మాలిపురం మామూలుగా చాలా ప్రశాంతంగా ఉండేది. అయితే ఎక్కడినుండి వచ్చిందో, దొంగల గుంపు ఒకటి అక్కడికి వచ్చి చేరుకున్నది. రోజూ ఎవరో ఒకరి ఇల్లు దోపిడీకి గురవుతున్నది. ఊళ్ళోవాళ్ళు వెళ్ళి రాజుగారికి మొరపెట్టుకుందామని అనుకుంటున్నంతలో రాజుగారే ఒక దండోరా వేసే మనిషిని పంపించారు అక్కడికి: "రాజ భవనాన్ని దోచిన దొంగల్లో కొందరు మాలిపురం అడవుల్లో తలదాచుకుంటున్నట్లు తెలియవచ్చింది. వాళ్లని పట్టుకున్నా, వాళ్ళు దొంగిలించిన సొమ్మును పట్టించినా రాజుగారు ప్రసన్నులౌతారు; మాలిపురం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారహో!" అని.

మాలిపురంలోనే ఉండే ప్రవీణ్, మహేష్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి మెలసి ఉండేవాళ్ళు; ఒకరి కష్టాల్లో ఒకరు పాలుపంచుకునేవాళ్ళు.

ఇద్దరికీ మంచి తెలివి తేటలు ఉన్నై; చదువులో కూడా ముందుండేవాళ్ళు. వాళ్ళిద్దరూ విన్నారు ఈ దండోరాని.

"రక్షణ కల్పించవలసిన రాజుగారే దొంగల్ని పట్టుకోలేకపోయారంటే వీళ్ళెవరో గుండెలు తీసిన బంట్లు అయి ఉండాలి" అన్నాడు ప్రవీణ్.

"ఎన్ని గుండెలు తీసిన బంట్లైనా సరే, వాళ్ళు దొంగలు! వాళ్ళని మనం పట్టిద్దాం; మన ఊరికి ప్రత్యేకనిధులు సంపాదించిపెడదాం" అన్నాడు మహేష్.

"దొంగలు మన అడవిలోనే ఉన్నారు. ఈ రోజు రాత్రికి మళ్ళీ ఊర్లోకి వస్తారు- ఇంకో ఇంట్లో దొంగతనానికి. మనం ఊరి పొలిమేరల్లో ఉన్న మర్రిచెట్టు తొర్రలో దాక్కుందాం. దొంగలు అటుగా వస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వినబడతాయి మనకు. ఒకసారి అలా వాళ్ళ పథకాలేంటో తెలియవస్తే, ఆనక మనం‌ ఏం చెయ్యాలో ఆలోచించుకోవచ్చు!" అన్నాడు ప్రవీణ్.

"సరే" అనుకొని వాళ్ళిద్దరూ ఆరోజు చీకటి పడగానే పోయి ఆ మర్రి చెట్టు తొర్రలో దూరి కూర్చున్నారు. కొద్ది సేపట్లో‌ అర్థరాత్రి అవుతుందనగా, చీకట్లోంచి మాటలు వినబడ్డాయి వాళ్ళకు. చూస్తూ చూస్తూండగానే దొంగలు మర్రిచెట్టు దగ్గరికి వచ్చేసి, ఆ చెట్టు మొదట్లోనే కూర్చున్నారు!

వాళ్ళ మాటలనుండి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు మరొక రెండు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో ఉండబోతున్నారు. ఆలోగా వ్యాపారి వరదయ్య ఇంటినీ, కరణం కామయ్య ఇంటినీ దోచుకోనున్నారు వాళ్ళు!

తొర్రలో దాక్కున్న స్నేహితులకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో మహేష్‌ కడుపులో పేగులు గుడ గుడమని శబ్దం చేశాయి. "ఎవరది?!" అని అరిచాడొక దొంగ. మరుక్షణం మహేష్ ఆపుకోలేక పెద్దగా ఒక పిత్తు పిత్తాడు! "ఎవ్వర్రా అది!" అని మరొక దొంగ వీళ్ళున్న తొర్ర దగ్గరికి రాబోయాడు.

"ఇప్పుడేం చెయ్యాలి?!" ప్రవీణ్ మెదడు చురుకుగా పనిచేసింది. వాడు పెద్ద గొంతుతో "హహ్హహ్హ హ్హ!" అని నవ్వాడు. దొంగలు బిత్తరపోయి చూస్తున్నంతలో మహేష్ మరో పిత్తు పిత్తటం, "నేను ఈ ఊరిని కాపాడే రాక్షసుడినిరా! మీరు రాక రాక నా ఇంటికే రావటం మీరు చేసుకున్న అదృష్టం. నాకోసం మీరు తెచ్చిన బహుమతులన్నిటినీ అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పోండి! రాజుగారిదగ్గర దోచుకున్నదంతా నాకే ఇవ్వాలి, ఏమంటారు?!" అని ప్రవీణ్ హుంకరించటం‌ గబగబా జరిగిపోయాయి. వణికి పోయిన దొంగలు చేతిలో ఉన్న ధనాన్ని మొత్తం అక్కడే వదిలేసి తలో దిక్కుకూ పరుగు తీశారు.

ఇక ప్రమాదం లేదని నిశ్చయించుకున్నాక మిత్రులిద్దరూ తొర్రలోంచి బయటికి వచ్చి చూస్తే అక్కడ చుట్టూతా చాలా నగలు, బంగారు నాణాలు కనిపించాయి. ఇద్దరూ వాటినన్నిటినీ తీసుకెళ్ళి ఊరి కొత్వాలుకు అందించారు. "ఈరోజు రాత్రికి వరదయ్య గారి ఇంట్లోను, బహుశ: కరణంగారి ఇంట్లో కూడాను దొంగలు పడనున్నారు. వీలైనంత మంది జనాలను తీసుకెళ్ళి మీరు ఆ యిళ్ళలో దాగున్నారంటే దొంగలందరూ దొరుకుతారు" అని కబురు అందించారు కూడాను.

ఇంకేముంది, ఊళ్ళో మెరికల్లాంటి యువకుల్ని కొందర్ని వెంట బెట్టుకొని ఆ రెండు ఇళ్ళలోనూ వేచి ఉన్నాడు కొత్వాలు. ఆ రాత్రి చీకట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు తేరుకునేలోగా జనాలందరూ దొంగల మీద పడి కాళ్ళు చేతులు కట్టి పడేశారు!

సంగతి తెలుసుకున్న రాజుగారు ఊరు వాళ్లను రాజధానికి పిలిపించుకున్నారు. దొంగలు దోచుకున్న సంపదంతా ఎవరిది వాళ్ళకు అందింది. జరిగిందంతా విని రాజుగారు కడుపుబ్బ నవ్వారు. ప్రవీణ్, మహేష్ లను ఘనంగా సన్మానించారు.

మాలిపురం అభివృద్ధికోసం ప్రత్యేక నిధులందించారు.