రంగయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద వాడు రాజుకి పెళ్ళి చేసాడు. రెండవ వాడు బుజ్జికి ఇంకా పెళ్ళి కాలేదు. చనిపోయేముందు రంగయ్య తన ఆస్తినంతా రెండు భాగాలు చేశాడు. పెద్దవాడికి కొంచెం ఎక్కువ, చిన్నవాడికి కొంచెం తక్కువ ఇచ్చాడు.

రాజు భార్య రాణి గడుసుది. అటు రంగయ్య చనిపోగానే ఇటు భర్తను పిలిచింది- "మీ తమ్ముడికి ఆస్తి పంచాము కదా! ఇంక వేరేగా ఉండమనండి" అంది. భార్య మాటని కాదనలేదు రాజు. రాణి చెప్పినట్లే చేసాడు. అన్నదమ్ములిద్దరూ వేరుపడ్డారు.

అప్పుడు మన బుజ్జిగాడు తన వాటాకు వచ్చిన ఒక్క గేదెనూ తోలుకొని చెరువుకి వెళ్ళాడు. అంతలోనే ఏమైందో ఏమో, బుజ్జిగాడి గేదె చెరువులోకి వెళ్ళి అందులోనే మునిగి చనిపోయింది. వాడు పాపం, ఏం చేస్తాడు? ఆ గేదె చర్మాన్ని ఒలిచి అడవికి తీసుకెళ్లాడు. బాగా ఆరేందుకని దాన్ని అడవిలో ఒక పెద్ద చెట్టు కొమ్మల మీద పరచి కట్టాడు .

కొన్ని రోజులు గడిచాయి. చెట్టుమీద గేదె చర్మం బాగా ఎండింది. అంతలో కొంత మంది దొంగలు ఎక్కడెక్కడో బాగా డబ్బు దోచుకొని, వాటాలు పంచుకునేందుకు అడవిలోకి వచ్చారు. ఆ చెట్టు క్రిందే, దుప్పటి మీద డబ్బులు, నగలు పరిచారు. వాటిని వేరువేరు భాగాలు చేస్తున్నారు. అంతలోనే వర్షం మొదలైంది. ఎండిన చర్మం మీద వాన పడే సరికి అది 'ధంధం..ధంధం' అని శబ్దం చెయ్యడం మొదలుపెట్టింది. దొంగలు బెదిరిపోయారు. 'ఎవరో తమని చూసి, మిగతా వాళ్లందరినీ పిలుస్తున్నారు' అని భయపడ్డారు. తాము సంపాదించిందంతా అక్కడే వదిలేసి ఉడాయించారు.

మరుసటి రోజున బుజ్జిగాడు అడవికి వెళ్ళాడు. అక్కడ చెట్టుక్రింద కుప్పలు పోసి ఉన్న డబ్బును, నగల్ని చూసి ఆశ్చర్యపోయాడు. మొత్తం ఇంటికి తీసుకొచ్చుకున్నాడు.

ఆరోజు అతను వదిన దగ్గరికి వెళ్ళి "వదినా, బియ్యం కావాలి" అనగానే వదిన డబ్బులడిగింది. బుజ్జిగాడు ఒక వెయ్యి రూపాయల నోటు తీసి ఇచ్చాడు. అది చూసి వదిన సొమ్మ సిల్లి పడిపోయింది. అంతలో రాజు వచ్చి, ఆమెని లేపి, జరిగిన సంగతి తెలుసుకొని బుజ్జి దగ్గరకు వెళ్ళి- "నీ దగ్గరికి ఏదో చాలా డబ్బు వచ్చినట్లుంది..ఎలా వచ్చింది, నిజంచెప్పు !" అన్నాడు.

"నాగేదెను చెరువుకి తీసుకు వెళ్ళాను అంతే. అది కాస్తా చనిపోయింది. ఏం చెయ్యాలో తెలీక, దాని చర్మాన్ని అమ్మాను. నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి!" అన్నాడు తమ్ముడు గడుసుగా.

అన్న ఆలోచనలు పరుగులు తీసాయి. "వీడికి ఒక గేదే కదా, ఉన్నది? నాకైతే రెండు గేదెలు ఉన్నాయి! వాటి చర్మాన్ని అమ్మితే నాకు ఇంకా చాలా డబ్బులు వస్తాయి!" అనుకున్నాడు. తన రెండు గేదెల్నీ చెరువుకి తోలుకెళ్ళాడు. అవి చావకపోయినా, తనే బలవంతంగా రెండిటినీ చంపేశాడు. అటుపైన వాటి చర్మాన్ని తీసుకువెళ్ళి మార్కెట్టులో పెట్టి అమ్మటం మొదలు పెట్టాడు. అవి అస్సలు అమ్ముడు పోలేదు. అంతే కాదు; రెండో రోజుకల్లా అవి ఎంత కంపు కొట్టాయంటే, సంతలోని వ్యాపారులంతా రాజును కొట్టి కొట్టి తరిమారు.

వెనక్కి వచ్చాక, రాజుకి తమ్ముడంటే విపరీతమైన కోపం వచ్చింది. ఎవ్వరూ లేని వేళ తమ్ముడి ఇల్లు కాస్తా తగలపెట్టాడు. బుజ్జిగాడు వచ్చి చూసుకుంటే ఏముంది, ఇల్లంతా బూడిదైంది! వాడు భోరు భోరున ఏడుస్తూ ఆ బూడిదనే ఒక బస్తాలో వేసుకొని పోయాడు. బూడిదమూట చాలా బరువుగా ఉంది. అయినా వాడికి అది బరువు అనిపించలేదు. ఆరోజు సాయంత్రానికి వాడొక సత్రం చేరుకొని, అక్కడ బస చేశాడు. మాటి మాటికీ ఆ బస్తాను విప్పి చూసుకుం-టున్నాడు. అందులోనే కన్నీళ్ళు కారుస్తున్నాడు.

అదే సత్రంలో ఆగాడు ఒక మోసగాడు. తను ఎవరెవరినో మోసంచేసి సంపాదించుకున్న బంగారు నాణాలను ఒక చిన్న మూటగా కట్టి, వెంట పెట్టుకొని తిరుగుతుంటాడు వాడు. బుజ్జిగాడు బస్తాలోకి కన్నీళ్ళు కార్చటం చూసి వాడు ఆశ్చర్యపోయాడు. బుజ్జిగాడు నిద్రపోగానే మెల్లగా ఆ బస్తాను విప్పి చూశాడు. బస్తానిండా బూడిద ఉన్నది. అయితే అక్కడక్కడా ఆ బూడిదలో మెరిసే రాళ్ళు కనబడ్డాయి. "ఓహో! ఇందులో కన్నీళ్ళు కారిస్తే వజ్రాలు తయారౌతాయన్నమాట!" అనుకున్నాడు వాడు. తన చిన్న మూటను అక్కడే వదిలేసి, రాత్రికి రాత్రే బుజ్జిగాడి బూడిద బస్తాను ఎత్తుకుపోయాడు!

తెల్లవారగానే బుజ్జిగాడికి బస్తా స్థానంలో బంగారు నాణాల మూట కనబడింది. వాడు దాన్ని తీసుకొని కులాసాగా ఇల్లు చేరుకున్నాడు. తనకు దొరికిన ఆ డబ్బుని కొలుద్దామనుకున్నాడు బుజ్జిగాడు. వదిన దగ్గరకు వెళ్ళి మానిక అడిగాడు.

అయితే వదినకు అనుమానం వచ్చి, మానికకు అడుగున కొంచెం చింతపండు అతికించి ఇచ్చింది వాడికి- "జాగ్రత్త నాయనా! ఇప్పటికే మానికకు చిల్లి పడింది" అన్నది. బుజ్జిగాడు ఆ మానికను తీసుకెళ్ళి తన దగ్గర బంగారు నాణాలు ఎన్ని ఉన్నాయో కొలుచుకున్నాడు. పని అయిపోగానే మానికను జాగ్రత్తగా వదినకు తిరిగి ఇచ్చి వచ్చాడు కూడా. అయితే వాడికి తెలీకుండా, మానికకు అడుగున చింతపండులో ఒక బంగారు నాణెం అతుక్కొని ఉండిపోయింది!

వాడు మానికను ఇచ్చి వెళ్ళగానే వదిన దాన్ని పరీక్షించింది. మానిక అడుగున అతుక్కుని బంగారు నాణెం బయటపడింది. "అంటే వీడు ఈ‌మానికతో బంగారునాణాలు కొలిచాడన్నమాట!" ఆ ఆలోచనకే ఆమెకు ఊపిరి సలపలేదు. వెంటనే రాజుని పిలిచి, వాళ్ళ తమ్ముడికి అంత డబ్బు ఎక్కడినుండి వచ్చిందో అడగమన్నది.

అన్న పరుగున వెళ్ళి తమ్ముడిని అడిగాడు. "నా ఇల్లు కాలి బూడిద అయ్యింది. నేను దాన్ని తీసుకెళ్ళి అమ్మాను. ఎవరో దాన్ని తీసుకొని నాకు ఇన్ని ‌డబ్బులు ఇచ్చారు' అన్నాడు తెలివైన తమ్ముడు.

"ఓహో! వాడికి ఉన్నది ఒక్క ఇల్లే గదా, నాకైతే రెండు ఇల్లులు వున్నాయి. ఎక్కువ బూడిదకు మరిన్ని డబ్బులు వస్తాయిలే!" అనుకున్నాడు ఆశపోతు రాజు. భార్యా- భర్తలిద్దరూ కలిసి రెండు ఇళ్ళనూ తగల బెట్టి బూడిదను సంతకు తీసుకువెళ్ళారు. 'సోల అయిదు రూపాయలకు అమ్మినా బోలెడు డబ్బు!" అని వాళ్ళు అనుకున్నారు; కానీ ఇంతలో గాలి ఎంతలా వీచిందంటే, ఆ బూడిదంతా ఎగిరి అక్కడ వున్న జనాల కళ్ళలో పడింది! సంతలోని వాళ్ళంతా ఈ బూడిద బస్తాలను విసిరేసి, వీళ్లను ఇష్టం వచ్చినట్లు కొట్టారు.

అన్న కోపంతో ఉడికిపోతూ ఇంటికి వచ్చేసరికి, బుజ్జిగాడు మంచం మీద ఒళ్ళు మరచిపోయి నిద్రపోతూ కనబడ్డాడు. అన్నకు కోపం ఆగలేదు-"వాడిని తాళ్ళతో కట్టి కాలవలో పారేయండి" అని తన మనుషులకు పురమాయించాడు. వాళ్ళు వాడిని మంచంతో సహా మోసుకుని వెళుతూ ఉండగా వాడికి మెలకువ వచ్చింది. తనను మోసుకెళ్తున్న వాళ్ళని గుర్తుపట్టాడు. వాళ్ళను ఓసారి ఆగమని చెప్పి, "నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు?" అని అడిగాడు. "మీ అన్న కాలవలో పడెయ్యమన్నాడు నిన్ను" అన్నారు వాళ్ళు.

బుజ్జిగాడు అప్పుడు సమయస్ఫూర్తితో "ఉండండి. ఇంకాసేపట్లో నేను ఎలాగూ చనిపోతాను. ఆలోగా నన్ను కొంచెం పుణ్యం సంపాదించుకోనివ్వండి" అన్నాడు వాళ్ళతో. "సరే చెప్పు! ఏంచేస్తావు?" అన్నారు వాళ్లు. "ఇదిగో చూడండి, నాజేబులో డబ్బులు వున్నాయి. వాటిని తీసుకొని మీరు బిర్యాని తిని రండి" అన్నాడు బుజ్జిగాడు. "ఓహో! బలే ప్లాన్ వేశావు, మమ్మల్ని అటు పోనిచ్చి నువ్వు ఇటు పారిపోవడానికా?" అన్నారు వాళ్ళు. "కాదు కాదు! మీరు నన్ను చాలా దూరం నుంచి మోసుకు వస్తున్నారు కదా, మీకు ఆకలి వేస్తుంటుంది పాపం. చనిపోయేముందు ఆకలిగా ఉన్న వాళ్లకు అన్నం పెడితే నాకు ఎంత పుణ్యం!" అని వాళ్ళను సాగనంపాడు బుజ్జి. వాళ్ళు వాడిని మంచంతో సహా ఒక చెట్టు క్రింద దింపి, బిర్యానీ‌ తినేందుకు వెళ్ళారు.

అంతలోనే ఒక ముసలివాడు గొర్రెలను తోలుకొని అటువైపుగా వచ్చాడు. ఆ మంచాన్ని, దానిమీద పడుకొని ఉన్న బుజ్జిగాడిని చూసి "ఏంటీ! నిన్ను ఇట్లా ఎవరు కట్టేసారు?" అని అడిగాడు.

"నాకు పెళ్ళి వద్దు మొర్రో అన్నా కూడా వినకుండా పెళ్ళి చేసేందుకు తీసుకువెళ్తున్నారు, మా అన్నలు!" అని నమ్మ బలికాడు బుజ్జిగాడు. ఆ ముసలివాడికి పెళ్ళి పిచ్చి. "నీ బదులు మరి నేను పెళ్ళి చేసుకుంటాను. నీ స్థానంలో నన్ను కడతావా?" అన్నాడు వాడు ఆశగా.

"ఓఁ దానిదేమి భాగ్యం? ముందు ఈ తాళ్ళు విప్పు" అన్నాడు బుజ్జి. పెళ్ళి తొందరలో ఉన్న ముసలివాడు వాడిని విప్పేసి , వాడి స్థానంలో తను పడుకొని, మళ్ళీ తాళ్ళతో కట్టేయించుకున్నాడు. బుజ్జిగాడు ఆ గొర్రెలను తోలుకొని గబగబా ఇంటి దారి పట్టాడు. కొంత సేపటికి పనివాళ్ళు బిర్యానీ తిని వచ్చి, బుజ్జిగాడి స్థానంలో పడుకొని ఉన్న ముసలివాడిని చూసి "ఇదేంటి, నువ్వెట్లా వచ్చావు, ఇక్కడికి?" అని అడిగారు. "నాకు పెళ్ళి చెయ్యండి!"అని ముసలివాడు అనేసరికి వాళ్లంతా కడుపుబ్బ నవ్వుకొని, వాడిని విప్పి తరిమేసారు.

ఆలోగా అన్న ఎదురయ్యాడు బుజ్జికి. బుజ్జి అన్నన్ని గొర్రెలు తోలుకురావటం చూసి "ఏంటిరా తమ్ముడూ! నిన్ను కాలవలో విసిరేశారు కదా, మరి నీకేంటి, ఈ గొర్రెలు?" అని అడిగాడు. "వాళ్ళు నన్ను నీళ్ళలో పడవేయగానే జలదేవత వచ్చింది. నా ఒక్కో మునుకకు ఒక్కో గొర్రెను ఇచ్చింది" అన్నాడు తమ్ముడు తెలివిగా.

ఆశపోతు అన్న-వదినలు ఇంక ఆలోచించలేదు. 'వాడు ఒక్కడే గదా, మేము ఇద్దరం!' అనుకున్నారు. ఇద్దరూ వెళ్ళి కాలవలో మునిగారు. అట్లా మునిగిన వాళ్లు ఇంక మళ్ళీ వెనక్కి రాలేదు!