అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యపు యువరాజు కాంతిసేనుడు చాలా చురుకైనవాడు. ప్రజల కష్టాల్ని తీర్చడానికి ఎటువంటి సాహసానికైనా సిద్ధపడేవాడు. ఒకసారి ఆ రాజ్యంలో వరసగా మూడేళ్ళు వర్షాలు కురవలేదు. కరువు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. రాజుగారు కరువు నివారణకోసం రకరకాల పనులు చేపట్టారు.

ఒకరోజున ఆయన సభలోని వారందరినీ అడిగారు-'సమృద్ధిగా వర్షాలు కురవాలంటే ఏం చేయాలి?'అని.

"చెట్లునాటాలి" అన్నారొకరు. "అడవులు పెంచాలి" అన్నారొకరు. "తపస్సు చెయ్యాలి" అన్నారొకరు.

"ఈ సంవత్సరమే వానలు పడాలంటే ఏం చేయచ్చో‌ చెప్పండి" అన్నాడు మహారాజు. రాజగురువు ముందుకు వచ్చాడు. తను శాస్త్రాల్లో వెతికి కనుగొన్న విషయాన్ని చెప్పాడు- "రాజ్యానికి చాలా దూరంలో దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో ప్రత్యేకమైన వృక్షం ఒకటి ఉంది. దాని కొమ్మను తీసుకువచ్చి నాటితే చాలు- వెంటనే వర్షాలు కురుస్తాయి" అన్నాడు.

"నిజంగానా?" అడిగారు రాజుగారు.

"శాస్త్రాల్లో‌ అలా ఉంది. అవి నిజమో, కాదో నేను చెప్పలేను" అన్నాడు రాజ గురువు.

"సరే, చూద్దాం. ఎవరు తెస్తారు?" అని రాజుగారు అన్నారో లేదో- చాలా మంది యువకులు ముందుకొచ్చారు. 'నేనంటే నేను' అని పోటీ పడ్డారు.

రాజుగారు ఒక్కొక్కరినీ‌ అడవిలోకి పంపించాడు.

అందరూ ముఖాలు వేళ్ళాడేసుకొని వెనక్కి వచ్చారు.

"ఆ చెట్టు కొమ్మను కొట్టటం మా వల్ల కాలేదు. దానికేవో మాయలున్నట్లున్నై. మేం ఎన్ని రకాలుగా నరికేందుకు ప్రయత్నించినా అది తెగనే లేదు!" అన్నారు వాళ్ళు.

యువరాజు కాంతిసేనుడు ముందుకు వచ్చాడు. "నేనే తెస్తాను" అని బయలుదేరి వెళ్ళాడు.

గురువుగారు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం అడవిలోకి వెళ్ళాడు కాంతిసేనుడు. అంతమంది త్రొక్కిన దారేగా, ఆ వృక్షం తేలికగానే దొరికింది.

కాంతిసేనుడు దాని ముందు నిలబడ్డాడు గొడ్డలి చేత బట్టుకొని. ఒక నిముషంపాటు ఆలోచించాడు- "ఇది మహిమ గల వృక్షం. దీని కొమ్మను గొడ్డలిద్వారా సంపాదించలేం. ఏవో‌ మంత్రాలు ఉండి ఉంటాయి" అనుకున్నాడు. గొడ్డలిని క్రింద పడేసాడు. చేతులు జోడించి రకరకాల దేవతల్ని ప్రార్థించాడు. ఎన్ని మంత్రాలు చదివినా ఏమీ ప్రయోజనం అయితే కలగలేదు.

ఆఖరికి కాంతిసేనుడు చెట్టు ముందు మోకరిల్లాడు- "ఓ వృక్షమా! దయచేసి నాకు సహాయం చేయవా!" అని ప్రాధేయ పడ్డాడు. ఆశ్చర్యం! మరుక్షణం ఆ చెట్టు నవ్వింది! కొమ్మల్ని గల గల లాడించింది. "చేస్తాలే, చేస్తాలే" అన్నట్లు వీచింది గాలి.

కాంతి సేనుడికి చాలా సంతోషం వేసింది. "ధన్యవాదాలు, చెట్టూ!" అన్నాడు. ఆ మాటలు అన్నాడోలేదో, ఒక కొమ్మ తనంతట తానే తెగి పడ్డది కాంతిసేనుడి ముందు.

'దయచేసి' 'ధన్యవాదాలు' అనే మాటలు రెండూ చాలా శక్తి వంతమైనవని గ్రహించాడు కాంతిసేనుడు.

చెట్టుకు మరోసారి ధన్యవాదాలు తెలిపి, ఆ కొమ్మను తీసుకెళ్ళి రాజ్యంలో నాటాడు. కొమ్మను నాటిన రెండు రోజుల్లోనే వర్షాలు కురిసాయి!

రాజ్యంలోని చెరువులన్నీ నిండాయి!

మంచి మాటలు కత్తివేటు కంటే బలమైనవని అర్థమైన యువరాజు అటుపైన వాటిని తన నిత్య జీవితంలో వాడటం మొదలు పెట్టాడు- కాలక్రమంలో అందరూ ' మా మహారాజు చాలా మంచివాడు!' అనుకునేట్లు ఎదిగాడు.