అనగా అనగా గుట్టూరు కనుమలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది. కొత్తగా పెళ్ళయిన చిలుకల జంట ఒకటి వచ్చి దానిమీద కాపురం పెట్టుకున్నది. చెట్టును ఆనుకుని ఉన్న గుహలోనే ఒక పెద్దపులి ఉండేది. చిలకలను చూడగానే అది బయటకి వచ్చి ఆప్యాయంగా పలకరించింది. చిలుకలకు దాని కలుపుగోలు-తనం చాలా నచ్చింది. ఇక అప్పటినుండి అవి మూడూ రోజూ కాసేపు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టాయి.

ఒకరోజు పెద్దపులికి ఆరోగ్యం బాలేదు. ఆరోజున అది వేటకు వెళ్ళలేక, గుహలోనే ఉండిపోయింది. అయితే ఆ రోజు ఆహారం కోసం ఎగురుతూ వెళ్తున్న చిలుకలకు చనిపోయిన దుప్పి ఒకటి కనిపించింది, దారిలో. దాన్ని చూడగానే వాటికి పులి గుర్తుకు వచ్చింది-"పాపం, అది ఇవాళ్ళ వేటకు పోలేదు కదా!" అనుకున్నై . అందుకని మగ చిలుక వెనక్కు వెళ్ళి, "నేస్తం! ఈరోజు వేటాడే శ్రమ తప్పింది నీకు. ఇక్కడికి దగ్గర్లో ఒక దుప్పి చనిపోయి ఉంది. తిందువుగాని రా!" అని అంది. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న పెద్దపులి సంతోషంగా చిలుక వెంట వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకుంది.

ఆ రోజు నుండి వాటి స్నేహం మరింత బలపడింది. ఏదైనా చనిపోయిన జంతువు కనబడగానే చిలుకలు పనిగట్టుకొని పోయి పులికి చెప్పేవి. అలా పెద్దపులికి వేటాడాల్సిన పని లేకుండా, సులభంగా ఆహారం దొరకసాగింది. చివరికి ఇది ఎంతవరకు పోయిందంటే, బ్రతికి ఉన్న జంతువుల ఉనికిని కూడా చిలుకలు పులికి చెప్పటం మొదలు పెట్టాయి. వెంటనే పెద్దపులి అక్కడికి వెళ్ళి వాటిని చంపి తినసాగింది. ఇట్లా రోజులు గడుస్తున్నకొద్దీ పెద్దపులి బద్ధకం కూడా ఎక్కువౌతూ పోయింది.

అలా‌ ఉండగా ఒక రోజున ఆడచిలుక గ్రుడ్లు పెట్టింది. వాటిని కాపాడుకుంటూ ఉండాలి కదా, అందుకని ఇప్పుడు చిలుకలు ఎక్కువ దూరం వెళ్ళడం లేదు- రావి చెట్టుకు దగ్గరలోనే దొరికే పండ్లతో కాలక్షేపం చేస్తున్నాయి. దాంతో పెద్దపులికి పెద్ద చిక్కు వచ్చి పడింది. సొంతగా వేటాడటం అది ఎప్పుడో మరచి పోయింది! ఇప్పుడు వెతుక్కుంటే సరైన ఆహారం దొరకట్లేదు మరి! అందుకని దానికి చాలా కోపం వచ్చింది . అది మగ చిలుకను పిలిచి "నీ భార్య గ్రుడ్లను కాపాడుకుంటూ ఇక్కడే ఉంటుందిలే; నువ్వు నా వెంట వచ్చి, ఆహారం వెతకడానికి సహాయం చేయి. నీ సాయం లేకపోతే నేను వేటాడలేను" అంది కరకుగా.

‘పెద్దపులికి ఇట్లాంటి అలవాటు చేయడం నేను చేసిన తప్పు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యాక ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి మరో మార్గం లేదు'`అనుకున్న మగచిలుక, ఆడచిలుకకు జాగ్రత్తలు చెప్పి, పెద్దపులితో బయలుదేరి వెళ్ళింది.

ఏం ఖర్మో, ఏమో! ఆ రోజు అడవిలో ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనబడలేదు వాటికి. అవి నడుచుకుంటూ దాదాపు గిరిజన వాడ దగ్గరికి వెళ్ళాక, అక్కడ ఒక పంది కనిపించింది. పులి సంతోషంగా దాని మీదికి దూకి, చంపి తినటం మొదలు పెట్టింది.

అంతలో గిరిజనుడొకడు విల్లంబులతో పరిగెత్తుకు రావడం చూసింది చిలుక. వెంటనే అది పులిని హెచ్చరించి ఎగిరిపోసాగింది. తేరుకున్న పెద్దపులి కూడా గాభరాగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అయితే అలవాటు తప్పిపోవడం వల్ల కాబోలు, దానికి విపరీతమైన ఆయాసం వచ్చింది. ఆ రోజున అది తప్పించుకున్నదంటే కేవలం దాని అదృష్టమే. చివరికి ప్రాణాలు కడబట్టిన పులి వగరుస్తూ, నిదానంగా తన గుహ వైపు నడుస్తూ 'అయ్యో! ఒకప్పుడు ఎంత వేగంగా పరిగెత్తేదాన్ని! ఇప్పుడు ఇట్లా బద్ధకంగా తయారవడానికి కారణం- నా పని నేను చేసుకోకుండా చిలుకల మీద ఆధారపడటం! అందు వల్లనే కదా, ఇట్లా అయ్యింది!' అని విచారించసాగింది.

ఇంటికి చేరిన చిలుకకు ఏడుస్తున్న భార్య ఎదురైంది. "ఏమైంది, ఏమైంది?!" అని అది ఆడచిలుకను అడిగింది కంగారుగా. "మీ కోసం చాలా సేపు ఎదురు చూశాను. ఆకలికి తాళలేక, పండ్లు తెచ్చుకుందామని అలా బయటకు వెళ్ళాను. వచ్చి చూసేటప్పటికి రెండు గ్రుడ్లు మాయమయ్యాయి!" అన్నదది, ఏడుస్తూ.

అప్పుడే అక్కడికి చేరిన పెద్దపులి ఈ మాటలు విన్నది. దు:ఖిస్తున్న మగచిలుక దగ్గరకు వెళ్ళి "మిత్రమా! క్షమించు! అవసరం లేకపోయినా నాకు సహాయం చేయడం నీ తప్పు; నా పని నేను చేసుకోకుండా, 'సాయం చేస్తున్నావు కదా'-అని నీ మీద ఆధారపడటం నా తప్పు. మీ గ్రుడ్లను కాజేసింది జిత్తులమారి నక్కే అని నా అనుమానం. రేపు ఇదే సమయానికి అది మళ్ళీ వస్తుంది; మనిద్దరం దాన్ని పట్టుకుందాం. లే! బాధ పడకు! కొంచెం విశ్రాంతి తీసుకో!" అన్నది.

రాత్రి గడిచింది. మర్నాడు చిలుక, పెద్దపులి పొదలలో కాపు కాశాయి. ఆడచిలుక కూడా గూటికి దూరంగా కూర్చొని గమనించ సాగింది. కొంచెం సేపటికి నక్క రానే వచ్చింది! అటూ ఇటూ చూసుకుంటూ మెల్లగా రావి చెట్టు దగ్గరకు వచ్చి, మిగిలిన గ్రుడ్లకోసం చెట్టు ఎక్కబోయింది. అంతలోనే పులి ఒక్క దూకున చెట్టు దగ్గరకు వెళ్ళి, పంజా విసిరి, నక్కని చంపేసింది.

ఆ తర్వాత పెద్దపులి బద్ధకాన్ని జయించింది. మళ్ళీ తన ఆహారాన్ని తను స్వయంగా సంపాదించుకోవటం మొదలు పెట్టింది. అంతేకాదు, బిడ్డలకు కాపలాగా ఉన్నన్ని రోజులూ అదే స్వయంగా చిలుకలకు రకరకాల పండ్లను తెచ్చిపెట్టింది!