నేను తొందర్లో పెద్దగా ఐపోతానింక. అప్పుడు నీతో‌ మాట్లాడనే మాట్లాడను.." చెబుతున్నది చిన్ని ఎవరితోనో, ముందు గదిలో కూర్చొని.

అమ్మ లోపల్నించి విన్నది. "అబ్బ! ఈ పాప నోరు ఊరుకోదు గదా!" విసుక్కున్నది- "ఎవరే చిన్నీ, ఎవరది?" అడిగింది పైకి.

"నీ పేరేంటి?" అడుగుతోంది చిన్ని-

"పేరేంటంటే ఏమీ చెప్పట్లేదు!" ఫిర్యాదు చేసింది గట్టిగా, అమ్మతో.

అమ్మ చేతులు తుడుచుకుంటూ బయటికొచ్చి చూసింది. చిన్ని ఒక సూర్యకిరణంతో‌మాట్లాడుతున్నది, దాని ప్రక్కనే కూర్చొని.

"దీని పేరు సూర్య కిరణం. నాకు తెలుసు" అన్నది అమ్మ. "ఇది వెచ్చగా ఉంటుంది. దీనికి మాటలు రావు."

"వచ్చు! ఇది రోజూ నాతో మాట్లాడుతూనే ఉంటుంది!" అన్నది చిన్ని అంత గట్టిగానూ.

సూర్యకిరణం‌తనదారిన తను నేలమీద పడి కదలకుండా కూర్చున్నది. అమ్మ ఒక్క క్షణం అక్కడే నిలబడి సీరియస్‌గా చూసింది. మళ్ళీ చేస్తున్న పని గుర్తుకొచ్చి, లోపలికి వెళ్ళిపోయింది.

అంతలో ఆ వెలుతురులోకి పాక్కుంటూ‌ వచ్చి కూర్చున్నది, ఒక చిన్న మఖ్మల్ పురుగు. దాని వీపంతా మెరుస్తోంది- మెత్తగా, ఎఱ్ఱగా.

"ఓయ్! ఓయ్!పురుగూ!" అన్నది చిన్ని. సంతోషంతో దాని ముఖంలో వెలుగు పదింతలైంది.

మెల్లగా, సున్నితంగా రెండు వ్రేళ్లతో‌ఆ ఆరుద్ర పురుగును ఎత్తి అరచేతిలో వేసుకున్నది.

"ఏమ్మా! ఎక్కడ, మీ ఇల్లు? తప్పిపోయావా? చలి పుడుతోందా, నీక్కూడా? దుప్పటి కప్పనా?" అడిగింది.

"ఉహుఁ..వద్దు. నా బొంత నాకున్నదిగదా, నా వీపు మీద?" అన్నది పురుగు, నవ్వుతూ. "మా ఇల్లు ఇక్కడే, కిటికీ ప్రక్కన పూలచెట్టులో. సూర్యకిరణం దారి చూపిస్తే వచ్చాను, నిన్ను కలిసేందుకే" అన్నదది, ముందుకి రెండడుగులు వేసి.

"అవునా, ఊరికే దగ్గరకూర్చున్నట్లు కూర్చొని, ఈ కిరణం ఎంత పని చేసిందో‌ చూడు!" అన్నది చిన్ని, వాళ్ళమ్మ అన్నట్లు యాసపెట్టి. పురుగు నవ్వింది. "నేనైతే కదుల్తాను కదా, అందుకని నీ దగ్గరికి వచ్చాను. పాపం పూలచెట్టు నీకోసం ఎదురుచూస్తూ అక్కడే నిలబడి ఉంది. చెట్టు కదా, కదల్లేదు అది"

చిన్ని పురుగును చేతబట్టుకొని గెంతుకుంటూ పూలచెట్టు దగ్గరికి వెళ్ళింది చిన్ని.

పూలచెట్టు చిన్నినీ, పురుగునీ చూసి నవ్వింది- "పిల్చుకు రానే వచ్చావు!" అంది. "ఏం లేదు; ఇప్పటివరకూ నేను ఊరికెనే ఉన్నాను కదా, కొన్నాళ్ల తర్వాత పూయటం మొదలెడతాను. ఎన్నెన్ని పూలు ఇస్తానో, నిండుగా!నువ్వు నన్ను మర్చిపోయావా, ఏంటి? ఈమధ్య అసలు నా దగ్గరికే రాలేదు!?" అడిగిందది చిన్నిని.

పురుగుని చెట్టు మొదట్లో వదిలి అన్నది చిన్ని-"మాకందరికీ ఒకటో క్లాసు పరీక్షలు కదమ్మా, బాగా చదూకోవాలి. అయినా అమ్మకి చెబుతానులే, మా ఫ్రెండు పూలచెట్టు పక్కన కూర్చొని పద్యాలూ అవీ చెప్పుకుందాం' అని! సరేనా?!"

"అదే, నేననేది కూడా. మా దగ్గర కూచొని గట్టిగా చదూకుంటే కొంచెం మాక్కూడా చదువొస్తుంది కదా" అన్నది పురుగు.

"వసంతంలో పూలచెట్లు ఎంత మంచి వాసనొస్తాయో తెలుసా? మా దగరకూచొని హాయిగా గడపొచ్చు ఈ చదువులకాలాన్ని!" అన్నది చెట్టు.

"సూర్య కిరణమూ, పురుగూ, పూలచెట్టూ దగ్గర ఉంటే అసలు చలే పుట్టదు- చదువు కూడా చాలా బాగా వస్తుందటమ్మా" కేకలు పెట్టింది చిన్ని, బయటినుంచే.

అమ్మ బదులిచ్చింది లోపల్నించే "ఎక్కడో ఒకచోట! నువ్వు ఈ నెలంతా చక్కగా చదువుకుంటానంటే నాకు అంతే చాలు!" అని.

అందరికీ‌ చదువులకాలపు అభినందనలు!
కొత్తపల్లి బృందం.