
గీత వాళ్లింట్లో కరెంటు పోయింది. ఎందుకు? ఏమో,తెలీదు. కరెంటు పోయిందంతే.
మరి మిగిలిన వాళ్ల ఇళ్లలో? కరెంటు ఉంది!
అయితే యీ విషయం గీతకు, వాళ్లమ్మకు తెలిసే సరికి సాయంత్రం ఐపోయింది. ఇప్పుడేం చెయ్యాలి?
ఏమో, తెలీదు.
గీత వాళ్ల నాన్న ఉండి ఉంటే, ఆయన ఏదో ఒకటి చేసేవాడు. ఇప్పుడు మరి, ఆయన లేడు కదా, ఏ ఒకటి చెయ్యాలో ఎవ్వరికీ తెలీదు.
గీత వాళ్లమ్మ క్యాండిల్ కోసం వెతికింది. చిన్న ముక్క ఉండాలి ఎక్కడో. కానీ అదిప్పుడు దొరకలేదు.
గీతకు , వాళ్లమ్మకు ఏం చెయ్యాలో తెలీలేదు.
గీత వాళ్ల నాన్నే ఉండి ఉంటే, ఆయన ఏదో ఒకటి చేసేవాడు.
సాయంత్రం కాస్తా రాత్రి అయ్యింది మెల్ల మెల్లగా . చుట్టూ అందరి ఇళ్లలోనూ లైట్లు వెలిగాయి. గీత వాళ్లింట్లో మటుకు చీకటి రాజ్యం ఏలుతోంది.
గీత, వాళ్లమ్మ ఇంటి ముందు మెట్ల మీద కూచున్నారు చీకట్లోనే.

దోమలు "గుయ్ ...గుయ్.." మంటున్నాయి చెవుల్లో.
రాత్రికి అన్నం తినేదెట్లాగ? తెలీదు.
ఈ దోమలతో నిద్రపోయేదెట్లాగ? తెలీదు.
దోమతెర ఎక్కడుంది? దాన్ని కట్టుకునేదెలాగ? తెలీదు.
టి.వి.లో వచ్చే సీరియల్ మ్రోగుతోంది పక్కవాళ్ల ఇంట్లోంచి. మామూలుగా ఐతే అది గీత వాళ్ల ఇంట్లో కూడా మ్రోగుతూ ఉండాలి. గీతకి నిద్ర రావటం మొదలైంది. గీత వాళ్లమ్మకి ఆకలౌతోంది.
ఇంటి లోపల "గణ్ ..గణ్..." మని ఏదో శబ్దం . "పిల్లా..!?! ..దొంగేమో....?!... దయ్యం కావచ్చు! తెలీదు .
గీత వాళ్లమ్మ లోపలికి వెళ్లి చూడలేదు.
గీతకూడా చూడలేదు.
గీతవాళ్ల నాన్నే ఉండి ఉంటే , ఆయన ఏదో ఒకటి చేసేవాడు. ఆయన ఒక్కరోజు పనిమీద పట్నం వెళ్లాడు, రేపు సాయంత్రానికి గానీ రాడు...
ఇంట్లో ఎవరో కుర్చీని నెట్టినట్లున్నారు- "గణ్..ణ్..ణ్.."మని శబ్దం వచ్చింది. అటుపైన బీరువా తలుపు శబ్దం-
"పోవ్... ఏంటా శబ్దం?" అడిగింది గీత వాళ్లమ్మ.
"ఏమో తెలీదు" అంది గీత.
నిజంగానే , అ పాప అసలు ఏ శబ్దాన్నీ వినలేదు!
గీత వాళ్లమ్మకు ఏం చెయ్యాలో తెలీలేదు.
వాళ్ల నాన్న ఉంటే......
ఎవరో బట్టని పట్టుకొని చింపుతున్నట్లు "పర్.." మని శబ్దం వచ్చింది ఇంట్లోంచి.
"ఇంటిలో ఎవరో ఉన్నారు- ..ఇంటికున్నది ఒకటే వాకిలి. ఆ వాకిలి దగ్గరే, గీత వాళ్లు కూర్చున్నది! మరి ఎవరైనా ఎట్లా వెళ్లి ఉంటారు, లోపలికి?..."
"పోవ్, వినిపించిందా, శబ్దం?" అమ్మ అడిగింది మళ్లీ.
గీత బద్ధకంగా తల ఊపింది. " ఆc- కానీ అదేంటో నన్ను అడగొద్దు అమ్మా.. నాకు తెలీదు... నిద్రొస్తోంది..."
గీత వాళ్ల అమ్మ లోపలికెళ్లి చూద్దామనుకున్నది. కానీ వెళ్లలేదు. అయితే లోపలికి వెళ్లకుండా ఏం చెయ్యాలి? తెలీలేదు.
అందుకని మళ్లీ అక్కడే కూర్చున్నది, సర్దుకొని.
గీత వాళ్ల నాన్న ఉండి ఉంటే...

వంట ఇంట్లో గిన్నెలన్నీ గణ గణలాడుతున్నై . శబ్దం తీవ్రత బాగానే పెరిగింది.
గీతకి ఏమీ భయం వెయ్యలేదు. ఆ పాప అక్కడే కూర్చొని కునికి పాట్లు పడుతున్నది.
గీతా వాళ్లమ్మకి భయం వేసింది. పక్కింటి వాళ్లని పిలుద్దామనుకున్నది; వద్దనుకున్నది; సరే పిలుద్దాం అనుకున్నది; చివరికి మరోసారి గీతవాళ్ల
నాన్నను తలచుకొని, వెళ్లి పక్కింటి తలుపు తట్టింది.
ఆలోగా మరో సంగతి- గీతకి తలలో బాగా పేలున్నై , వాళ్లమ్మ ఎన్నిసార్లు పేలు ఏరిందో లెక్కలేదు. ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టింది. ఒక్కొక్క పాయనీ వేరు చేస్తూ , ..పేలు చూస్తోంది, జాగ్రత్తగా. నిద్రమత్తులో సగం జోగుతున్న గీతకి ఇలా పేలు చూస్తుంటే హాయిగా అనిపిస్తోంది. ఇంకా నిద్రవస్తోంది మత్తుగా.
ఆ టైంలో తలుపుతట్టిన గీతా వాళ్లమ్మని చూసి పక్కింటి వాళ్లు ఆశ్చర్యపోయారు. "కరెంటు లేదా? మరి చెప్పలేదేం, ఇంతసేపూ?" అన్నారు. వాళ్లబ్బాయి కటింగ్ ప్లయర్సూ, స్ర్కూడ్రైవరూ పట్టుకొని వచ్చే సరికి కొంచెం టైం పట్టింది. వాడు టార్చిలైటు పట్టుకొని బయల్దేరాడు. "ఫ్యూజు
పోయి ఉంటుంది ఆంటీ" అంటూ.
గీత వాళ్ల ఇంటి గుమ్మం మీదికి టార్చివేయగానే ఇద్దరూ కెవ్వున అరిచారు! గీతకి పేలు చూస్తున్న కోతి ఒకటి వీళ్లకేసి, వీళ్ల టార్చికేసి చూసి కోపంగా పళ్లునూరి, గబుక్కున లేచి బయటి గోడదూకి పోయింది!

గీత ఉలిక్కిపడి లేచి- "ఏంటి పో, అట్లా అరుస్తావు? నాకు భయమైంది ఒక్కసారికీ!!" అన్నది మళ్ళీ నిద్రలోకి జారుతూ.
గీతా వాళ్లమ్మకి ఏం అనాలో తెలీలేదు.
కోతి పీకేసిన కరెంటు వైరును పక్కింటి వాళ్ళ అబ్బాయి సవరించగానే ఇంట్లో లైట్లు వెలిగాయి. ఆ వెలుతురులో గీత వాళ్లమ్మకి వంటింట్లో జరిగిన భీభత్సం అంతా కనబడి ఏడుపు వచ్చినంత పనైంది:
పాలు-పెరుగుతో సహా పప్పులు-ఉప్పులు అన్నీ క్రింద బోర్లించి ఉన్నై . పరుపు బట్టలన్నీ చించి పడేసి ఉన్నై, ఇల్లంతటా. బీరువా రెక్క తీసి ఉంది.
అందులో సామాన్లన్నీ నేలమీద కుప్పవేసి ఉన్నై .
"పోవ్.. ఒక్క కోతి ఇంత పని చేస్తుందని నాకు తెలీనే తెలీదు!" అన్నది గీత వాళ్లమ్మ .
"నాకూ తెలీదు" అన్నది గీత , నిద్రపోతూనే .
వాళ్లమ్మకి ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. "వీళ్ల నాన్న ఉండి ఉంటే.." అనుకున్నది సామాన్లన్నీ సర్దుతూ.