గోపాలపురం పాఠశాలలో, చదువుకునే పిల్లల దగ్గర నుండి- చదువు చెప్పే ఉపాధ్యాయుల వరకూ, అందరికీ రాజు అంటే భయమే. అతను కూడా ఆ బళ్ళో స్టూడెంటే; కానీ ఆ ఊరి కామందు నాగరాజు గారి కొడుకు. అందువల్ల స్కూల్లో అతని ఆగడాలకు అడ్డు లేకుండా ఉండేది. ప్రధానోపాధ్యాయులు కూడా 'అనవసరంగా గొడవ ఎందుకులే' అని అతన్ని ఎక్కువగా ఏమీ అనేవారు కాదు.
రాజు అస్సలు చదివేవాడు కాదా, అంటే -అలాకాదు! బాగా చదువుతాడు, మార్కులు బాగా వచ్చేవి! కానీ అతను తోటి పిల్లల్ని హింసించేవాడు, చిన్నబుచ్చేవాడు; డబ్బు ఉన్నదన్న దర్పం బాగా చూపేవాడు; టీచర్లని అస్సలు గౌరవించేవాడుకాదు; వాళ్ళతో యిష్టం వచ్చినట్లు అగౌరవంగా మాట్లాడేవాడు.
ఒక రోజు వాళ్ళ స్కూల్లోకి కొత్తగావచ్చారు, ప్రకాశం మాస్టారు . ఆయనకి రాజు తీరు వింతగా అనిపించి, మిగిలిన టీచర్లని అడిగితే "అతనా? అతను బాగా డబ్బున్న వాడులెండి. చదువుతాడు, కానీ మనుషులంటే అస్సలు లెక్కలేదు. మీరు అతని గురించి పట్టించుకోకండి!" అని చెప్పారు.
అయితే పిల్లల మనసులు బాగా ఎరిగిన మంచి మాస్టారు ప్రకాశం. ఆయన అన్నారు వాళ్లతో- "ఓహో, అలాగా! సరే, అయితే మీరు చూస్తుండండి, పదిరోజుల్లోగా అతని చేత నమస్కారం పెట్టించుకుంటాను; అంతేకాదు, అతను అందరినీ గౌరవించేట్లు చేస్తాను" అని. నవ్వి ఊరు కున్నారు మిగిలిన టీచర్లు.
కానీ ఆశ్చర్యం! కొన్ని రోజుల తర్వాత టీచర్లంతా స్కూల్లోకి వెళ్తుండగా ఎదురైన రాజు, ప్రకాశం మాష్టారుకి నమస్కారం చెప్పివెళ్ళాడు! టీచర్లు, పిల్లలు అందరూ ఆశ్చర్యపోయారు. టీచర్లంతా ప్రకాశం మాస్టారు చుట్టూ చేరి "ఏం చేశారు మీరు, రాజుని?” అని అడిగారు.
"ఏం లేదండి, నాకు అతను ఎదురైనప్పుడల్లా నేనే నమస్కారం చేసేవాణ్ణి. కొన్నాళ్లు అతను నన్ను పట్టించుకోనేలేదు; అయినా నేను మాత్రం అలా నమస్కారం చేస్తూనే పోయాను. కొన్నాళ్ల తర్వాత అతను నన్ను గమనించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి అతనే ముందుగా నమస్కారం చేయడం మొదలుపెట్టాడు, అంతే! తర్వాత ఒక రోజున అతన్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని 'అందరినీ గౌరవించడం మంచిది' అని ప్రేమగా చెప్పాను. అప్పటి నుండీ అతను మారిపోయాడు" అని చెప్పారు ప్రకాశం మాస్టారు, నవ్వుతూ.