అనగా అనగా ఒక ఊళ్లో రంగయ్య అనే చాకలి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక మంచి గాడిద ఉండేది. రోజూ చాకలి తన మీద మోపే బరువులన్నిటినీ, ఎంత కష్టమైనా సరే, అది మోసేది. రంగయ్య కూడా చాలా శ్రమపడి పని చేసేవాడు. అయితే కాలం ఎవ్వరికోసమూ ఆగదు కదా! రాను రాను గాడిద ముసలిదైంది. ఇప్పుడు అది ఇదివరకటంత వేగంగా పని చెయ్యలేకపోతున్నది. రంగయ్యకు ఇప్పుడు అదంటే కొంచెం విసుగు వేస్తున్నది. కొంచెం అసహనంగా ఉంటోంది దాని నెమ్మది తనాన్ని చూసి.
ఒకరోజున రంగయ్యకు ఏదో పని పడి పొరుగూరికి వెళ్తూ, గాడిదను కూడా వెంట తీసుకెళ్ళాడు. తనకు అవసరమైన పనిముట్లు వగైరాలు కొనుక్కొని వెనక్కి బయలుదేరే సరికి సాయంత్రం కావస్తున్నది. ఊరు చేరే సరికి చీకటి పడిపోవచ్చు! అందుకని రంగయ్య త్వరత్వరగా నడవటం మొదలు పెట్టాడు. కానీ ముసలి గాడిద మెల్లగా నడుస్తున్నది. దాని నడక తీరును చూసి రంగయ్యకు చాలా కోపం వచ్చింది. కట్టె పట్టుకొని దాన్ని అదిలిస్తూ , తిట్టుకుంటూ పోసాగాడు.
ఆ గందరగోళంలో అతను తన కాళ్ళ ముందున్న బండ రాయిని చూసుకోలేదు- మరుక్షణం చాకలి నేల మీద వెల్లకిలా పడిపోతే, అతని గాడిద మాత్రం రోడ్డు ప్రక్కగా ఉన్న- నీళ్ళులేని బోడబావిలో పడిపోయింది!
రంగయ్య వెంటనే లేచి నిలబడ్డాడు. చూడగా గాడిదకు కూడా ఏమంత దెబ్బ తగిలినట్లు లేదు- అది బావిలోంచి పైకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నది. పైకి చూస్తూ రంగయ్యతో ఏదో చెప్తున్నట్లుగా అరుస్తూ ఉంది. ఎగిరి దూకుతున్నది; దబ్బున క్రింద పడుతున్నది. రంగయ్య కూడా గాడిదకోసం తపనపడసాగాడు. కానీ తను కొత్తగా కొన్న పార తప్ప దగ్గరలో వేరే ఏలాంటి సాధనాలూ లేవు. త్రాళ్ళు, తీగలు, కనీసం లతల లాంటివి కూడా ఏవీ లేవు కనుచూపు మేరలో. అంత లోతైన బావిలో పడ్డ గాడిదను తను ఒక్కడే బయటికి తెచ్చే ఉపాయం కూడా ఏదీ తోచలేదు. మెల్లగా చీకటి పడుతున్నది.. "ఇక చేసేదేమీ లేదు. గాడిదని బావిలోంచి బయటికి తేవాలంటే తను ఊరికి వెళ్ళి, మోకుల్ని, మరో నలుగురు మనుషుల్నీ తేవాలి. ఈ చీకటిలో అదంతా సాధ్యం కాదు. తెల్లవారే వరకూ బావిలోని గాడిద బ్రతికి ఉంటుందని కూడా నమ్మకం లేదు...అయినా ఈ గాడిద ముసలిదైపోయింది..అంత శ్రమపడి దీన్ని కాపాడుకున్నా, అది నాకు ఇంక ఎంత పని చేసిపెడుతుందో తెలీదు..దానికంటే మరో గాడిదను వెతుక్కోవటమే నయం.." ఇట్లా సాగుతున్నై, రంగయ్య ఆలోచనలు. చివరికి అతను నిశ్చయించుకున్నాడు- 'గాడిదను బావిలోనే వదిలేస్తాడు తను'.
రంగయ్య గాడిదను అక్కడే వదిలేసి ఊరివైపుకు నడవటం మొదలు పెట్టాడు. అతను లేడని గుర్తించిందో ఏమో, గాడిద మరింత పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఎంత దూరం పోయినా దాని అరుపులు రంగయ్య చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. కొంచెం దూరం పోయాక ఇక భరించలేకపోయాడు రంగయ్య. తన చేతిలోని పారని తేరిపార చూసి, వెనక్కి తిరిగి వచ్చాడు దృఢ నిశ్చయంతో- "ఈ గాడిదను బావిలోనే పూడ్చేయటం తప్ప వేరే మార్గం లేదు".
అప్పటికి సూర్యుడు అస్తమించాడు. ఉన్న కాస్త వెలుగులోనే రంగయ్య పని మొదలు పెట్టాడు. పైనుండి మట్టిని బావిలోకి త్రవ్విపోయసాగాడు. "గాడిదని పూడ్చేసేంత మట్టి పోసేందుకు తనకు ఎంత సేపు పడుతుంది..ఒక గంట?..రెండు గంటలు..? ఒక్కసారి అది మట్టిలో మునిగిపోయి నోరు మూసిందంటే తను ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు.."
అకస్మాత్తుగా పైనుండి మట్టి పడేసరికి ముందుగా బిత్తరపోయింది గాడిద. "యజమాని మట్టిని త్రవ్విపోస్తున్నాడు..మరి ఇప్పుడు తను ఏం చేయాలి?" కొంచెంసేపు దానికి ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోయింది. ఆ సరికి దాని నడుంవరకు మట్టి వచ్చి పడింది. అంతలో దాని ముఖం వెలిగిపోయింది- "యజమాని నాకోసం ఎంత శ్రమ పడుతున్నాడు!" అనుకున్నది. చకచకా తన మీద పడ్డ మట్టిని దులుపుకున్నది. నడుంలోతు మట్టిలోంచి తన్నుకొని బయట పడింది. ఆ కుప్పమీదికి ఎక్కి కూర్చుంది.
బాగా చీకటి పడింది. పైనుండి రంగయ్య మరింత మట్టిని త్రవ్వి పోస్తున్నాడు బావిలో. గాడిద ఆ మట్టిని దులుపుకుని మళ్ళీ మట్టి కుప్ప పైకి ఎక్కుతూ పోయింది. పైకి వచ్చినప్పుడల్లా కృతజ్ఞతతో అరుస్తున్నది. "ఏంటీ! ఇంకా ఇది పూడిపోలేదు..మన్నంతా ఎటు పోతున్నది?" అని తిట్టుకుంటూనే మరింత మన్ను త్రవ్వి పోస్తున్నాడు రంగయ్య. రాత్రి బాగా పొద్దుపోయే సరికి మట్టి కుప్ప బావి పైవరకు చేరుకున్నది! దాని మీది నుండి గాడిద చటుక్కున బయటకు దూకింది. సంతోషంతో,కృతజ్ఞతతో తన యజమాని చుట్టూ తిరగసాగింది!
ముందుగా ఆశ్చర్యపోయిన రంగయ్య, తర్వాత తేరుకొని, సిగ్గుపడ్డాడు. తనేమో గాడిదను వదిలించుకునేందుకు మట్టిపోశాడు. పాపం, ఈ పిచ్చి గాడిద, దాన్ని కాపాడేందుకు తను శ్రమిస్తున్నాడనుకున్నది. జరుగుతున్న పనిని మనం చూసే తీరును బట్టే, ఆ పని మనకు మేలో-కీడో చేస్తుంటుంది. పైనుండి పడే మట్టి తనమేలుకోసమే అని మనస్ఫూర్తిగా నమ్మిన గాడిద, ఆ మట్టి ఆధారంగా బయట పడింది. అదే వేరేగా అనుకొని ఉంటే అదే మన్నులోసమాధి అయిపోవును గద!
గాడిద సంతోషాన్ని చూశాక తన ప్రవర్తనకు చాలా సిగ్గుపడ్డాడు రంగయ్య. ఇద్దరూ మెల్లగా ఇంటికి చేరుకున్నారు. అటుపైన రంగయ్యకు గాడిద అంటే ఇష్టం ఏర్పడింది. ఎందుకో మరి, ముసలి గాడిద నెమ్మదితనాన్ని చూసి ఇప్పుడతనికి కోపం రావట్లేదు!