వసంతపురం అనే ఊరు సముద్రతీరానికి దగ్గరగా ఉంది, ఒక కొండ మీద. కొండ దిగువన, సముద్రం ఒడ్డున గంగమ్మ గుడి ఉన్నది. కొండ మీద ఉన్న కుటుంబాల వాళ్ళందరికీ గంగమ్మ ఆరాధ్య దైవం. ప్రతి ఏటా పంట కోతలు, నూర్పిళ్ళు అయిన వెంటనే సముద్ర తీరాన గంగమ్మ జాతరచేస్తారు వాళ్లంతా.

ఆ ఊళ్ళో వెంకయ్య అనే ముసలి తాత ఒకడు ఉన్నాడు. తాత జీవిత అనుభవం చాలా గొప్పది. తాతకు కొడుకులు కోడళ్లు లేరు. ఒక్క మనవడు మాత్రం ఉన్నాడు. వాడి ఆసరాతోటే తాత నెగ్గుకొస్తున్నాడు.

ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా గంగమ్మ జాతర మొదలైంది. ఊళ్ళో జనాలంతా ఆనందోత్సాహాలతో కొండ దిగారు. సముద్ర తీరాన ఉన్న గుడి దగ్గరకి వచ్చారు. అందరూ అమ్మవారిని ఊరేగిస్తున్నారు. ఎక్కడెక్కడినుండో వచ్చిన బంధువులు, రంగు రంగుల కొత్త బట్టలు, సందడిగా డప్పుల దరువులు, కోలాహలం. హడావిడి చేస్తున్న జనాలతో కొండ క్రింద మిట్ట అంతా కిటకిటలాడిపోతున్నది.

తాతది ముసలితనం. కొండ దిగితే మళ్ళీ ఎక్కలేడు. అందుకని ఇంటి దగ్గరే ఆగిపోయాడు. ఆయన మనవడు, పదేళ్ల రవి కూడా తాతకు తోడుగా కొండ మీదే ఆగిపోయాడు. రవికి కూడా కొండ దిగి జాతరకు వెళ్ళాలని ఉంది; కానీ ఎందుకనో ఆ రోజున తాత వెళ్ళనివ్వలేదు. 'సరేలే, తాత నిద్రపోయాక వెళ్దాం' అని చూస్తున్నాడు రవి.

అంతలో పడుకొని ఉన్న తాత దిగ్గునలేచాడు. నాలుగు వైపులా చూశాడు. గట్టిగా గాలి పీల్చాడు. ప్రకృతిలో వచ్చిన వింత మార్పులను గమనించాడు. హడావిడిగా లేచి నిలబడ్డాడు. వెంటనే రవితో చెప్పి కిరసనాయిలు డబ్బా తెప్పించాడు. గబగబా గడ్డి వాముల దగ్గరికి వెళ్ళాడు. కిరసనాయిలు వాముల మీద చల్లి నిప్పంటించాడు. మరుక్షణం వాములన్నీ అంటుకొని కొండమీద అంతటా పెద్ద పెద్ద మంటలు లేచాయి!

కొండకింద జాతరలో ఉన్న జనాలు మంటల్ని చూసారు. పొలోమంటూ కొండ పైకి వచ్చారు. అందరూ కలిసి మంటల్ని ఆర్పివేశారు. 'మంటలు ఎలా రేగాయి..? ఇక్కడ ఉన్నది తాత ఒక్కడే కదా?' అని ఆలోచనలో పడ్డారు.

అయితే అక్కడ కొండమీద మంటలు ఆరిపోయిన కొంత సేపటికి, సముద్రంలో రాకాసి అలలు పుట్టాయి! తాటి చెట్టున లేచిన అలలు తీరాన్ని తాకి కొండను మొత్తాన్నీ ధడధడలాడించాయి. ఉప్పొంగిన సముద్రంలో గంగమ్మ గుడి దగ్గరున్న కొబ్బరి చెట్లుకూడా పూర్తిగా మునిగిపోయాయి.

ఇదంతా చూసిన జనాలకు అర్థమయింది- సునామి నుండి తాము తప్పించుకున్నామని.

ప్రకృతిలో మార్పుల్ని గుర్తుపట్టి, సమయస్ఫూర్తితో అంతమంది ప్రాణాలను కాపాడిన తాతను అందరూ మెచ్చుకున్నారు.

ఎవరికి వాళ్ళు తాతకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.