అదో అమావాస్య రాత్రి. కెప్టెన్ డిక్సన్ తన చురుకైన కళ్లతో తమను చుట్టుముట్టిన కటిక చీకట్లోకి తీక్షణంగా చూస్తున్నాడు. ఇప్పుడు అతని చూపుకు పొగమంచు కూడా అడ్డుపడటం మొదలెట్టింది. ఆ పడవలో అతనితోపాటు అర్జున్ సింగ్, చందన్ దాస్ అనే కళాసీలు ఇద్దరు మాత్రం ఉన్నారు- ఇద్దరూ నీరసంగా పడుకొని ఉన్నారు.
ఆ సమయంలో ఎలాంటి ప్రమాదం తలెత్తినా తన సహచరులను హెచ్చరించేందుకు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు కెప్టెన్ డిక్సన్. అలా కాపలా కాస్తున్న అతను విశ్రాంతి తీసుకుంటున్న తన సహచరులవైపు చూసి గాఢంగా నిట్టూర్చాడు. అప్పటివరకు జరిగిన సంఘటనలు అతని కళ్ళముందు కదలాడాయి.
అది వసంతం. గాలులు అద్భుతంగా వీస్తున్నాయి. జోరుగా వీస్తున్న సముద్రపు గాలి అందరిలోనూ ఉత్సాహాన్ని పెంచుతోంది. కళాసీలు "బాద్‌షా"ని వస్తు సామగ్రితో నింపుతున్నారు. ఒక్కో కళాసీ ఆరోగ్యాన్ని నిశితంగా పరీక్షిస్తున్నాడు కెప్టెన్ డిక్సన్. "బాద్‌షా" బ్రిటిష్ ఇండియా వారి యుద్ధనౌక. ఆరోజునే అది ఇంగ్లండుకు పయనం అవుతున్నది. 1000టన్నుల పట్టు, 200టన్నుల వెండి, 100టన్నుల బంగారం, ఇంకా పెద్ద మొత్తాలలో సుగంధ ద్రవ్యాలు అందులో నింపబడ్డాయి. బాద్‌షా వాటినన్నిటినీ ఇంగ్లండుకు చేర్చవలసి ఉన్నది: ఇది అందరికీ తెలిసిన నిజం.
కానీ బాద్‌షా అసలు కర్తవ్యం అది కాదు.
ఎన్నో వందల సంవత్సరాల క్రితం దాచబడిన చోళుల గుప్తధనరాశి ఒకటి ఈ మధ్యనే బయటపడింది. దాని విలువ వెల కట్టలేనిది. అందులోని రత్నరాశి అమూల్యమైనది. దాన్ని ఎవరికీ తెలియకుండా బ్రిటన్‌కు చేరవేయటం బాద్‌షా కర్తవ్యం...
అర్జున్ సింగ్ ఇంకా ఆలోచనల్లో ఉండగానే బాద్‌షాకు దగ్గర్లో వచ్చి ఆగిందొక నల్ల గుర్రపు బగ్గీ. దాని వెనకే వందమంది సైనికులు వచ్చారు. అర్జున్‌సింగ్, మరో ముగ్గురు సైనికులు కలిసి బగ్గీలోంచి ఒక బరువైన ఇనుప పెట్టెను దింపారు. దాన్ని మోసుకెళ్ళి బాద్‌షాలో దానికి కేటాయించబడిన గదిలో దాన్ని భద్రం చేశారు. ఆపైన ఆ గది బయట ఇద్దరు సైనికులు కాపలాగా నిలబడ్డారు.
నిర్ణీత సమయానికి "బాద్‌షా" కూత వేసింది. అందరూ ఓడపైకి చేరుకున్నారు. బాద్‌షాపైన ఈసారి మొత్తం 180మంది ప్రయాణించబోతున్నారు. వాళ్లలో వంద- మంది సైనికులు, మిగిలిన 80మందీ కళాసీలు.
కెప్టెన్ డిక్సన్‌కు తప్ప, వీళ్ళలో ఎవ్వరికీ తమ పర్యటనలోని అసలు రహస్యం తెలీదు! కళాసీలు వారి వారి స్థానాల్లోకి వెళ్ళగానే తెరచాపలు విచ్చుకున్నాయి. కొద్ది క్షణాల్లోనే అవి తమ నిండా గాలిని నింపుకున్నాయి..బాద్‌షా బరువుగా కదిలి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
ఇందులో ఎవరికీ సముద్ర ప్రయాణం కొత్తకాదు. ప్రయాణం జోరుగా సాగుతున్నదని అందరూ ఉత్సాహపడు-తున్నారు- వాళ్లకు ఎదురవ్వనున్న ప్రమాదం గురించి పాపం, వాళ్లెవ్వరికీ తెలీదు.
ఆరోజు సాయంత్రం తెరచాప త్రాళ్లను పరిశీలిస్తున్న ఓ కళాసీకి దూరంగా సముద్రంలో ఏదో నలుసులాంటి వస్తువు దర్శనమిచ్చింది. నిముష నిముషానికి అది పెద్దదైంది..చాలా వేగంగా అది వాళ్లవైపుకు దూసుకు రాసాగింది. 'అదొక యుద్ధనౌక' అని కళాసీ గుర్తించే సరికి అది చాలా దగ్గరికే వచ్చేసింది. దానిమీద ఉన్న జెండాను చూసేటప్పటికి అతనికి మూర్ఛ వచ్చినంత పనైంది- "సముద్రపు దొంగలు! సముద్రపు దొంగలు!" అన్న వెర్రికేక వెలువడింది అతని నోట్లోంచి!
బాద్‌షా మీద ఉన్న సైనికులందరినీ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏరి కోరి ఎంపిక చేసుకున్నది. ప్రమాద సమయాల్లో ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుసు. కళాసీలందరూ వారి వారి స్థానాల్లో నిలబడి ఆదేశాలకోసం చూస్తుంటే సైనికులందరూ తమ తమ ఆయుధాలను సరిచూసుకున్నారు. కొందరు తుపాకీలను ఎక్కుపెట్టారు; మరికొందరు ఫిరంగులను సిద్ధంచేశారు.
శత్రునౌక దగ్గరవ్వగానే వాళ్లకు అర్థమైంది- తాము ఎదుర్కోబోతున్నది అతి గొప్ప సముద్రపు దొంగ- "బ్లాక్ బియర్డ్"ని! అతన్ని చూడగానే కెప్టెన్ డిక్సన్ గుండె జారిపోయింది. వెంటనే తన కాబిన్ లోకి పరుగెత్తి బ్రిటిష్‌ఇండియా గవర్నమెంటు వారికి టెలిగ్రాఫ్ ద్వారా సందేశం పంపాడు- దాడి గురించి, బాద్‌షా ప్రస్తుతం ఉన్న చోటు అక్షాంశ-రేఖాంశాలగురించి- వీలైనంత త్వరగా సహాయాన్ని పంపమని జోడించాడు.
కెప్టెన్ డిక్సన్‌కు తెలుసు- బ్లాక్ బియర్డ్ వచ్చింది బంగారం కోసం కాదు- వెలకట్టరాని గుప్తధనరాసి బాద్‌షా మీద ఉన్నదని అతనికి ఎలాగో తెలిసిపోయి ఉండాలి!
కెప్టెన్ డిక్సన్ బయటికి వచ్చేసరికి అరుపులు, కేకలు, తుపాకి కాల్పులు, ఫిరంగి మ్రోతలతో నౌకలు రెండూ దద్దరిల్లుతున్నాయి. వాటన్నిటి నడుమ పరుగెత్తుకుంటూ గుప్త ధనం ఉన్న కేబిన్‌కు వెళ్ళాడు కెప్టెన్ డిక్సన్. క్యాబిన్‌కు కాపలా కాస్తున్న నలుగురు సిపాయిలనీ, తనకు నమ్మకస్తుడైన చందన్‌సింగ్ అనే కళాసీని పురమాయించి, లోపలున్న పెట్టెను హడావిడిగా బయటికి తెచ్చాడు.
ఆరుగురూ కలిసి పెట్టెను మోసుకెళ్ళి బాద్‌షాను ఆనుకొని ఉన్న చిన్న డింగీలోకి ఎక్కించేసరికి, చాలా మంది దొంగలు బాద్‌షా మీదికి ఎగబ్రాకటంమొదలైపోయింది. అర్జున్ సింగ్ మినహా అంతవరకూ పెట్టెను మోసిన సైనికులు ముగ్గురూ దొంగల తుపాకీ గుళ్ళకు ఆహుతయ్యారు.
మిగిలిన ముగ్గురూ గబగబా డింగీలోకి ఎక్కి దాన్ని బలంగా సముద్రంలోకి తోసారు. బాద్‌షాపైన యుద్ధం భయంకరంగా కొనసాగుతూనే ఉంది.
ఆలోగా ముగ్గురూ తెడ్లు వేసుకుంటూ డింగీని బాద్‌షాకు దూరంగా తీసుకెళ్ళారు.
అంతలో వెనకనుండి చాలా కాగడాలు, తుపాకీ గుళ్ళు వారివైపుకు దూసుకు వచ్చినై. ఫిరంగి గుళ్ళు అల్లంతదూరంలో సముద్రంలో పడి నిలువెత్తు కెరటాలను లేపినై. వాటిని తప్పించుకుంటూ ముగ్గురూ ప్రాణాలను అరచేత పట్టుకొని తెడ్లు వేశారు.
వాళ్ళ వెనకగా మరికొన్ని డింగీలు బయలు దేరాయి. ఒక్కో డింగీలోను ఐదారుగురు సముద్రపు దొంగలు! అయితే అప్పుడు రేగిన తుఫానులో ఎవరికి వారు వేరైనారు! తాము ఇప్పుడు, ఇక్కడ, ఇలాగ, ఒంటరిగా పడవలో చిక్కుకొని ఉన్నారు! *
దూరంగా ఒక పొగబోటు శబ్దం విని కెప్టెన్ డిక్సన్ తన ఆలోచనల నుంచి బయట పడ్డాడు. వెంటనే తన సహచరులను మేల్కొల్పి విషయం చెప్పాడు. అందరూ ఆయుధాలను సర్దుకొని దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు.
అయితే ఆ వచ్చింది బ్రిటిష్ నౌకాదళం వారి మరపడవ! అది తమ కోసమే వెతుకుతున్నదని తెలిసి పడవలోని ముగ్గురూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా నీళ్ళు-ఆహారం లేకుండా సముద్రంలో అల్లాడుతున్న వారికి ఇప్పుడు విముక్తి కలిగింది! ఇక సంపదంతా సునాయాసంగా బ్రిటన్ చేరుకోగలదు!