తాతయ్య ఏదో పుస్తకాన్ని కళ్ళముందు పెట్టుకొని, పడక్కుర్చీలో హాయిగా నిద్రపోతున్నాడు.

దగ్గరకెళ్ళి 'అదేం పుస్తకం?' అని చూసింది చిట్టి.

పుస్తకం తిరగతిప్పి ఉంది. కవరు మీద అక్షరాలన్నీ వెనక్కి తిరిగి ఉన్నై.

చిట్టికి చదవటం వొచ్చు. ఇట్లా తిరగబడి ఉన్న వాటిని కూడుకొని చదవటం కూడా.

"ఒరేయ్! అన్నయ్యా!" కేక వేసింది అక్కడినుండే.

తాతయ్య కొంచెం కదిలి, మళ్ళీ పడుకున్నాడు. అయినా తాతయ్యకు చెముడు- ఎంత అరిచినా ఏం కాదు. వినబడితే గదా?!

అన్నయ్య చిట్టికంటే రెండేళ్ళు పెద్ద.

"నీకు అక్షరాల్ని తిరగతిప్పి చదవటం వొచ్చా?" అడిగింది చిట్టి, వాడు వచ్చాక.

"ఓఁ!" అన్నాడు వాడు.

"మరైతే నేను రాస్తానొకటి. చదువుతావా?" అంది చిట్టి.

"ఓఁ!" అన్నాడు వాడు మళ్ళీ.

"ద డి గా డు వా న వి ది చ" రాసింది చిట్టి. "దీన్ని తిరగదిప్పి చదువు, చూద్దాం!"

వాడు పైకి చదవలేదు. మనసులోనే చదువుకున్నాడు. చదివి- ఉడుక్కున్నాడు.

"ఊఁ! చదువు!" అంది చిట్టి కిసకిసా నవ్వుతూ.

"చదివాలే!" అన్నాడు వాడు గుర్రుగా.

"అట్లా కాదు! పైకి చదవాలి, గట్టిగా!" అంది చిట్టి.

"ఆ సంగతి నువ్వు ముందు చెప్పలేదు. అందుకని నేను మనసులోనే చదివేసుకున్నాను" అన్నాడు అన్న తెలివిగా. మళ్ళీ అన్నాడు వాడే- "నీకు రాయటం మా బాగా వచ్చేమో- ఏదీ, నేను చెప్పింది రాయి, చూద్దాం!" అని.

"చెప్పు, నేనెందుకు రాయలేను?!" అంది చిట్టి- తనకి పెన్నుతో రాయటం అంటే ఇష్టం.

"ద డి గా ప పా న సి రా" -ఒక్కొక్క అక్షరం పలుక్కుంటూ రాసింది చిట్టి.

"ఇప్పుడు చదువుకో, వెనకనించి!" అన్నాడు అన్న, వికవికా నవ్వుతూ.

చిట్టి కూడబలుక్కొని చదివింది, వెనకనుండి. బయటికి చదవలేదు- తనూ మనసులోనే చదువుకున్నది. చదివినకొద్దీ ఆ పాప ముఖంలో రంగులు మారినై.

"చూశావా! దెబ్బకు దెబ్బ! చెల్లుకు చెల్లు!" అన్నాడు అన్న, పోబోతూ.

"ఆగాగు! చెల్లిని మోసం చెయ్యటం కాదు- చేతనైతే నేను రాసింది చదువు!" అన్నాడు తాతయ్య, అకస్మాత్తుగా కళ్ళు తెరిచి. చిట్టి వింతగా చూసింది- "తాతయ్యకు వినబడిందే!" అని.

తాతయ్య రాశాడు పెద్దగా- వంకర టింకరగా, నవ్వుకుంటూ-

రాశాక దానికింద రెండు గీతలు గీశాడు గర్వంగా.

"నాకు కన్నడం రాదు! చేతనైతే తెలుగులో రాయి. అప్పుడు చదవకపోతే అడుగు!" దాన్ని చూడగానే అన్నాడు అన్న, గబుక్కున.

"ఇది తెలుగే బాబూ! హి హి! కళ్ళుపెట్టుకొని చూస్తే తెలుస్తుంది! కావాలంటే నా అద్దాలు ఇమ్మంటావా?" అన్నాడు తాతయ్య, ఎగతాళి చేస్తున్నట్లు.

"అన్న దాన్ని అటూ ఇటూ త్రిప్పి చూసి తంటాలు పడ్డాడు- "చూట్టానికి తెలుగులాగే ఉంది; కానీ ఇదేదో వంకరటింకరగా రాశావు నువ్వు" అన్నాడు.

తాత పాత పాట ఒకటి అందుకున్నాడు- "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్!" అని.

మీకు అర్థమైపోయిందిగా, తాతయ్య ఏం రాశాడో?! లేకపోతే ఓ అద్దం తెచ్చుకోండి మీరున్నూ!

ఇన్నాళ్ళూ -ఇదిగో, ఈ పద్యంలోలాగా- మాకందరికీ అద్దాలై దిశానిర్దేశం చేసిన పెద్దలు ఎందరో! వాళ్ళందరికీ‌ నమస్కారాలు-

తెలియని కార్యమెల్ల కడతేర్చుటకొక్క వివేకి చేకొనన్
వలయు- నటైన దిద్దుకొనవచ్చు; బ్రయోజన మాంద్యమేమియుం
గలుగదు- ఫాలమందు తిలకంబిడునప్పుడు చేత నద్దమున్
గలిగిన చక్కచేసికొనుగాదె? నరుండది చూచి, భాస్కరా!

"మనం చక్కగా బొట్టు పెట్టుకోవాలంటే చేతిలో అద్దం ఉంచుకోమూ?! అదే విధంగా, మనకు చేతకాని పని దేన్నైనా చెయ్యాల్సి వచ్చినప్పుడు, ఆ పనిలో నేర్పుకల వాళ్ల సాయం తీసుకోవాలి. అప్పుడు మన పనీ చక్కగా జరుగుతుంది; పని తీరు కూడా చక్కబడుతుంది" అని దీని భావం.

-కొత్తపల్లి బృందం