అనగనగా ఒక ఊరిని ఒక రాజు గారు జనరంజకంగా పరిపాలించే వారు.
తన రోజువారీ కార్యక్రమాలతో అలసిపోయిన రాజుగారు ఆ రోజు రాత్రి హంసతూలికా తల్పం మీద ఆదమరిచి నిద్ర పోతున్నారు..అకస్మాత్తుగా ఆయనకు నిద్రాభంగం అయ్యింది.. కారణం..? తలుపును ఎవరో తడుతున్నారు.
దానితో నిద్ర లేచి సమయం చూస్తే సుమారు మూడు గంటలు అయ్యింది.
"ఎటూకాని ఈ సమయంలో ఎవరు, నన్ను నిద్ర లేపింది?" అని రాజు గారికి విపరీతంగా కోపం వచ్చింది.
కానీ తలుపు తీసి చూసేసరికి రాజు గారి నిద్ర కాస్తా ఎగిరి పోయి, దాని స్థానంలో విస్మయం చోటు చేసుకుంది! కారణం, ఎన్నో ఏళ్ళుగా రాజ్యానికి సేవలందిస్తున్న సేవలందిస్తున్న ముసలి మంత్రి దర్శనం ఇవ్వడమే. ఇంకొకరు ఎవరైనా ఆ సమయంలో రాజు గారికి నిద్రా భంగం కలిగించి ఉంటే వాళ్ల మెడమీద తల నిలిచేది కాదు. ఆయన కోపం అంతటిది. కానీ ఎన్నో దశాబ్దాలుగా రాజ్యానికి ఎనలేని సేవలు అందిస్తున్న మంత్రి గారు వేరు.
ఆయన్ని చూడగానే రాజుగారు "మహామంత్రీ!మీరు, ఈ సమయంలో వచ్చారా? అంతా కుశలమేనా? మన రాజ్యానికి శత్రువులనుండి ఏదైనా ముప్పు ఉందని వర్తమానం అందిందా?" అని ప్రశ్నించారు ఆందోళనతో.
"అట్లాంటివేమీ లేవు, మహారాజా! అయినా ఎవరికీ అలివిగాని ఈ సమయంలో తమరికి నిద్రాభంగం కలిగించినందుకు క్షమించండి. ఇందాక నా కలలో వినాయకుడు, జీసస్, మొహమ్మద్ ప్రవక్త- ఇలా అందరు దేవుళ్ళూ దర్శనమిచ్చి, 'ఓరి మంత్రీ! ఇంకా ఎన్ని సంవత్సరాలు పదవిని పట్టుకొని వ్రేలాడుతావు? పుణ్యం,పురుషార్ధం లాంటివి ఏవీ నీకు అక్కరలేదా?' అని నా మీద కోపగించుకున్నారు మహారాజా! దాంతో నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను మహామంత్రి పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. దయచేసి అనుగ్రహించండి" అన్నాడు.
రాజుగారికి తల తిరిగి పోయింది. "మంత్రి గారూ, అర్ధరాత్రి మద్దెల దరువు అంతే ఇదే! మీరు ఉదయం పది గంటలకు కనిపించండి. నా నిర్ణయం తెలియజేస్తాను" అన్నాడు. మంత్రి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. పడుకున్నారు కానీ, రాజుగారికి ఇంక నిద్రమాత్రం పట్టలేదు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు: మంత్రి రాజీనామా ఒప్పుకుందామా, అంటే- ఇంత సమర్ధుడు ఎక్కడ దొరుకుతాడు? ఒకవేళ రాజీనామా ఒప్పుకోవడం మానేద్దామా- అంటే మంత్రిగారి కోరికలో న్యాయం ఉందిగదా?' అని రకరకాలుగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆరోజు పదిగంటలకు మంత్రి తనను కలవగానే రాజుగారు "మంత్రి గారూ! మీ రాజీనామాను నేను ఆమోదిస్తున్నాను. కానీ 'చెడుపు పెట్టిన వారే చెడుపు తియ్యాలి' అంటారు కదా, అట్లాగే మీ వల్ల ఖాళీ అవుతున్న మంత్రి పదవికి సమర్ధుడైన వారసుడిని మీరే ఎంపిక చెయ్యాలి" అని అజ్ఞాపించాడు. "మీకు ఒక నెల రోజులు సమయం ఇస్తున్నాను" అన్నాడు. ముసలిమంత్రి సరేనని తలఊపాడు. వెంటనే కొత్త మంత్రిని ఎంపిక చేసే పనిలో పడ్డాడు.
ఈ తంతు అంతా గమనిస్తున్న మహారాణి "ఇదెక్కడి గోల, మహారాజా? ఎంతో అందగాడు, సమర్ధుడు అయిన మా తమ్ముడు వుండగా మళ్ళీ ఇంకో మంత్రి ఎందుకు? తక్షణమే మా తమ్ముడిని ఎంపిక చెయ్యండి" అనింది.
రాజుగారు "ఇదెక్కడి తలనొప్పి వ్యవహారం?" అనుకున్నాడు. అయినా రాజుగారు కదా, మనసులోని మాట బయట పెట్టకుండా చిరునవ్వుతో "మహారాణీ! మీరు కంగారు పడకండి. మంత్రి ఎంపిక చేసి తెచ్చిన వ్యక్తికి, మీ తమ్ముడికీ పోటీ పెడదాం. ఎవరు గెలిస్తే వాళ్ళని కొత్త మంత్రిగా ఎంపిక చేస్తాను" అన్నాడు. తన తమ్ముడి శక్తి యుక్తుల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న మహారాణి తక్షణమే అందుకు అంగీకరించింది.
ఆ రోజునుండి రాణిగారి తమ్ముడు మంత్రి పదవిని పొందడానికి చాలా తీవ్రంగా కష్టపడటం మొదలు పెట్టాడు. రకరకాల పుస్తకాలు, శాస్త్రాలన్నీ చదివేశాడు. చూస్తుండగానే నెల రోజులు ఇట్టే గడచి పోయాయి.
ముప్ఫై ఒకటవ రోజున మహామంత్రి ఎవరినో వెంటపెట్టుకొని దర్శనం కోసం వచ్చాడని భటులు వర్తమానం తెచ్చారు. దానితో మంత్రి పదవికి పోటీ ప్రారంభమైంది. మహారాణిగారి తమ్ముడికి, మంత్రిగారు ఎంపిక చేసి తెచ్చిన వ్యక్తికి ఇద్దరికీ మహారాజుగారు ఒక చిన్న పని అప్పగించారు. ఆ పనిని ఎవరు బాగా చేస్తే వాళ్లు మంత్రి అవుతారు. మరి ఏమిటా పని?
కోట గోడ మీదినుండి దూరంగా ఎడ్ల బళ్ళు కనిపిస్తున్నాయి. అవి ఎక్కడకు వెళ్తున్నాయో కనుక్కొని చెప్పాలి. అది, వాళ్ళిద్దరికీ అప్పగించిన పని.
"ఓస్ ఇంతేనా" అన్నాడు రాణిగారి తమ్ముడు. రాజ్యంలోనే అతివేగంగా పరిగెత్తగలిగిన గుర్రాన్నెక్కి బయలుదేరాడు. పదంటే పది నిముషాలలో తిరిగివచ్చి మళ్ళీ రాజు గారి ముందుకు నిలబడ్డాడు-"మహారాజా! ఆ ఎడ్ల బళ్ళు పక్క రాజ్యానికి వెళ్తున్నై. మీరు చెప్పిన పనిని కేవలం పది నిముషాల్లో పూర్తిచేసాను- దయచేసి గమనించండి" అని సెలవు తీసుకున్నాడు.
తరువాత మంత్రి ఎంపిక చేసిన వ్యక్తి వంతు వచ్చింది. అతను పనిమీద బయలుదేరి ఒక గంట గడిచింది., రెండు గంటలు గడిచాయి..అయినా అతని జాడ లేదు. రాణిగారి తమ్ముడు రాజుగారి ప్రక్కనే కూర్చొని సంబరపడుతున్నాడు, 'తన ఎంపిక ఖాయమైనట్లే'అని. నిజానికి రాజుగారికి కూడా సంగతి అర్ధం కాలేదు- 'ఇంత చిన్న పనికి అంత సమయం ఎందుకు తీసుకుంటున్నాడో' అనుకున్నాడు. రాణిగారైతే 'ఇంక ఆలోచించకండి! మా తమ్ముణ్ని మంత్రి గా ఎంపిక చెయ్యండి" అని నామజపం మొదలుపెట్టింది. ఐతే రాజుగారు మాత్రం మంత్రి మీద గౌరవంతో 'మరి కొంత సేపు వేచిచూద్దాం' అన్నారు.
చాలా సమయం గడచిన తరువాత వచ్చాడు మంత్రి ఎంపిక చేసిన అభ్యర్ధి, గసపోసుకుంటూ- "మహారాజా, ఆ ఎడ్ల బళ్ళు పక్క రాజ్యానికి వెళుతున్నాయి. 'బళ్ల మీద ఉన్న బస్తాలలో ఏమి వున్నాయో' అని పరిశీలించాను. 'ధాన్యం' అని తేలింది. 'అసలే మన రాజ్యం లో కరువు తాండవిస్తూ ఉంది కదా, మరి మన రాజ్యం నుంచి ధాన్యం ఎందుకు తీసుకుని వెళ్తున్నారు?' అని గట్టిగా అడిగే సరికి, వాళ్ళు శత్రుదేశపు గూఢచారులని తేలింది. మన రాజ్యాన్ని అస్థిరపరచడానికి వాళ్ళు పెద్ద పథకమే వేశారు. ఆ పథకంలో భాగంగానే మన రాజ్యం నించి ధాన్యం తరలిస్తున్నారట. వాళ్ళ కుట్రను ఛేదించి, వాళ్ళందర్నీ రక్షక భటులకు అప్పగించి వచ్చేసరికి ఈ సమయం అయ్యింది!" అన్నాడు.
మంత్రిగారి ముఖం వెలిగిపోయింది. రాణిగారి తమ్ముడు తల వంచుకున్నాడు. రాజుగారు రాణిగారివైపు చూశారు. రాణిగారు ఓరకంట ఓసారి తమ్ముడిని చూసారు; మళ్ళీ అటువైపుకు కూడా చూడలేదు. కొత్త మంత్రి ఎంపిక పూర్తైంది.
ఇంతకీ ఎవరు ఎంపికయ్యారు? మీరే చెప్పండి, అనుమానం ఎందుకు?