రంగాపురంలో నివసించే సోమయ్యకు రామాయణమూ తెలీదు; భారతమూ తెలీదు. ఊరికే తెలీకపోవటం కాదు, అతనికి అవంటే పెద్దగా ఇష్టంకూడా లేదు. అయితేనేమి, అతని భార్య రంగమ్మ మాత్రం శాస్త్రాలన్నా, పురాణాలన్నా చెవి కోసుకుంటుంది. భర్తని మార్చాలనీ, భగవంతుడంటే కొంచెం భయభక్తులు అలవాటు చేయాలనీ రంగమ్మ చేయని ప్రయత్నం లేదు-అయినా సోమయ్య తీరు సోమయ్యదే -ఒట్టి మొద్దుమనిషి.

ఒకసారి ఊళ్లో రామాయణం చెప్పటానికి వచ్చారు ఒక శాస్త్రులవారు. ప్రతిరోజూ సాయంత్రం ఆయన ఊరి గుళ్లో రామాయణం చెప్పేవాడు. సందర్భానికి తగినట్లు అభినయం, నాట్యం, సంగీతం జొప్పించేసరికి, మొదటి రోజునే ఆ రామాయణ పారాయణం భలే రక్తి కట్టింది. రెండవ రోజు కల్లా శాస్త్రులవారి పేరు ఊళ్లో మారు మ్రోగిపోయింది. ఊరి జనాలంతా సాయంత్రం కాగానే చాపా, దిండూ చంకనపెట్టుకొని గుళ్లోకి బయలు దేరటం మొదలుపెట్టారు.

ఇంట్లో పశువులు ఉన్నాయి,అలా ఇల్లు వదిలిపెట్టి పోయే వీలు లేదు రంగమ్మకు. అందుకని అమె ఎప్పటిలాగానే భర్తను పోరింది-"రామాయణం చాలా బాగా చెబుతున్నారట, పోయి విని రారాదూ?" అని. సోమయ్య కూడాఎప్పటిలాగానే ముందు విననట్లు నటించాడు గానీ, చివరికి భార్య పోరు భరించలేక, కండువా భుజానవేసుకొని బయలుదేరాడు.

సోమయ్య వెళ్లేసరికి ఆ రోజు పురాణం మొదలైపోయింది. ఊరిజనాలంతా భక్తి శ్రద్ధలతో వింటున్నారు. శాస్త్రులవారు ఊపుగా చెబుతున్నారు. సోమయ్య వెళ్లి వెనకవరసలో కండువా వేసుకొని కూర్చున్నాడు. కార్యక్రమం తెల్లవారుజాము వరకూ కొనసాగుతుంది.. సోమయ్యకు మాత్రం కూర్చోగానే తూగు మొదలైంది. కొంచెంసేపట్లో అతను ఇహం మరచి గాఢనిద్రలోకి జారుకున్నాడు. నాలుగో జాము మొదలయ్యేసరికి కార్యక్రమం పూర్తయింది. శాస్త్రులవారు ఆ రోజుకిగాను మంగళం పాడేశారు. అచారం ప్రకారం వెంటనే ప్రసాదం కూడా పంపిణీ చేశారు, అక్కడ చేరిన భక్తజనులందరికీ. పంచేవాళ్లెవరో నిద్రపోతున్న సోమయ్య నోట్లో కూడా ఒక లడ్డూ ముక్క పెట్టి, ముందుకు సాగారు.

దాన్ని నిద్రలోనే చప్పరించేసిన సోమయ్యకు ఆ వెంటనే మెలకువ వచ్చింది. చుట్టూ చూసే సరికి అందరూ లేచి వెళ్లిపోతున్నారు. సోమయ్య కూడా గబిక్కున లేచి, కండువా దులుపుకొని ఇల్లు చేరుకున్నాడు. భర్త రాత్రంతా రామాయణం వినివచ్చాడని రంగమ్మ మాత్రం మా మురిసిపోయింది. అతనికి ఎదురువచ్చి అడిగింది "ఎలా ఉందండీ, రామాయణం?" అని. "చాలా తియ్యగా ఉంది" అన్నాడు రంగయ్య, లడ్డూరుచిని గుర్తు చేసుకుంటూ . రంగమ్మకి చాలా సంతోషం వేసింది.

ఆ రోజు కూడా సాయంత్రం భోజనాలు కాగానే భర్తను పురాణానికి సాగనంపింది రంగమ్మ. ఈసారి సోమయ్య ఎక్కువ బెట్టు చేయకుండానే బయలుదేరి వెళ్లాడు. మండపంలోనే ఒక మూలగా, గోడను ఆనుకొని కూర్చున్నాడు. ఇంకా పారాయణ మొదలు కాకుండానే నిద్రలో మునిగిపోయాడు. ఆ రోజు శాస్త్రులవారి పారాయణం మొదలయ్యే సరికి సభా ప్రాంగణం అంతా జనాలతో క్రిక్కిరిసి పోయింది. ఎటుచూసినా జనమే.ఆ ఇరుకులో కూడా సోమయ్య ఒళ్లు మరిచిపోయి నిద్రపోయాడు. చోటుదొరకని పిల్లవాడు ఒకడు, ఇదే చాలని, సోమయ్య భుజాలమీదికి ఎక్కి కూర్చున్నాడు రాత్రంతా. అక్కడి నుండి వాడికి శాస్త్రులవారు బాగా కనిపించారు మరి! ఆ రాత్రి కథ పూర్తయ్యే సరికి, పిల్లవాడు సోమయ్య భుజాలమీది నుండి దిగేశాడు. అందరూ లేచిన అలికిడికి సోమయ్య కూడా లేచి, కండువాదులుపుకొని ఇంటికి వెళ్లాడు.

రాత్రంతా మోసిన బరువు వల్ల అతని భుజాలూ, నడుమూ నొప్పి పుడుతున్నాయి. ఇంట్లో భార్య ఎదురొచ్చి "కథ ఎలా ఉందండీ?" అని అడిగేసరికి అతనికి బరువుతప్ప మరేమీ గుర్తురాలేదు. "తెల్లవారే సరికి మరీ మరీ బరువెక్కింది" అని మాత్రం చెప్పాడు. రంగమ్మ సంతోషపడింది. "రామాయణం అంతే కదండీ, చాలా బరువైన కథ!" అన్నది మురిసిపోతూ. తన మొరటు భర్తకు కూడా రామాయణంలోని భావనల బరువు, లోతు అర్థమైనందుకు ఆమె చాలా సంతోషపడింది.

ఇక ఆ రోజు సోమయ్య వెళ్లేసరికి, ప్రాంగణం అంతా నిండి ఉన్నది. సోమయ్యకు ఎంత నిద్ర వచ్చిందంటే,అతను బయట నేలమీదే కండువా పరుచుకొని నిద్రపోయాడు. బాగా నోరు తెరచుకొని గురక కూడా పెట్టాడు. తెల్లవార బోతుండగా అటుగా వచ్చిన కుక్క ఒకటి,తెరచిన ఆ నోటిని చూసి ముచ్చటపడింది. ఇంకేముంది,కాలెత్తి తనపని కానిచ్చేసింది!!.

వెంటనే మేలుకున్న సోమయ్య కండువాతో సహా ఇల్లు చేరుకున్నాడు. భార్య ఎదురొచ్చి "ఎలాఉంది?" అని అడిగితే సోమయ్య ముఖం ముడుచుకొని, గుడ్లుమిటకరించి, నీళ్లు నమిలాడు-" ఘోరంగా ఉంది! ఉప్ప ఉప్పగా!" అన్నాడు చివరికి.

దాంతో రంగమ్మకి అనుమానం వచ్చేసింది. గుచ్చి గుచ్చి అడిగేటప్పటికి సోమయ్య తను చేస్తున్న పనినంతా ఒప్పేసుకున్నాడు- ప్రతిరోజూ కార్యక్రమంలో బాగా నిద్రపోతున్న సంగతి చెప్పేశాడు. రంగమ్మకి విపరీతమైన కోపం వచ్చేసింది. "పద,ఈ రోజు నీతో పాటు నేనూ వస్తాను. నువ్వెట్లా నిద్రపోతావో చూస్తాను"అని ఆ రోజు రాత్రి సోమయ్యతో పాటు తనూ బయలుదేరింది.

వాళ్లిద్దరికీ ఆ రోజుచక్కగా ముందు వరసలోనే చోటు దొరికింది. రంగమ్మ భర్త చెవిలో ముందుగానే గుసగుసలాడింది:- "నిద్రపోతే చూడండి, ఏం చేస్తానో" అని! దాంతో సోమయ్య నిద్ర మత్తు కాస్తా ఎటుపోయిందో-పోయింది. దాంతో అతను రామాయణ కథలో మునిగి పోయాడు..చూడగా కథ బాగానే ఉన్నట్లున్నది! అందులో పాత్రలన్నీ సోమయ్యకు ఇప్పుడు వాస్తవం అయిపోయాయి! ఆ రోజున శాస్త్రులవారు హనుమంతుడు లంకాదహనం చేసిన ఘట్టం చెబుతున్నారు. "లంకను కాల్చేసిన తర్వాత, హనుమంతుడు సీతమ్మ ముద్రికను ఇలా వేలికి పెట్టుకొని, అలా ఒక్కగెంతులో సముద్రందాటారు-" అని చెబుతూ శాస్త్రులవారు ఒక్కదూకు దూకారు ముందుకు!

అంతలోనే జరగరానిది జరిగిపోయింది- శాస్త్రులవారి చేతిలో ఉన్న ఉంగరం జారి కోనేటిలో పడిపోయింది.!

సోమయ్య గబుక్కున లేచినిలబడ్డాడు. హనుమంతుడి చేతిలోంచి సీతమ్మవారి ఉంగరం జారి సముద్రంలో పడిపోతే ఇక కథ ఎలా సాగుతుంది మరి?- అందుకని అతను - "స్వామీ! హనుమంతా! కంగారుపడకు! నీ ఉంగరాన్ని తెచ్చి ఇచ్చేందుకు నేను లేనా?" అని అరిచి, ఒక్క ఉదుటున గుడి కోనేటిలోకి దూకాడు. అయితే యీత బాగా వచ్చిన వాడు కనుక, కోనేటి అడుగున పడిఉన్న ఉంగరాన్ని దొరకబుచ్చుకొని మరునిముపంలో పైకి తేలివచ్చాడు. అందరూ నిర్ఘాంతపోయారు-అతని చొరవకు,భక్తితత్పరతకూ! ఉంగరం పోయిందని కంగారు పడుతున్న శాస్త్రుల వారికి ప్రాణంలేచివచ్చినట్లైంది. ఆయన ఉంగరాన్ని అందుకొని అదే వేగంతో దేవునికి హారతి ఇచ్చి, పళ్లాన్ని సోమయ్య చుట్టూ తిప్పి, నొసటన తిలకందిద్ది, పూలమాల వేసి మర్యాద చేశాడు.

దాంతో ఊళ్లో వాళ్లందరికీ సోమయ్య భక్తి పట్ల విపరీతమైన గురి ఏర్పడిపోయింది. రాముడికి,హనుమంతుడికి ప్రీతిపాత్రుడైన వాడిగా వాళ్లంతా సోమయ్యను గౌరవించటం మొదలు పెట్టారు. సోమయ్య కూడా ఆ గౌరవానికి తగినట్లు హుందాగా ప్రవర్తించే సరికి, నిజంగానే పెద్దమనిషి అయిపోయాడు!