"బొమ్మకు కథ"కు మూడు స్పందనలు రావటం మంచి పరిణామం. లలితగారికి, కొత్తపల్లి బృందానికీ తప్పకుండా ఇది సంతోషం కలిగించి వుంటుంది. 'విషాదయాత్ర', 'సాహసయాత్ర' కథల్లో జయదీప్, కార్తీక్‌ల భాష, శైలి, పకడ్బందీగా సాగిన కథనం వారి వయస్సుకు తగ్గ (ఓ పిసరు ఎక్కువే నేమో)పరిణతిని ప్రతిఫలించాయి. జయదీప్ రచనలో ఆంగ్ల సాహిత్యపు వాసనలు కాస్త ఘాటుగానే అనిపించాయి. కార్తీక్ శైలి చిన్నప్పటి తెలుగు డిటెక్టివ్ నవలలని గుర్తుకు తెచ్చింది. రాజేశ్వరి ప్రయత్నం బావుంది - వయసుకు తగ్గ అమాయకత్వంతో .

'పరివర్తన', 'ఇష్టంతో చేస్తే' కథల మధ్య భావసారూప్యత వుంది. మనసుకు నచ్చే పని చెయ్యలేక, చేసే పని పై ఇష్టాన్ని పెంచుకోలేక చాలా మంది అమృత లానే తయారవుతారేమో! నెల ఆఖరున వచ్చే జీతం తప్ప వారిని ఉత్సాహపరిచే విషయమేమీ ఉండదు. అలాంటి ఆవిడకి కూడా మంచి దారి దొరకటం బాగుంది.

'పరివర్తన' కథకి ముందు- దాన్ని యథాతథంగా ప్రచురించలేక మార్చారని వ్రాశారు. అంటే మిగిలిన కథలన్నీ యథాతథంగా ప్రచురిస్తున్నవనా? పిల్లల రచనలలో ఎంత మాత్రం వారి సొంతం, ఏది ఎన్ని మార్పు చేర్పులకు గురవుతున్నది, ఆ కథల్లో పిల్లల పాత్ర ఎంత, ఇది వివరిస్తే బాగుంటుంది.

'ఇష్టంతో చేస్తే' కథాంశం, భాష, కథనం - మూడూ కూడా నాలుగో తరగతి పిల్లవాడికి చాలా‌ పై స్థాయివిగా అనిపించాయి. కథ బాగుంది -అందులో సందేహం లేదు.

విశాల్ వ్రాసిన 'సహాయం ', సాయికుమార్ వ్రాసిన 'చెడపకురా చెడేవు ', ఒరిజినల్‌గా అనిపించాయి. వేణుగోపాల్ 'మంచి మాటల మహిమ ' లో ఒక మంచి విషయాన్ని, ఓ మంచి వస్తువు ద్వారా చెప్పాడు.

హైమావతిగారి కథకి 'అవ్వ చెప్పిన కథ' అనే శీర్షిక బావుంది. కథలు చెప్పడంలో మంచి టెక్నిక్ వున్న ఆవిడ ఈ శీర్షికతో మరిన్ని కథలనందించటం నిజంగా బాగుంటుంది.

రాథగారి 'ఆవకాయ మంత్రం' సరదాగా వుంది.

నారాయణ గారి 'ఉగాది ' పేరుకీ, కథకీ పెద్ద సంబంధం లేదనిపించింది. అలేఖ్య ఎప్పుడూ అంతకు ముందు వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్ళలేదో- ఏంటో మరి - ఇంటిని గుర్తైనా పట్టలేదు.

చాలా కథలకు ఈసారి బొమ్మలు బాగున్నాయి.

యువకెరటాలలో సౌమ్యగారు వ్రాసిన ఆఖరి పేరా బాగుంది. పాఠ్యపుస్తకాలు, స్కూళ్ళ హద్దులు దాటి పిల్లలు చదువుకోవాలి. నిజంగా!

అంతేకాదు - నేర్చుకోవాలనే జిజ్ఞాస, నేర్చుకోవటం అనే తతంగం - నిరంతరంగా సాగుతూనే వుండాలి. అవార్డులకోసమూ కాదు, పరీక్షల కోసమూ కాదు. 'ఇది పరీక్షల నెల - బాగా చదువుకోవాలి' అనుకోవలసి రావడం మనం మార్చలేని దౌర్భాగ్యం. దీని కెవరూ అతీతులు కారు కాబోలు!

ఎలాంటి పరీక్షలూ లేకుండా, ఎగిసిపడే ఉత్సుకతతో, నిరంతర జిజ్ఞాసతో, నిత్య చైతన్యంతో, నేర్చుకోవడమనే సంతోషకరమైన అనుభవమే 'చదువు 'గా అనబడే రోజు కోసం ఎదురు చూద్దాం.

సంపాదకులనుండి ఓ మాట...

కొత్తపల్లిలో ప్రచురించే కథల్ని సరిచూడటం, పద బంధాలను, వాక్య నిర్మాణాలను సరిదిద్దటం, శైలిలో పత్రికకు అనువుగా సవరణలు చేయటం సంపాదకుల బాధ్యత. కొన్ని సందర్భాలలో, అవసరమనిపిస్తే కథాంశాల మూల రూపాల్ని కూడా మార్చటం జరుగుతుంది. పిల్లలు వ్రాసే కథల్ని త్రిప్పి పంపి వారి ఉత్సాహాన్ని నీరు కార్చటం ఇష్టం లేక పోవటం దీనికి గల అనేక కారణాల్లో ఒకటి. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు సమయం కుదిరితే సరి- లేని పక్షంలో సంపాదకులదే తుది నిర్ణయం. -సం.