ఒక ఊరిలో మంగయ్య అనే మంగలి ఉండేవాడు. అతని భార్య లక్ష్మమ్మ. వాళ్లది పేద కుటుంబం. కానీ మంగయ్య చాలా తెలివైనవాడు.

ఒక రోజు మంగయ్య పనిచేసి వస్తూ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతలో అతని ముందు ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు.

"హ!హ!హ! నాకు ఆకలిగా ఉంది, నిన్ను తినేస్తా" అని అరిచాడు.

ఒక్కక్షణం ఆలోచించిన మంగయ్య "హ!హ!హ!" అని నవ్వేశాడు.

అది చూసి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. "అందరూ నన్ను చూసి భయ పడతారు కదా, వీడు ఎందుకు నవ్వుతున్నాడు?" అనుకున్నాడు. "ఎందుకురా, అట్లా నవ్వుతున్నావు?" అని అడిగాడు మంగయ్యను.

"నువ్వు నన్ను తినేకంటే ముందు నేను నీ ఆత్మనే అంతం చేస్తా. నాదగ్గర వంద మంది రాక్షసుల ఆత్మలున్నాయి తెలుసా? నేను తలచుకున్నానంటే ఆ ఆత్మలన్నిటినీ అంతం చేసేస్తాను. అన్నట్టు, నీ ఆత్మ కూడా నా దగ్గరే ఉంది!" అన్నాడు మంగయ్య, తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో, నవ్వు నటిస్తూ.

రాక్షసుడికి కొంచెం భయం వేసింది- "నా ఆత్మ నీ దగ్గర ఉందా? ఏదీ, చూపించు!" అన్నాడు వాడు.

మంగయ్య తన సంచీలోంచి అద్దం తీసి చూపించాడు. ఆ అద్దంలో ఏముందని చూశాడు రాక్షసుడు. వాడికి అందులో తన ముఖమే కనబడ్డది! తను నోరు తెరిస్తే అదీ తెరుస్తున్నది. తను ఇకిలిస్తే అదీ ఇకిలిస్తున్నది! దాంతో వాడికి 'అది తన ఆత్మే' అని నమ్మకం ఏర్పడిపోయింది.

"అవును! నా ఆత్మ నీ దగ్గరే ఉంది! నన్ను క్షమించు, నా ఆత్మను నాకు తిరిగి ఇవ్వు ప్లీజ్" అని బ్రతిమిలాడాడు వాడు. "అదిగో! అక్కడ, ఆ చెట్టు మొదట్లో‌ పెద్ద నిధి ఒకటి దాగి వుంది. నువ్వు దాన్ని మొత్తం‌ తీసేసుకో. నా ఆత్మను మాత్రం‌ నాకు వెంటనే తిరిగి ఇవ్వు" అని ప్రాధేయపడ్డాడు. కొంచెం సేపు బెట్టు చేశాక, మంగయ్య "సరే" అన్నాడు. ఏదో మంత్రం చదివినట్టు చదివి, ఈసారి అద్దం తిరగేసి చూపించాడు. రాక్షసుడికి తన ప్రతిబింబం కనబడలేదు. వాడు హాయిగా ఊపిరి పీల్చుకొని మాయమైపోయాడు.

మంగయ్య, లక్ష్మమ్మ నిధిని త్రవ్వి తీసుకొని హాయిగా జీవించారు.