రావులపాలెంలో క్రొత్తగా పాఠశాల భవన నిర్మాణం మొదలైంది. గోపాల్, రాజు, మాధవ్ అనే ముగ్గురూ కూలీలుగా పనిచేస్తున్నారు.
గోపాల్ ఎప్పుడూ విచారంగా పనిచేసేవాడు. రాజు ముఖంలో ఏ భావమూ కనబడేది కాదు; నిర్లిప్తంగా తన పని తాను చేసుకునేవాడు. ఇక మాధవ్ మాత్రం ఎప్పుడు చూసినా చలాకీగా, నవ్వుతూ -తుళ్లుతూ పనిచేస్తుండేవాడు.
పాఠశాల నిర్మాణాన్ని పర్యవేక్షించే శ్రీనివాస్ మంచివాడు. మానవుల స్వభావాన్ని అర్థం చేసుకోవటం అంటే అతనికి ఇష్టం. రోజూ ఈ ముగ్గురి పని తీరునూ చూసి చూసి ఒకరోజున శ్రీనివాస్‌కు వాళ్ళతో పనితీరుల గురించి మాట్లాడుదామనిపించింది.
అతను గోపాల్ దగ్గరికెళ్ళి కూర్చొని "నువ్వెందుకు గోపాల్, ఎప్పుడూ బాధపడుతుంటావు?!" అని అడిగాడు. "ఈ కూలిపని చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. చదువుకోలేదుగా, అందుకని నా ఖర్మకొద్దీ చేయాల్సివస్తోంది. ఇక సంతోషంగా ఎలా ఉంటాను?" అన్నాడు గోపాల్ .
శ్రీనివాస్ అతని పట్ల సానుభూతి ప్రకటించాడు. "ఏం చేస్తాం, తప్పదు!" అన్నాడు.
ఆ తరువాత అతను రాజు దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. "నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, అంత నిర్లిప్తంగా ఉంటావు?" అన్నాడు.
"ఎండలో పని చేయడమేనయ్యా, ఇబ్బందంతానూ. ఏదో, నా భార్య పిల్లల్ని పోషించుకోవాలిగదా అని ఈ పని చేస్తున్నాను కానీ, ఈ పనంటే ఎవరికి ఇష్టం ఉంటుంది?!" అన్నాడు రాజు.
"అవునవును!" అన్నాడు శ్రీనివాస్.
చివరగా అతను మాధవ్ దగ్గరికి వెళ్ళాడు- "నువ్వు సంతోషంగా ఎలా ఉండగల్గుతున్నావు మాధవ్? ఈ కూలిపని వల్ల ఎక్కువ డబ్బులు రావుగా?" అని అడిగాడు.
"నాకు చిన్నప్పటి నుండి చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది. కానీ మా ఊళ్లో బడి లేదు. నన్ను వేరే ఊరికి పంపించి చదివించే స్థోమత లేదు, మా అమ్మా నాన్నలకు. దాంతో చదువుకోవాలనే కోరిక అసలు ఏమాత్రం తీరలేదు. అయితే ఇప్పుడు చూడండి, నేను చదువుకోలేకపోయినా, ఈ ఊరి పిల్లలందరూ చదువుకునే బడిని నిర్మించే అవకాశం నాకు వచ్చింది! ఎంత సంతోషకరమైన సంగతి ఇది!" అన్నాడు మాధవ్.
"నీకు దక్కని చదువు కూడా ఇతరులకు దొరుకుతుందని సంతోషంగా పనిచేస్తున్నావు. నీ నుండి నాలాంటి వాళ్లు చాలా నేర్చుకోవాలి. మరి ఇంతకు ముందు పనిని కూడా నువ్వు సంతోషంగానే చేసావుగా, అదెట్లాగ?" అడిగాడు శ్రీనివాస్ అతన్ని.
"పాపం, ఆ సారు జీవితమంతా కష్టపడి వెనకేసుకున్న నాలుగు డబ్బులతో ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకు ఇల్లు కట్టి పెట్టిన పుణ్యమంతా నాదేగద! ఇక ఏం బాధ!" అన్నాడు మాధవ్ నవ్వుతూ.
"ఓహో! నువ్వు చేసే ప్రతి పనీ నీకు సంతోషాన్నే ఇస్తుందన్నమాట! బాగుంది, బాగుంది!" అన్నాడు శ్రీనివాస్ ఆలోచనలో పడుతూ.