వేటపాలెం సముద్ర తీరంలో ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామంలో రాము, శ్యాము, గోపి అనే ముగ్గురు యువకులు ఉండేవారు. వాళ్ళు చిన్ననాటి నుండీ మంచి స్నేహితులు. ఎదుటి వారికి ఆపద వస్తే చూస్తూ ఊరుకోరు. తప్పక సహాయం అందిస్తారు. వాళ్ళు ముగ్గురూ కలిసి ఎన్నో సాహసాలు చేశారు కూడాను.
చెప్పటం మర్చిపోయాను, వాళ్లకు టోపీలు అంటే కూడా చాలా ఇష్టం . అవి పెట్టుకొని వాళ్ళు ఒకసారి పడవలో సముద్రానికి వెళ్ళారు, చేపలు పట్టడానికి. అయితే అప్పటికే ఆకాశంలో మేఘాలు కమ్ముకోసాగాయి. వాళ్ళు 'ఒడ్డుకు వెళదాము' అనే లోగానే పెద్ద తుఫాను మొదలైంది. సముద్రంలో పెద్ద పెద్ద అలలు రాసాగాయి! ముగ్గురూ బలంగా తెడ్లు వేస్తూ తీరం చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలి వాళ్ళ పడవని అటూ ఇటూ నెట్టివేస్తున్నది.
అంతలో వాళ్లకు ఒక పెద్ద పడవ కనబడింది. అది సముద్రంలో ఇంకా లోపలికి ఉంది. తుఫాను తాకిడికి దాని తెరచాపలు ఎక్కడో దెబ్బతిన్నట్లున్నాయి. అక్కడే మునిగి పోయేందుకు సిద్ధంగా ఉంది. అందులో ఉన్న దాదాపు 15మంది ప్రయాణీకులు భయంతో అరుస్తున్నారు- "కాపాడండి, కాపాడండి" అని!
వాళ్ళ అరుపులు విన్నాక రాము, శ్యాము , గోపి ఇక ఏమీ ఆలోచించలేదు. తమ పడవని వెనక్కి తిప్పి, అతి కష్టం మీద ఆ పడవను చేరుకున్నారు. తమ దగ్గరున్న మూడు తెడ్లకూ ఆ పడవ అడుగున పడేసి ఉన్న ఇరవై తెడ్లను జోడించారు. ఏడుస్తున్న ప్రయాణీకులందరికీ వాళ్ల వాళ్ల శక్తిని బట్టి ఒకటో రెండో తెడ్లు ఇచ్చారు- అందరూ కలిసేటప్పటికి పడవ కొంచెంగా కదిలింది!
ఒకసారి పడవ కదిలేసరికి అందరికీ ధైర్యం వచ్చింది- ఏడుపులు ఆగిపోయాయి. అందరూ విశ్వాసంతో తెడ్లు వేసారు. భయంకరంగా వీస్తున్న గాలులు కూడా వాళ్ళ సమైక్య శక్తి ముందు తలవాల్చి దారి వదిలాయి. పడవ క్షేమంగా ఒడ్డు చేరుకున్నది.
ఆరోజున వాళ్ళు ముగ్గురూ కేవలం అంతమంది ప్రాణాలను కాపాడటమే కాదు; 'కలిసి పని చేస్తే ఎంతటి కష్టాన్నైనా దాటగలం' అని నిరూపించారు. వాళ్ళ శక్తి సామర్ధ్యాలను, మంచితనాన్ని గుర్తించిన ప్రభుత్వంవారు అటుపైన వాళ్ళని తమ నౌకా విభాగంలో చేర్చుకుని సత్కరించారు!