చిన్నారి ప్రకాశ్ బొమ్మకు కథ చూసి చాలా సంతోషం వేసింది. వాడి చిన్నబుర్రకు తగ్గట్టే ఆట్టే గొడవలేమీ లేకుండా హాయిగా ఉంది కథ. ఇది ఒక 'ట్రెండు'గా మారాలని ఆశిద్దాం.
పిల్లల కథలు వైవిధ్యంగా ఉన్నాయి ఈసారి.
రాజు వ్రాసిన 'పట్టుబడిన దొంగ' చదివితే వాడి బుర్రలో ఓ మంచి చమక్కు వుందనిపించింది. సింపుల్ ట్విస్టుతో అలవోకగా కధనల్లేశాడు.
మైత్రేష్ పందికి పెట్టిన పేరు బావుంది- వెరైటీగా! తమాషాగా అల్లే ఇలాంటి కథలు పిల్లలను ఏదైనా విషయం పట్ల సృజనాత్మకంగా ఆలోచించేలా చేస్తాయి. సైన్సుకు, కల్పనకు పోటీ పెడితే చిన్నారులని రెండోదే ఆకట్టుకుంటుంది. నక్షత్రాలు గుండ్రంగా ఉంటాయని చెబితే ఆరేళ్ళ మా అమ్మాయి ఎంత దిగులు పడ్డదో చెప్పలేను! తనకు అస్సలు నచ్చలేదు ఆ విషయం.
'మారిన మనిషి' చాలా పరిణతి చెందిన వాళ్ళు వ్రాసిన కథలా ఉంది. 'మాస్టారి బ్రతుకులో నిండా వెలుగు ఉంది- నాది మాత్రం చీకటి బ్రతుకు' అన్న భావన ఐదో తరగతి పిల్లాడికి రావటం సాధ్యమేనా అనిపించింది. చాలా సున్నితంగా ఉంది కథని డీల్ చేసిన తీరు.
'బాతు కథ' లాంటివే- పందో, కోడిపిల్లో ఎగరాలనుకోవటం, అమ్మ మాట వినక చిక్కుల్లో పడటం గతంలో చదివాం. అలేఖ్య క్లుప్తంగా చక్కగా రాసింది.
రాజమకుటం లాంటి పెద్ద జానపద సినిమా కథని పకడ్బందీగా రెండు పేజీల్లో చెప్పేశాడు నాగుల్ షరీఫ్. ఈ కథని చదివితే ఎక్కడో చదివామే, అని అనిపించక మానదు.
చెడు ఎంత బలమైనదైనా, మంచి చేతిలో ఓడిపోతుందనే మన పిల్లలూ నమ్ముతారన్నమాట 'సూపర్‌డాల్' కథ ద్వారా వంశీకృష్ణ చెప్పాడు. కథలోని మెలికలు ఒక ఎత్తైతే, భూమ్యాకర్షణ, పరీక్షా కేంద్రం లాంటివి అంత స్పష్టంగాతెలీడం, ఎక్కడా లొసుగులు లేకుండా కథని బిగించటం పదేళ్ళ పిల్లాడు ఎలా చేశాడన్నది పజిల్!
'రాజుగారి కుక్క'ని సుధ ప్రేమతోరాసింది. జంతువులని ప్రేమించాలని చెప్పింది. కాకపోతే ఆ ఆలోచనని కథగా మలచటంలోమరికొంచెం ఆలోచన అవసరమనిపించింది.
ఇక లక్ష్మీప్రసన్న చాలా మంచి అంశాన్ని ఎన్నుకొని కథని వ్రాసింది. ఇతర ప్రాణులని అంతమొందించే స్థాయికి తీసుకు పోయే మన జీవన శైలి ఎంత అన్యాయమైనదో! 'మన ఇళ్ళు పిచుకలకు కూడా అనువుగా వుంటే ఎంత బాగుంటుందో' అన్న ఆలోచన ఎంత స్వచ్ఛమైనదీ, ఎంత లోతైనదీ!
పిల్లల కథల ముందు పెద్దలవి చిన్నబోయాయనే చెప్పాలి. సిరిల్ డిసౌజా వ్రాసిన 'అద్భుతం'లో ఎంత త్రవ్వినా రంధ్రం రంధ్రంగానే ఉండటం, మొదట్లోనే దొరకాల్సిన బంతి చివరాఖర్లో కూరుకుపోయి ఉండటం అసహజంగా ఉంది. గాలి-నీరు మధ్య వివాదాన్ని గంగిపుల్లయ్యగారు తార్కికంగానే నిర్మించేందుకు ప్రయత్నించారుగానీ, చెట్లు లేకపోతే గాలి వీయదనటం తప్పుదోవ పట్టించేదిగా ఉంది. నీరు కొన్ని చోట్ల బహువచనమైంది.
ఇక 'కడుపునొప్పికి వాము' ప్రభుత్వంవారి ఆరోగ్య ప్రకటనని తలపింపజేసింది. బొమ్మలు, భాష కూడా పిల్లల్ని ఆకట్టుకునేలా లేవు. ఉద్దేశం మంచిదేనని గ్రహించగలం గానీ, ఈ పత్రికలో ఇటువంటివి అవసరమా అని సందేహం. ఇక పద్యాలని యథాతధంగా ప్రచురించటం కంటే, ఓ సందర్భం సృష్టించి వాడితే పిల్లలకు ఆసక్తికరంగానూ , ఉపయోగ కరంగానూ ఉంటుందేమో!
యువకెరటాలు- ఇక్బాల్ మసీహ్ కథ కదిలించింది. పన్నెండేళ్ళ చిన్నారి సాధించినది అద్భుతమా, బాల్యాన్ని అంత అన్యాయంగా కోల్పోవడం విషాదమా? దీన్ని అందించిన కిషోర్ గారు అభినందనీయులు.
మనీష అందించిన 'మొక్కను బాబూ' పాటని లెక్కలేనన్నిసార్లు పాడుకున్నా, పాడిన ప్రతిసారీ ఒళ్ళు జలదరించక మానదు. చివరిలైన్లో 'రేపు చెట్టౌతాను-నన్ను కొట్టకు బాబూ' అని ఉండాలి.
ఇక చివరగా 'బాబోయ్ టివి' గురించి- టివి బారినుంచి పిల్లల్ని, (వాళ్లకంటే ఎక్కువగా పెద్దల్ని-) రక్షించే శక్తి భగవంతుడికైనా వుందేమో తెలీదు.
'ఏదైనా అద్భుతం జరిగి మళ్ళీ ఒక్కసారి టివి లేని రోజులు తిరిగివస్తే ఎంత బాగుణ్ణు' అనిపిస్తుంది. యోగి వ్రాసిన కథ సంపాదకీయానికి ప్రేరణనివ్వటం బాగుంది. టివి లేని ఇళ్ళకూ, దాని బారినుంచి తప్పించుకునే నేర్పు కలిగిన వాళ్ళకూ అభినందనలు! వేల వేల వందనాలు!