిక పరీక్షలలో రాముడికి 600కు గాను 550మార్కులు వచ్చాయి. అన్న కృష్ణుడు మటుకు 350 మార్కులే తెచ్చుకొని పదో తరగతిలోకి వచ్చాడు.

బడికి వెళ్తే ఉపాధ్యాయులు, ఇంటికెళ్తే నాన్న- "నీకు తెలివి లేదురా, నువ్వు చదవలేవు" అని కృష్ణుడిని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్ళు.

"నువ్వు పదో తరగతిలో కనీసం 500మార్కులు సంపాదించుకోపోతే ఇక చదువు ఆపించేస్తా. ఏదైనా పనిలో చేర్పిస్తా" అని బెదిరిస్తూండేవాడు నాన్న. "కనీసం తమ్ముడికున్నంత శ్రద్ధ కూడా లేకపోతే ఎలారా? ఏదైనా పని నేర్చుకో, పోనీ" అని అమ్మ సూదిలాగా పొడుస్తుండేది వాడిని.

డిసెంబరు నెల వచ్చేసింది. 10వతరగతి పబ్లిక్‌పరీక్షలకు ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. బడిలో అన్ని సబ్జెక్టులూ దాదాపు చివరికి వచ్చేశాయి. కానీ కృష్ణుడికి మాత్రం ఏ సమాధానాలూ రావు!

వాడికి తన కష్టాన్ని తలచుకొని ఏడుపు వచ్చేసింది ఒకరోజున. చెట్టు క్రింద కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తున్న అన్నను చూసి రాముడికి చాలా బాధ వేసింది. అతనిని ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అయితే వాడు ఓదార్చిన కొద్దీ కృష్ణుడి బాధ మరింత ఎక్కువైంది. "నీకేమిరా, నువ్వు తెలివిగల వాడివి, నువ్వు చదువుతావు; నేనేకద, తెలివిలేని మొద్దును! నాకేమీ రాదు" అని ఏడుస్తున్నాడు.

"నేనంటే చదువుతున్నాననుకో, మరి నువ్వేం చేస్తున్నావన్నా, రోజూ బడికెళ్ళి?" అని ప్రశ్నించాడు రాముడు.

"నేను కూడా చదువుతున్నానురా, కానీ ఏదీ గుర్తుండటం లేదు" అన్నాడు కృష్ణుడు, ఏడుపు ఆపి.

"అన్నయ్యా! నువ్వు ఎప్పుడు చదివినా ఏదో భయంతో చదువుతున్నావు తప్ప, ఇష్టంగా చదవడం లేదు. ఇంక- నీకు ఏదీ గుర్తుండట్లేదు అన్నావే, అదేమీ కాదు. అట్లాగే జరిగితే నీకు ఈ కాసిని మార్కులూ వచ్చేవి కాదు గద! నీకు తెలివి తేటలు ఉన్నాయి, కృషి చేసే శక్తీ ఉన్నది- కాసింత భయం వదిలేసి చదువురా అన్నయ్యా; అన్నీ గుర్తుంటాయి!" అన్నాడు రాముడు.

"తల్లిదండ్రులంటేనూ, గురువులంటేనూ భయం-భక్తి ఉండాలి కదరా" అన్నాడు కృష్ణుడు.

"ఏమోనన్నా, కానీ మనం చదివే విషయాల పట్ల 'భయం-భక్తీ' ఉన్నా-లేకున్నా, 'శ్రద్ధ-ఆసక్తి'మటుకు ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఇష్టంగా, శ్రద్ధగా దేన్ని చదివినా అది గుర్తుండిపోతుంది, నిజం" అన్నాడు రాముడు.

"అయినా ఇప్పుడు అనుకొని ఏం ప్రయోజనంరా? డిసెంబరు వచ్చేసింది! ఇంకా మూడు నెలలే ఉన్నది!" అన్నాడు కృష్ణుడు, కంట తడి పెడుతూ.

"దానిదేముందన్నా, మూడు నెలలు ఏమంత తక్కువ సమయం కాదు. మనసుపెట్టి చదివితే మూడు నెలల్లో అంతా వచ్చేస్తుంది. ప్రయత్నించి చూడు" అన్నాడు రాముడు, ఉత్సాహంగా.

తమ్ముడి మాటలు కృష్ణుడిలో ఉత్సాహాన్ని నింపాయి. "సరేరా తమ్ముడూ! ఇప్పటినుండీ నువ్వు చెప్పినట్లు మనసుపెట్టి, పట్టుదలగా చదువుతాను. ఐదు వందల మార్కులు దాటాలని ప్రయత్నిస్తానురా, చూస్తూండు" అన్నాడు వాడు పట్టుదలగా.

రాముడు కూడా నవ్వుతూ "అన్నా! నువ్వు ఐదు వందల మార్కులు తెచ్చుకొంటే నీకు అందమైన బహుమతి ఇస్తాను. రా, మరి చదువు మొదలు పెడదాం" అన్నాడు.

కృష్ణుడు అప్పట్నుంచీ బాగాచదివాడు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో వాడికి 530మార్కులు వచ్చాయి. తరగతి మొత్తంలోను వాడిది మూడోర్యాంకు!

"చివర్లో చివర్లో‌ బాగా చదివావురా, మంచి మార్కులే సంపాదించావు!" అని టీచర్లు అందరూ ఆశ్చర్యపోయారు. "పర్లేదురా కృష్ణా" అని అమ్మ,నాన్నలు సంతోష పడ్డారు.

రాముడు సొంత డబ్బులతో ఒక 'English dictionary' కొని అన్నకు బహుమతిగా ఇచ్చాడు- "మూడు నెలలు చదివి ఐదొందల ముఫ్ఫై మార్కులు తెచ్చుకున్నావురా, అన్నయ్యా! మరి మొదటినుండీ చదివి ఉంటే ఏమయ్యేదో!" అంటూ.

"ఇకనుండీ చూసుకోరా, దంచేస్తాను. అయినా భయం-భక్తుల గురించి నువ్వు భలే చెప్పావురా, నాకు చాలా నచ్చింది!" అన్నాడు కృష్ణుడు, రాముడిని మెచ్చుకుంటూ.