సుల్తాన్ పురాలో ఉండే అమృత చాలా తెలివైనది. ఆవిడ ఒక ప్రైవేటు బడిలో పనిచేసేది. శ్రద్ధకు, ఓపికకు మారుపేరుగా నిలిచిన అమృత, తన విడి సమయంలో బాగా కష్టపడి చదివి, పరీక్షలు రాసింది- ప్రభుత్వ టీచరు అయ్యింది.

అయితే ఆమె తెలివితేటలు, శ్రద్ధ, ఓపిక ఏమయ్యాయో మరి, ఒకసారి ప్రభుత్వ బడిలో చేరగానే ఆమెలో అనూహ్యమైన పరివర్తన వచ్చేసింది. ఇప్పుడు ఆమె మనసు పాఠాలపైన ఏమాత్రం నిలవటంలేదు. ఎప్పుడూ శలవల గురించీ, తనకు రావలసిన డబ్బుల గురించీ, తోటి ఉపాధ్యాయులకు వచ్చే జీతాలగురించీ, పట్నంలో పెట్టుబడుల గురించీ ఆలోచించటం మొదలు పెట్టింది .

తను ఇప్పుడు ఎనిమిదవ తరగతికి విజ్ఞాన శాస్త్రపు ఉపాధ్యాయురాలు. అయినా ఆమె తరచు క్లాసుకు పోకుండా ఎగగొట్టేది. స్టాఫ్‌రూంలోనే కూర్చొని, 'పనిలో ఉన్నాను-ఊరికే చదువుకుంటూ కూర్చోండి' అని చెప్పి పంపేది. హెడ్మాస్టరుగారి మాటకూడా వినేది కాదు. ఆయన ఏమైనా అంటే 'మేమేమైనా ఖాళీగా ఉన్నామా సార్!?' అని ఎదురుతిరిగేది.

మనసు పాఠాలమీద నిలవకపోవటంతో, రాను రాను ఆవిడ పాఠాల్లోకూడా తప్పులు చోటు చేసుకోవటం మొదలెట్టాయి. కొన్ని పదాలకు ఆవిడ తనకు తెలియకుండానే తప్పు అర్థాలు చెప్పేసేది. ఆమెను ఏమైనా అంటే 'నేను బాగానే చెప్పానమ్మా, మీరు శ్రద్ధగా వినలేదు'అని అందరు పిల్లల్నీ అదిలించేది. అట్లా వాళ్ళ బడి పిల్లల్లో విజ్ఞాన శాస్త్రపు బీజాలు సరిగా పడక, పెద్ద మోసమే అయ్యింది.

ఆమెను గురించి పిల్లలందరూ బాధపడేవారు. వాళ్ళలో ఎవరైనా ప్రధానోపాధ్యాయులకో, వేరే టీచర్లకో ఫిర్యాదు చేస్తే మటుకు ఆమె అస్సలు సహించేది కాదు. ఆ పిల్లల్ని బాగా కొట్టేది, వాళ్ళకు మార్కులు తక్కువ వేసేది.

అయితే ఒక సారి ఏమైందంటే, ప్రభుత్వం వాళ్ళు 'ఏ ఊరి టీచర్లు ఆ ఊర్లోనే నివసించాలి' అని పట్టు పట్టటం మొదలు పెట్టారు. దాంతో అమృత టీచర్ వాళ్ళ కుటుంబం మొత్తం సుల్తాన్‌పురాకు మారాల్సి వచ్చింది. మరి వాళ్ల పిల్లలు- సాయి, రమ్య ఎక్కడ చదవాలి? సాయి ఏడో తరగతి, రమ్య ఎనిమిదో తరగతి! ఇద్దరూ అక్కడి ప్రభుత్వ బడిలోనే చేరారు. అది అమృత టీచర్‌కు అస్సలు ఇష్టం లేకుండింది; కానీ వేరే మార్గం లేదు- ఊళ్లో ప్రైవేటు బడి పరిస్థితి మరీ ఘోరం!

తన పిల్లలు కూడా అదే బళ్ళో చేరే సరికి అమృత టీచర్‌కు పరిస్థితి కొంచెం కొంచెం తెలిసివచ్చింది. అంతకు ముందు బడులలో టీచర్లు రమ్యకు ఏం చెప్పారోగానీ, ఆ పాప చదువులో అన్నీ తప్పులే! సాయికి అయితే ఇంకా తెలుగు చదవటమే రాదు, సరిగ్గా! వాళ్ళని చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. ఉపాధ్యాయులు మనసు పెట్టి చదువు చెప్పకపోతే పిల్లల జీవితాలు ఏమౌతాయనేది ఆవిడకు ఇప్పుడు అర్థం అవ్వసాగింది.

ఇప్పుడు ఆమె మారిపోయింది. పిల్లల్ని బాగా చదివించాలని ప్రయత్నించింది- తన పిల్లల్నే కాదు; బళ్ళో పిల్లలు అందర్నీ! ముందు తను చెప్పే పాఠాల్లో తప్పులన్నిటినీ సవరించుకున్నది. చెబుతున్న విషయాలు అర్థంకాని పిల్లలమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టటం మొదలు పెట్టింది. అందరితోబాటు తన పిల్లల్నీ కూర్చోబెట్టి చదివించింది. పిల్లల నోట్సులు దిద్దటం మొదలు పెట్టింది. బడిలో మూలన పడి ఉన్న ప్రయోగశాల దుమ్ము దులిపింది.

పిల్లలకు విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు చేసి చూపించింది; వీలైనప్పుడు వాళ్ల చేతనే ప్రయోగాలు చేయించింది. ఇప్పుడు అమృత టీచర్ పాఠాలంటే పిల్లలకు ఎంత ఇష్టమో!

చూస్తూ చూస్తూండగానే పిల్లల్లోనూ మార్పు వచ్చింది. వాళ్ళలో కొందరు మెరికల్లాగా తయారయ్యారు. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవటమే కాదు; వైజ్ఞానిక ప్రదర్శనల్లోనూ పాల్గొనటం మొదలు పెట్టారు. రమ్య, సాయి బడినుండి బయటకి వచ్చి బాధ్యత గల పిల్లలుగా కాలేజీల్లో చేరారు.

'సైన్సు నేర్చుకోవాలంటే అమృత టీచర్ దగ్గరికే వెళ్ళాలి' అని జిల్లా అంతటా మారు మ్రోగింది. అమృత టీచర్‌ వళ్ళోకి ఏవేవో అవార్డులు వచ్చిపడ్డాయి. అయినా అవేవీ ఆవిడను ఆకర్షించటం లేదు- పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పటం అంటే ఇప్పుడు ఆమెకు ఎంత ఇష్టమో చెప్పలేం!