కొత్తపల్లి పుస్తకం పట్టుకోగానే టపటపమంటూ చినుకులు మొదలైనాయి. దట్టంగా పైన కప్పేసిన చెట్ల ఆకుల సందుల్లోంచి పడుతున్న వాన ఎండిన నేలని తడిపేసింది. కమ్మటి వాసనొచ్చింది. జోరెత్తిన వానలో తడిసి ముద్దయి కాళ్ళక్రింద మెత్తటి బురద జారిపోయింది. గొడుగుల మీద పడుతున్న చినుకులు వింత శబ్దాలు చేశాయి. రివ్వున కొట్టిన చలిగాలి వణికించింది.. అట్టమీద బొమ్మతో పంచేంద్రియాలనూ స్పందింపజేసింది, అడవిరాముడి కుంచె! గొప్ప అనుభూతి వచ్చింది. ఒక సినిమా చూసినట్లైంది.
చదువుల పోటీల్లో నెగ్గుకు రావటానికి పుస్తకాల పురుగులైపోయి ఆటపాటలకీ, ప్రపంచానికీ దూరమౌతున్న పిల్లలకి ఈసారి సంపాదకీయం చక్కటి సందేశాన్నిచ్చింది. కాకపోతే అసలు కథలోని చీమ, మిడత పాత్రల స్వభావాన్ని విషయం చెప్పటానికి అనువుగా మార్చుకున్నట్లుంది. పాతకాలంనాటి మిడత ఒట్టి బద్ధకస్తురాలు, ప్రపంచం పట్టనిదీనూ కదా!
రామ్మోహన్ రాసిన అల్లరి దయ్యాల కథ సరదా సరదాగా ఉంది. పాత జానపద సినిమాల్లో హీరోలు కూడా అలానే చేసేవారు. దయ్యాలంటే భయపడే పిల్లలు ఈ కథ చదివితే- 'ఓస్! ఇంత వెర్రివెంగళప్పలా, దయ్యాలంటే?! వీటిని తల్చుకునా, నేను భయపడిందీ?!' అనుకోక మానరు. చెట్లని నరికే రాజులు కోకొల్లలు. వారికి ఏ కారణమూ అక్కర్లేదు, ఆ పని చెయ్యడానికి రవివంటి పిల్లలు ఇంకా ఇంకా కావాలి. మంచి కథ చెప్పావు,నిఖిల్!
'రాక్షసుడితో పోరాటం'లో నువ్వేకదా, శివకుమార్, రాజకుమారుడివి? అందుకే కదా,అతనికి అంత ధైర్యమూ, బలమూనూ?! రాక్షసుడి మీసం పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేయగలడా, లేకపోతే? పిల్లలంతే. చెయ్యలేని పనేదీ వున్నట్టనిపించరదు వాళ్లకి. మనకా,. బోల్డన్ని భయాలూ, సందేహాలూనూ.
'ప్రేమ' కథకి ఎంచుకున్న అంశం, పాత్రల నిరాడంబర చిత్రణా, క్లుప్తంగానే ఎంతో చెప్పిన తీరు- ప్రజ్వల్ గొప్ప రచయిత కాగలడనిపించింది. సున్నితంగా సూటిగా మనసుని తాకింది, ఈ కథ.
హైమవతిగారి కథలు ఎప్పుడూ గాఢంగానే వుంటున్నాయి. భాషమీద పట్టు ఉన్నవారు రాసిన చిక్కదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎంచుకున్న అంశంకూడా కొత్తగా ఉంది. మిత్రులైన రాజులు ఇద్దరూ ఒకచోట ఏకవచనంలోనూ, మరోచోట బహువచనంలోనూ సంబోధించుకోవటం గమనింపుకురాని పొరపాటై ఉంటుంది.
పర్తాప్ అగర్వాల్ గారి 'మన ఇల్లు'చెప్పలేనంత బావుంది. ఇష్టంగా చెయ్యని పనులు ఎంత పేలవంగా ఉంటాయో! అలా చెయ్యడం మన ఆరోగ్యానికే కాదు, వ్యక్తిత్వానికీ చెడు చేస్తుంది కదా!
చక్కటి పాటలు అందరికీ అందించటం కొత్తపల్లి చేపట్టిన చాలా మంచి పని. వీటిని మనమంతా మరింతమందికి పంచాలి. పాటలు పాడుకుంటూ పిల్లంతా చిందులేసి ఆనందించాలి. మరిన్ని మంచి పాటలకోసం, ఇంకెన్నో మంచి కథల కోసం ఎదురు చూద్దాం.