చాలా కాలం క్రితం ఒక మోహన్ ఉండేవాడు.
అప్పట్లో డబ్బున్నవాళ్ల పిల్లలంతా ఇంగ్లాండ్ లో చదువుకోవాలని కలలు కనేవాళ్ళు.
మోహన్‌దీ అదే కోరిక. అయితే ఆ రోజుల్లో ప్రధానమంత్రుల పిల్లల దగ్గరకూడా మరీ ఎక్కువ డబ్బులు ఉండేవి కావు. మోహన్ ఇంగ్లాండుకు వెళ్ళి తన బట్టలు తనే ఉతుక్కున్నాడు; తన జుట్టు తనే క్షవరం చేసుకున్నాడు; తనవంట తనే వండుకున్నాడు- బానే చదువుకున్నాడు కూడాను. వెనక్కి వచ్చాక మంచి ఉద్యోగమే దొరికింది- మరో దేశంలో.
ఈసారి ఆ దేశానికి వెళ్ళాడు ఉత్సాహంగా. సూటూ, బూటూ వేసుకొని, మంచి టోపీ పెట్టుకొని, విదేశాల్లోఎలా గౌరవనీయుడిలాగా ఉండాలో అంతకంటే బాగా తయారై వెళ్ళాడు, పడవలో. అక్కడ రేవులో దిగి, తను వెళ్ళాల్సిన ఊరికి వెళ్ళే రైలెక్కి కూర్చున్నాడు. చుట్టూ కూర్చున్న విదేశీయులకి మోహన్ వాలకం నచ్చలేదు. నీలి రంగు వేసుకున్న నక్క కనిపించింది వాళ్ళకి. మోహన్‌ని దిగి పొమ్మన్నారు.
"దిగను. నేనూ టిక్కెట్టు కొనుక్కున్నాను మీలాగానే" అన్నాడు మోహన్.
"అయినా కుదరదు- దిగి పోవాల్సిందే" పట్టు పట్టారు వాళ్లు.
"ఎందుకు కుదరదు? నేనూ మీలాంటి వాడినే. నేనూ చదువుకున్నవాడినే" అన్నాడు మోహన్ మొండిగా.
"నీలాంటి కూలీలతో కలిసి ప్రయాణం చేయం" అన్నారు వాళ్ళు, రెచ్చిపోతూ.
"నేను కూలీని కాదు- నేనూ మీలాగా ఇంగ్లీషు మాట్లాడతాను" అన్నాడు మోహన్.
వాళ్ళు నవ్వారు ఎగతాళిగా- "నీ రంగు చూస్తేనే తెలుస్తోంది నువ్వెవరివో. దిగుతావా, లేదా?" అని తన్ని, మెడపట్టి బయటికి గెంటేశారు మోహన్‌ని.
తను ఎక్కాల్సిన రైలు తనను వదిలేసి వెళ్ళిపోయేసరికి, వర్ణ వివక్ష అంటే ఏమిటో తెలిసివచ్చింది మోహన్‌కు. అనుభవిస్తేగానీ ఏదైనా తెలిసిరాదు. కోపం వచ్చిన మోహన్ ప్రభుత్వాల గురించి, పరిపాలన గురించి చదివాడు; మానవ హక్కుల గురించీ, మంచి చెడుల గురించీ చదివాడు. 'మంచికోసం నిలబడటం అవసరం' అనుకున్నాడు; అందరినీ కలుపుకు పోతే తప్ప ప్రయోజనం లేదనుకున్నాడు. తనకు లాగానే అవమానాల పాలు అవుతూ, గుడ్లనీరు క్రుక్కుకొని బ్రతుకుతున్నవాళ్లని అందరినీ ప్రేరేపించాడు. దేశంకాని దేశంలో అనామకులుగా జీవిస్తున్నవాళ్లంతా హక్కులకోసం పోరాటం చేశారు. చివరికి ప్రభుత్వం దిగి వచ్చింది. వాళ్లకీ హక్కులిచ్చింది.

వెనక్కి వచ్చిన మోహన్ సూటు బూటు వదిలేశాడు. టోపీలు, టైలు అంటే ఇప్పుడు అతనికి అసహ్యం వేసింది. ఇవన్నీ మన బానిసత్వానికి ప్రతీకల్లాగా కనిపించాయి. ఒకప్పుడు విదేశీయుల అలవాట్లను అనుకరించిన ఆ మోహన్‌దాస్ ఇప్పుడు బాపూజీగా ఎదిగాడు. మన స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తిగా వెలిగాడు. చివరికి "వీళ్ల దేశం నుండి వెళ్ళిపోతేనే నయంలే" అని బ్రిటిష్‌వాళ్ళు అనుకునేట్లు చేశాడు.
'బానిసత్వంలో ఉన్నాం' అని గుర్తించటంలోనే స్వాతంత్ర్యపు బీజాలు ఉన్నై, నిజంగా. ఏమంటారు?
అందరికీ స్వాత్రంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-కొత్తపల్లి బృందం.