భవానీపురంలో పెద్ద చెరువు ఒకటి ఉండేది. దాని గట్టు ప్రక్కనే ఒక పాత పెంకుటిల్లు ఉండేది. ఆ పెంకుటింట్లో శివయ్య, పార్వతమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఇద్దరు పిల్లలు: రవి, శైలజ. పార్వతమ్మ రకరకాల ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసేది. శివయ్య తమకున్న రెండు ఆవులనూ మేపుకుని ఇంటికి వచ్చాక, భార్య తయారు చేసిన పచ్చళ్ళను పట్నానికి తీసుకుపోయి, అక్కడ అంగళ్ళ వాళ్ళకి అమ్మేవాడు. ఇలా ఆ భార్యాభర్తలిద్దరూ కలసికట్టుగా సంసారాన్ని లాక్కొస్తున్నారు.
ఆ సంవత్సరం రవి పదో తరగతికి వచ్చాడు. పచ్చళ్ళకోసమని పార్వతమ్మ ఇంట్లో ఎప్పుడూ దంచుతూ ఉండేది గదా, ఆ దంపుళ్ళ వల్ల ఇల్లంతా ఎప్పుడూ ఏవో ఘాటు వాసనలు ఉండేవి. ఆ వాసనల మధ్య చదువుకునేదెలాగ? అందుకని రవి తను ప్రశాంతంగా కూర్చొని చదువుకునేందుకు తగిన స్థలం ఒకటి వెతుక్కున్నాడు.
చెరువు గట్టునే, ఊరికి కొంచెం దూరంగా, పాత మిద్దె ఒకటి ఉండేది. అది ఒక సైనికుడి ఇల్లు. ఎప్పుడో జరిగిన యుద్ధంలో పాపం, ఆ సైనికుడు చనిపోయాడు. ఆ వార్త వినగానే అతని భార్య కాస్తా గుండె ఆగి మరణించింది.
దీనికంతటికీ కారణం ఆ ఇల్లే అని ఊళ్ళో వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. చీకటి పడిందంటే ఆ మిద్దె ఛాయలకు కూడా ఎవ్వరూ వెళ్ళరు. కానీ రవికి ఏం భయం? తను ఆ భవంతి వసారాని శుభ్రం చేసుకున్నాడు. పగలంతా అక్కడే వరండాలో కూర్చుని చదువుకునేవాడు. చీకటి పడకముందే మెల్లగా ఇల్లు చేరుకునేవాడు.
ఇలా ఉండగా ఒకసారి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. జోరున వర్షం కురవసాగింది. సాయంత్రం ఆరు గంటలకే చీకట్లు ముసురుకున్నాయి. పిల్లలందరూ భోజనాలు చేసేసి పడుకున్నారు. అనుకున్నట్లుగానే "చెరువు పొంగేట్లుంది! అందరూ ప్రెసిడెంట్ గారి చావిడికి వెళ్ళాలని హెచ్చరిక చేస్తున్నారహో!" అని దండోరా వేయించారు పంచాయితీ వాళ్ళు. దాంతో గ్రామం లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గోలగోలగా అరుచుకుంటూ తట్టా, బుట్టా సర్దుకుని చావిడి వైపు పరిగెత్తటం మొదలుపెట్టారు.
శివయ్య కుటుంబం కూడా విలువైన వస్తువులను మూట కట్టుకుని చావిడిలోకి చేరింది. అందరూ గజగజలాడుతూ రాత్రిని అక్కడే గడిపారు. మర్నాడు మధ్యాహ్నానికిగానీ వాన తెరిపినివ్వలేదు. 'ఊళ్ళో నీరు తీయడానికి మరో రెండు రోజులు పట్టొచ్చు ' అనుకుంటూ అందరూ ఇంటికి బయలుదేరారు. తీరా చూస్తే అక్కడ శివయ్య వాళ్ళ ఇల్లు వరద నీటికి నాని, పూర్తిగా కుప్ప కూలిపోయి ఉన్నది!
శివయ్య, పార్వతమ్మ అక్కడే కూర్చుని ఏడవటం మొదలు పెట్టారు. శైలజ బిత్తరచూపులు చూస్తూ నిలబడింది. ముందుగా తేరుకున్న రవి జరగవలసిన దాన్ని గురించి ఆలోచించాడు. ముగ్గురికీ ధైర్యం చెప్పాడు. కుటుంబం మొత్తాన్నీ సైనికుడి మిద్దెకి తీసుకువెళ్ళాడు. తుఫాను వచ్చి వెలిసినా, వసారా ఇంకా శుభ్రంగానే ఉన్నది. తల్లిదండ్రులను వరండాలో కూర్చోబెట్టి రవి, శైలజలు ఆ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు.
శైలజకు కొంచెం భయంగా ఉన్నా, అన్న చెప్పినట్లు విన్నది. ఇద్దరూ గబగబా ఇంటిని శుభ్రం చేశారు. నసుగుతూ, భయపడుతూ, వద్దువద్దంటూ, చేసేదేమీలేక లోపలకు వచ్చింది పార్వతమ్మ. కూలిపోయిన ఇంటికి వెళ్ళి, కొన్ని పాత్రలు, సామాన్లు తెచ్చాడు రవి. శైలజ వంట చేసింది. అందరూ ఏదో తిన్నామనిపించి, త్వరగానే పడుకున్నారు.
అయితే ఆ రాత్రి పార్వతమ్మకి చాలా భయం వేసింది.. చాలాసేపు అసలు నిద్రే పట్టలేదు.. ఇంకా కొంచెం సేపట్లో తెల్లవారుతుందనగా ఆమెకి ఇంటిలోపలినుండి ఏదో గజ్జెల శబ్దం వినబడింది.. రాను రాను ఆ శబ్దం మరింత పెద్దగా అవుతున్నది!! ఆమె గబుక్కున లేచి కూర్చొని వగరుస్తూ "అయ్యో! ఊపిరి ఆడటం లేదు !" అని అరవటం మొదలు పెట్టింది. ఇంటిల్లిపాదీ అదిరిపడి లేచి కూర్చున్నారు. శైలజేమో, భయంతో నాన్న ప్రక్కకి చేరింది. "అదిగో, గజ్జెల శబ్దం! దయ్యం-దయ్యం " అని అరుస్తోంది పార్వతమ్మ. రవి, శివయ్య, శైలజ శ్రద్ధగా విని చూశారు. వాళ్లకు మాత్రం ఏ గజ్జెల శబ్దమూ వినపడలేదు!
అందరూ పార్వతమ్మ ప్రక్కనే చేరారు. ఆమెకి ధైర్యం చెప్పి ఓదార్చసాగారు. వాళ్ళు వేరే ఇంటికి మారే అవకాశం ఇప్పట్లో లేదు. ఎంత కష్టమైనా సరే, అక్కడే సర్దుకోవాలి. పార్వతమ్మకూ ఈ విషయం తెలుసు. అయినా 'దయ్యం' అన్న భయం ఆమె మనసులో తిష్ఠ వేసుకొని ఉన్నది. ఏ ప్రమేయం లేకుండానే ఆమె ఆనాటినుండి ప్రతిరోజూ రాత్రిపూట ఇలాగే అరవటం మొదలు పెట్టింది. అంతేగాక రోజురోజుకీ చిక్కిపోసాగింది!
సైన్సు పాఠాలు శ్రద్ధగా చదివే రవికి తెలుసు- "'గుహల్లోను, పాత మిద్దెల్లోను గాలి కదలిక పెద్దగా ఉండని చోట్ల, గాలిలో ఉండే కార్బన్ డై ఆక్సైడు మొత్తం నేలకు దగ్గరగా పరచుకొని ఉంటుంది. అలాంటి చోట్ల, నేలమీద పడుకుంటే, మనకు కావలసినంత ఆక్సిజన్ అందదు- కొంచెం అసౌకర్యంగా, ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. దానికి భయపడనవసరం లేదు!' అయినా, అమ్మ భ్రాంతికి లోనయ్యింది! 'దయ్యం'అని ఆమెకున్న మూఢనమ్మకానికి మందు ఏది?
ఆలోచించిన మీదట, 'ఈ పిచ్చి నమ్మకాన్ని మరో నమ్మకంతోటే పోగొట్టాలి తప్ప, వేరే మార్గం లేదు' అనిపించింది రవికి. తనకు తట్టిన ఉపాయాన్నొకదాన్ని అతను శైలజకు, శివయ్యకు వివరించాడు. వాళ్ళూ అందుకు ఒప్పుకున్నారు- ఎందుకు ఒప్పుకోరు? "దయ్యం లేదు, గియ్యం లేదు - అది బంగారం లాంటి ఇల్లు" అని వాళ్ళకు తెలిసింది మరి!
ఆ రాత్రి భోజనాలయ్యాక రవి పార్వతమ్మ వద్దకు చేరి "అమ్మా! దయ్యాలకు ఎర్రటి ఆవకాయ కారం ఎరుపు అంటే భయం కదా?" అని అడిగాడు.
"ఔనురా!" అంది పార్వతమ్మ గుసగుసగా. "ఏమో, ఎవరికేం తెలుసు?" అని మనసులోనే అనుకుంటూ.
"మన ఇంట్లో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడదామమ్మా, ఇవాళ్ల రాత్రి! నువ్వు చేసి పెట్టావుగా, ఆవకాయ పచ్చడి?! అందులో ఇంకొంచెం కారం కలిపి పెట్టు. మరింత ఎర్రగా చెయ్యి. సమయం చూసుకొని నాన్న వెనకనించి దయ్యం జుట్టు పట్టుకుంటాడు. నేనేమో దాని ఒళ్ళంతా ఆవకాయ కారం పట్టిస్తాను. దాంతో అది ఇక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంది; బంగారం లాంటి ఈ ఇల్లు మన సొంతమవుతుంది- ఏమంటావు?" అన్నాడు రవి.
ప్రాణం లేచివచ్చినట్లయింది పార్వతమ్మకి. "సరే! అంతకన్నానా! ఇప్పుడే కలుపుతా, కారం!" అంటూ మంచం మీద నుండి ఉత్సాహంగా లేచింది ఆమె. ఆవకాయ జాడీలో మరింత కారం, నూనె కలిపి పెట్టింది.
ఆరోజు అర్థరాత్రి దాటగానే ఆమె యధాప్రకారం "దయ్యం -దయ్యం" అని అరవడం మొదలుపెట్టింది.
"నువ్వు పడుకొనే ఉండమ్మా! -నాన్నా! త్వరగా రా!అదిగో, ఆ దయ్యం జుట్టు పట్టుకో! -చెల్లీ! ఆవకాయ జాడీ పట్టుకురా! ఇదిగో నేను చెబుతా నీపని! హహ్హహ్హ!" అని హడావుడి చేస్తూ, అరుస్తూ గందరగోళం సృష్టించాడు రవి.
శైలజేమో పధకం ప్రకారం గొంతు మార్చి " అమ్మో! ఎరుపు, అమ్మో! మంట ! కారం - కారం! -నన్ను వదలండి, నేను మీ జోలికి రాను. హా! హా!" అని పెద్దపెట్టున అరిచింది.
"ఫో! ఫో ! మళ్ళీ ఈ చుట్టు ప్రక్కల కనిపించావంటే వదిలేది లేదు!" అంటూ రవి, శివయ్యలు కేకలు వేశారు. కాసేపటికి గొడవ సద్దుమణగ్గానే పార్వతమ్మ భయం భయంగా కళ్ళు తెరిచింది. ఇల్లంతా ఆవకాయ కారం గుమ్మరించి ఉంది. శైలజ, రవి, శివయ్య, అందరూ ఆవకాయ కారం కొట్టుకొనిపోయి ఉన్నారు. "చూశావా, అమ్మా! నీ ఆవకాయ దెబ్బకి దయ్యం ఎట్లా వదిలి పారిపోయిందో! చెరువులోకి దూకినా మన కారం మంట మాత్రం వదలదు దాన్ని!" అన్నాడు రవి ఇకిలిస్తూ. సంతోషంతో అందరి ముఖాలూ వెలిగిపోతుంటే చూసి తనూ నవ్వేసింది పార్వతమ్మ.
అటుపైన ఆమె లేచి, ఎంతో హుషారుగా ఇల్లంతా శుభ్రం చేసింది. దయ్యం వదిలిన సంతోషం ఆమెలో స్పష్టంగా కనబడింది. ఇక ఏనాడూ ఆమెకు గజ్జెల శబ్దం వినబడనే లేదు! తమ మంత్రం ఫలించిందని రవి, శివయ్య, శైలజ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.
ఆ ఊర్లో ఉండే పాతతరం వాళ్ళు మటుకు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు- "ఆ దయ్యాల కొంపలో వీళ్ళెట్లా ఉంటున్నారు?" అని. వాళ్లకి మరి ఆవకాయ మంత్రం తెలీదుగా?!