తిరగబడిన దాగుడు పక్షులు !

ఈ వాక్యాలను ఒక్కొక్కదాన్నీ తిరగదిప్పి చదవండి..ప్రతివాక్యంలోనూ‌ ఒక పక్షి దాక్కొని ఉంది, చూడండి!

   1. నీటికి కావాలి పల్లం.
   2. జోరుగా  పరుగెత్తేవాడు ఒక్కమారు ఆగడే.
   3. రతి, సరస్వతి  తోడికోడళ్ళు.
   4. రెండు నెలలయి  కోమటి డబ్బు  అడుగుతున్నాడు.
   5. నీ  కోసం  హరికోసం  కాచుక్కుచున్నాం.
   6. వాడివంతు  బాగానే  ఉంది.
   7. చెలిమి  నెల వరకు  ఎందుకు? ఒక్కరోజులోనే  ఏర్పడుతుంది.
   8. గొఱ్ఱెల తోకలు  చిన్నవి.
   9. చంద్రుని వద్ద  గ్రహం రాహువా? కేతువా?
   10. సుశీల యొక్క  రాగం  కొన వరకు  బాగుండదు.
   

మూలం: 1959 సెప్టెంబరు "బాల"(కూర్పు: ఆ బోతుల సింహాచలం , పార్వతీపురం) (జవాబులకోసం ఈ పేజీ చివర్లో చూడండి!)

చిన్ని కవిత

నా పేరు గోపాల్
నాన్న పేరు భూపాల్
పుట్టింది నేపాల్
తాగింది ఆవుపాల్
చేసింది పాపాల్
అయ్యాను జైల్‌పాల్
సేకరణ: సమీర,6th, రిషివ్యాలీ.

జోకులు

సూపర్ మ్యాన్!
అనంతరామన్ సుబ్బరామన్ ఓ గొప్ప ప్రైవేటు బ్యాంకు కెళ్లాడు. బ్యాంకులో పని చేసేదంతా ఇంగ్లీషు వాళ్లే.
తను ఓ డిడి కోసం‌ డబ్బులు కట్టి కూర్చున్నాడు. రెండు గంటలు గడిచాయి. ఇంకా పిలుపురాలేదు.
చివరికి విసుగొచ్చింది, వెళ్లి నిలదీశాడు అక్కడి క్లర్కును.
"రెండు గంటల్నుండీ పిలుస్తున్నా, మీరే రాలేదు సార్ "అన్నాడతను మర్యాదగా
మళ్లీ ఓ సారి పిలుస్తాను చూడండి. పిలిచాడు- " అనదర్‌మ్యాన్ , సూపర్‌మ్యాన్!! (Another man Super man)" అని!! సేకరణ : సుధీర్, బెంగులూరు.

సరైన లెక్క!

టీచర్: నీ దగ్గర నాలుగు చాక్లెట్లున్నాయనుకో, నేను నిన్ను 3చాక్లెట్లు నాకు ఇచ్చెయ్యమన్నాననుకో? అప్పుడు నీ దగ్గర ఇంకా ఎన్ని చాక్లెట్లు మిగులుతాయి?
రాజు: నాలుగు!!
టీచర్: ఆc..! అదెలాగ?!
రాజు: మీరు చాక్లెట్లు ఇమ్మనగానే ఇచ్చేసేందుకు నేనేమైనా తెలివి తక్కువ వాడిననుకుంటున్నారా?

వస్తు మార్పిడి!
సురేష్: నాకు రాన్రాను మతిమరుపు ఎక్కువైపోతోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
వినయ్: ఏమైందిరా?
సురేష్: గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ పొరపాటున నా పాత చెప్పులే తొడుక్కొచ్చాను.

నిద్ర మందు!
తండ్రి: పడుకొని కూడా పుస్తకాలు చదువుతున్నావురా! ఎంత మంచి వాడివి, నువ్వు!
కొడుకు (మనసులో): ఇవి చదువుతుంటే నిద్ర బాగా వస్తుంది నాన్నా, అందుకని..!

ఏమి ప్రేమ!
టీచర్: మాతృభాషకీ పరాయిభాషకీ గలతేడా ఏమిటో చెప్పండి?! కార్తిక్: మాతృభాష కళ్ళవంటిది, పరాయిభాష మీరు పెట్టుకున్న కళ్ళజోడు వంటిది.

నెలలు నిండాయి!
టీచరు: 'సంవత్సరం అయిపోయింది' - దీన్ని మరో విధంగా చెప్పు, రామూ!
రాము: “నెలలు నిండాయి” సార్!

తెలివి!
టీచర్: ఒరేయ్ అశోకుడు రోడ్డుకు ఇరుప్రక్కలా చెట్లు ఎందుకు నాటించాడో చెప్పండిరా!
పిల్లలు: రోడ్డు మధ్యలో నాటిస్తే బళ్ళు, వాహనాలకు అడ్డం కద సార్, అందుకని!

దేశభక్తి!
టీచర్: రామూ! వచ్చి ఈ పటంలో మన దేశం ఎక్కడుందో చూపించు!
రాము: క్షమించండి టీచర్! నేను నా దేశాన్ని వేలెత్తి చూపించలేను!

రెండు మంచి పద్యాలు

తెనుగుదనమువంటి తీయందనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలిత సుగుణజాల! తెలుగుబాల!

రక్తిలేని యాట రాత్రి నిద్దురచేటు
భక్తిలేని పూజ పత్రిచేటు
నీతిలేని చదువు జీతాల చేటురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!

తెలుగు బాల పద్యాలను రాసిన కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు

తిరగబడిన దాగుడు పక్షుల జవాబులు:

  1. కాకి    2. డేగ    3. కోడి      4. కోయిల     5. హంస     6. బాతు     7. నెమలి     8. చిలుక      9. గ్రద్ద     10. కొంగ