సోమందేపల్లిలో నివసించే సోమయ్య మంచి రైతు. అయితే చాలా అమాయకుడు.
సోమయ్య ఇంటిని ఆనుకొనే నివసిస్తున్నారు- హరీష్, నవీన్ . వీళ్ళు అతితెలివిగాళ్ళు. వీళ్లకి ఎప్పుడూ సోమయ్యను ఏడిపించాలని ఉంటుంది. సోమయ్య ఒకసారి మడి దున్ని, వరి పొలం పెట్టాడు. హరీశ్, నవీన్‌ల చూపు ఆ పొలం మీద పడ్డది. దాన్ని పట్టుకొని ఎలాగైనా సోమయ్యను ఏడిపించాలని ముచ్చట పడ్డారు వాళ్ళు.
ఆరోజున సోమయ్య మడికి మందులు చల్లి, నీళ్ళు పెట్టి ఇంటికి రాగానే వీళ్ళిద్దరూ మడి దగ్గరికి వెళ్ళారు. మడి పచ్చగా కళ కళ లాడుతోంది. వీళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, అటువైపు వస్తున్న నీళ్లను వేరేవైపు మళ్ళించారు. అంతలో వాళ్ల దృష్టి అక్కడ పెట్టి ఉన్న డబ్బా మీద పడింది- "ఒరే, దీన్ని చూసేసరికి నాకు దొడ్డికి పోవాలనిపిస్తున్నదిరా, అన్నాడు హరీష్.
"నువ్వు డబ్బా తీసుకొని అటువైపుకు పో, నేను ఆలోపల ఇక్కడ ఇంకా ఏం చెయ్యచ్చో చూస్తాను" అన్నాడు నవీన్. హరీశ్ అటు వెళ్ళగానే వాడు అటూ ఇటూ చూశాడు. శుభ్రంగా తళతళలాడుతున్న కొత్త స్విచ్ బోర్డు ఒకటి వాడి దృష్టిని ఆకర్షించింది. దాన్ని చూడగానే వాడికొక ఆలోచన వచ్చింది- ఆ స్విచ్ బోర్డుకు నాలుగు స్విచ్‌లు ఉన్నై. రెండు ఆన్ చేసి ఉన్నై; రెండు ఆఫ్ చేసి ఉన్నై. వాడు వెకిలిగా నవ్వి, ఆఫ్ లో ఉన్న స్విచ్‌లు రెండింటినీ ఆన్ చేసాడు; ఆన్‌లో ఉన్న రెండింటినీ ఆఫ్ చేసాడు. "సోమయ్య వచ్చి చూస్తే కరెంటు గందరగోళంగా ఉంటుంది. వాడికి ఏమీ అర్థం కాదు. అప్పుడు వాడు ఎట్లా తన్నుకులాడతాడో చూస్తే మజా వస్తుంది!" అని వాడు సంబరపడుతున్నంతలోనే దొడ్డికి పోయి వస్తున్న హరీష్ ప్రాణం పోయినట్లు "ఓ..ఓ..ఓ" అని అరవటం వినబడ్డది. బయటికి వెళ్ళి చూస్తే ఏముంది?- హరీష్ క్రిందపడి తన్నుకులాడుతున్నాడు! వాడి చేతికి ఒక కరెంటు తీగ చుట్టుకుపోయి ఉన్నది!
ఒక క్షణం పాటు నవీన్ తల తిరిగిపోయింది. అయితే మరుక్షణం వాడికి అర్ధమైంది- ఇదేదో తను చేసిన పని ఫలితమేనని! వెంటనే వాడు స్విచ్‌బోర్డు దగ్గరికి పరుగెత్తి స్విచ్‌లను అంతకు ముందు ఉన్నట్లు సరిచేశాడు. దాంతో హరీష్ తన్నుకులాడటం ఆగింది. అటుపైన నవీన్ గబగబా హరీష్ దగ్గరికెళ్ళి, తను చేసిన ఘనకార్యం చెప్పకుండా, "ఈవైరు ఎందుకు ముట్టుకున్నావురా, ఊరికే!?" అన్నాడు. "సోమయ్యగాడికి తిక్క పుట్టించేట్లు, ఈ తీగనొకదాన్ని తెంపేద్దామనుకున్నాను. దానిలో కరెంటు ఉందని నాకు తెలీలేదు!" అన్నాడు హరీష్.
"పోనీలే ప్రాణాలైనా దక్కాయి" అని ఇద్దరూ గబగబా ఇంటి దారి పట్టారు. ఆ హడావిడిలో ఇంకా చేను దాటకనే ఇద్దరూ జారి ఒక గుంతలో పడ్డారు. వీళ్ళకోసమే ఎదురు చూస్తున్నట్లు అక్కడున్న తేళ్ళు రెండు వీళ్ళను కసితీరా కుట్టాయి!
తేలు కుడితే సామాన్యంగా ఎవ్వరివీ ప్రాణాలు పోవు- కానీ ఆ విషం శరీరంలో ఉన్నంత సేపూ మనిషి నాట్యం చేస్తూనే ఉంటాడు- అది అట్లా అల్లల్లాడిస్తుంది. ఇంక వీళ్ళిద్దరూ నాట్యం చేసుకుంటూ రోడ్డు మీద పోతుంటే చూసిన వాళ్ళంతా "ఏమైందిరా, ఏమైందిరా" అని అడగటం మొదలు పెట్టారు.
"మరే మరే.." అని నవ్వుతారు, ఏడుస్తారు- తప్పిస్తే ఇద్దరూ ఏం జరిగిందోమటుకు ఎవ్వరికీ చెప్పటం లేదు.
త్వరలోనే వీళ్ల వెనక నవ్వుతూ, ఏడుస్తూ నడిచే పిల్లల బృందం ఒకటి తయారైంది. వీళ్ళు ఏడిస్తే వాళ్ళు నవ్వుతున్నారు. వీళ్ళు నవ్వితే వాళ్ళు ఏడుస్తున్నారు. అందరూ గంతులు వేస్తున్నారు!
కొంచెం సేపు వీళ్ళ సందడిని వినోదంగా చూసిన పెద్దవాళ్ళు, ఆ తర్వాత వీళ్ళిద్దరినీ ఆపి ఏం జరిగిందో అడుగుదామని చూశారు. కానీ వీళ్ళు ఎక్కడైనా నిలిస్తేగా!? అయితే వీళ్లకంటే తొందరగా ఆ వార్త వీళ్ళ ఇల్లు చేరింది.
హరీశ్, నవీన్‌ల ఇంట్లోవాళ్ళు అందరూ ఆ సమయానికి సోమయ్య ఇంట్లోనే ఉన్నారు. ఏమంటే అక్కడికి ఒక స్వామీజీ వచ్చి ఉన్నారు. ఆయనకు చాలా మహిమలు ఉన్నాయనీ, ముఖ్యంగా ఆయన ఒక సారి ముట్టి, మందిస్తే ఎలాంటి ముదిరిన పిచ్చైనా దెబ్బకు వదిలిపోతుందనీ ఆయన్ని అందరికీ పరిచయం చేస్తున్నాడు సోమయ్య .
సరిగ్గా అప్పుడే హరీశ్, నవీన్‌ల నాట్యం సంగతి వాళ్లకు తెలియవచ్చింది. వాళ్ళ పేరు వినగానే స్వామీజీ ఉత్సాహంగా కళ్ళు మూసుకొని "అదే, అదే! కర్మ ఫలం! తెండి! వాళ్ళను నా దగ్గరికి తెండి!" అన్నాడు, తనూ ఎగురుతూ. చుట్టూ చేరినవాళ్ళు 'ఇదే సందురా, వినోదం చూసేందుకు' అని బయటికి పరుగెత్తి, అప్పటికే ఇల్లు చేరుతున్న హరీశ్, నవీన్ లను పెడరెక్కలు విరిచి లాక్కొచ్చారు సోమయ్య ఇంటికి.
అంత గడబిడలోనూ హరీశ్, నవీన్‌లకు చెమటలు పట్టాయి. తాము చేసిన తప్పు పని అంత త్వరగా సోమయ్యకు ఎలా తెలిసిపోయిందో వాళ్ళకు అర్థం కాలేదు. సోమయ్యకు ఏమీ తెలీలేదని వాళ్ళకు ఇంకా అర్థం కాకనే, స్వామీజీ వాళ్లను లాగి ఇంటి మధ్యలో నిలబెట్టాడు. తేలు విషం ఇంకా దిగలేదుగా, వీళ్ళ కాళ్ళు, చేతులు వణుకుతూనే ఉన్నై, వీళ్ళ నాట్యం కొనసాగుతూనే ఉంది. దాంతో స్వామీజీకి ఆలోచన వచ్చి తనూ నాట్యం మొదలు పెట్టాడు భయంకరంగా, శివుడిలాగా. చుట్టూ చేరిన భక్తులంతా "కొబ్బరికాయలు తెండి, చిల్లర డబ్బులు తెండి" అని అరిచారు.
హరీశ్, నవీన్‌ల తల్లిదండ్రులు గబగబా ఇంటికి పరుగెత్తి చేతికందిన డబ్బులు, పళ్ళు, ఫలాలు తెచ్చివ్వక తప్పలేదు!
ఇట్లా కొంతసేపు జరిగాక, స్వామీజీ శాంతించి, పళ్ళు నూరుతూ "ఒరే! కర్మ ఫలం చూశారా! ఎవరు చేసిన పనికి ఫలితం వాళ్ళు అనుభవించాలిరా! మీరంతా తేలు కుట్టిన దొంగలు! ఏమీ చెప్పుకోలేరు! ఊరుకోండి! నాట్యం ఆపండిరా! స్వామికి ఒక పాడిఆవుని సమర్పించుకోండి! పాపభారం ఊరికే పోదు; దానం చేయాల్సిందే" అని అరిచాడు.
దాంతో హరీశ్, నవీన్‌లకు మరిన్ని డబ్బులూ, మంచి పాలిచ్చే ఆవూ వదిలిపోయాయి. డబ్బులు వదిలిన విచారం ఎక్కువయ్యేసరికి వాళ్లకెక్కిన తేలు విషం ప్రభావం కూడా తగ్గింది!
"చూశారా చూశారా! స్వామీజీ ఎంత మహిమగలవారో! క్షణంలో బాగుచేసేశారు!" అన్నారు ఊళ్ళో జనాలు.
"ఎలా కనుక్కున్నాడు, తేలు సంగతి కూడా చెప్పేశాడే! నిజంగానే మహాత్ముడేమో!" అనుకున్నారు హరీశ్, నవీన్.
"ఇంతకీ ఏం పిచ్చో, వీళ్ళకి? కనీసం ఇప్పటికి శాంతించారు అంతే చాలు- పాడిఆవు గిట్టుబాటే!" అనుకున్నారు స్వామీజీ, చెదరని చిరునవ్వుతో. ఇవేవీ తెలీని సోమయ్య పొలంలో నీళ్ళు మరో ప్రక్కకి మళ్ళించేందుకు పరుగు పెట్టాడు!