ఉపాయం-అపాయం

ఒక వేప చెట్టు మీద ఒక కొంగల జంట నివసిస్తూ ఉండేది. కొన్నాళ్ళకు ఆడకొంగ గర్భం దాల్చింది. కొంగలు రెండూ కష్టపడి పుల్లలు, గడ్డి ఏరుకొచ్చి, చెట్టు మీదే ఒక చక్కని గూడు కట్టుకున్నాయి. ఆడకొంగ ఆ గూటిలో గుడ్లు పెట్టి పొదిగే సరికి, చిన్న చిన్న కొంగలు బయటికి వచ్చాయి.

ఒక రోజున ఆడ కొంగ భర్తతో "వినండి- ఈ రోజున ఒక ఆడపక్షి చెప్పగా విన్నాను: కొన్నాళ్ళ క్రితం ఇదే చెట్టు మీద అనేక పక్షులు నివసిస్తూ ఉండేవట. అయితే ఈ చెట్టు క్రింది పుట్టలో ఉన్న నాగుపాము అదే పనిగా వాటి పిల్లలన్నిటినీ తినేస్తుండేదట. దాని బాధ భరించలేక, చివరికి ఆ పక్షులన్నీ వలస వెళ్ళిపోయాయట! ఇది విన్నప్పటినుండీ‌ నేను భయంతో గడగడలాడి పోతున్నాను; ఊపిరి సరిగా ఆడటం లేదు నాకు. తెలీక ఈ చెట్టును పట్టుకొని ఉన్నాం- రెక్కలు రాని రక్తపు ముద్దల్లాంటి నా ఈ బుజ్జి కూనలకు అపాయం రానున్నది- ఇక నేను ఎలా తట్టుకోగలను?" అని బొటబొటా కన్నీరు కారుస్తూ దాని గొంతును కౌగలించుకున్నది.

అప్పుడా మగకొంగ కొంచెంసేపు ఆలోచించి, భార్యను ఊరడిస్తూ "ఎందుకు, ఊరికే విచారిస్తావు? విచారించి ఏమి సాధిస్తాం, మనం? శత్రువును చంపేందుకు ఉపాయం ఒకటి తట్టింది నాకు. విను- అక్కడ దూరంగా ముంగిస నివసించే పొద ఒకటి ఉన్నది. అక్కడినుండి- మనం‌నివసించే ఈ చెట్టు వరకూ- అక్కడక్కడా ఒక్కొక్క చేపను వేసి ఉంచుతాను నేను. ఆ ముంగిస ద్వారా మన కోరిక తప్పక నెరవేరుతుంది. నువ్వు బాధ పడకు" అని, ఇక ఆలోచించకుండా వెంటనే పోయి తన పథకాన్ని అమలు చేసేసింది.

చేపల వాసన పట్టిన ముంగిస పొదనుండి బయటికి వచ్చింది. చేపల్ని తింటూ పుట్ట దగ్గరికి వచ్చి, అక్కడ దాగి ఉన్న పామును చంపేసింది. అటుపైన అది చెట్టు పైకి ఎక్కి, అక్కడ గూడులో ఉన్న కొంగ పిల్లల్ని కూడా‌తినేసి, తన దారిన తను పోయింది.

అందువల్ల, ఒకటి చెయ్యబోతే మరొకటి అవ్వచ్చు. అప్పుడు వ్యవహారమంతా‌ బురదలో‌ పాతిన చెక్క స్తంభం‌ మాదిరి, ఎటు ప్రక్కకు ఒరుగుతుందో‌ కూడా తెలీకుండా అవుతుంది. నువ్వు చెబుతున్న ఈ పనేదో‌ మంచిది కాదని అనిపిస్తున్నది నాకు" అన్నాడు నందిగుప్తుడి తండ్రి.

అప్పుడు నందిగుప్తుడు "మనిషన్నవాడు మొదట తనకు తోచిన ఉపాయాన్ని బట్టి పోతూ‌ ఉండాలి గాని, అపాయానికి ఉపాయం, ఉపాయానికి అపాయం- ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఇక పని జరిగేదెన్నడు? సందేహించకు. కాదనకు. నా మాట విను. మనకంతా మేలే జరుగుతుంది" అని బలవంతపెట్టి ఎలాగో‌ ఒకలా తండ్రిని ఒప్పించాడు. అర్థరాత్రి పూట చిమ్మ చీకటిలో ఆ తండ్రిని తీసుకెళ్ళి మర్రి- చెట్టుకున్న తొర్రలో కూర్చోబెట్టాడు గుట్టుగా. ఆ పైన ఇంటికొచ్చి, మిగిలిన రాత్రి సమయాన్ని ఒక్కడే వెళ్ళబుచ్చి, తెల్లవారగానే న్యాయస్థానానికి పోయాడు. ఆలోగా సుదర్శనగుప్తుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. అందరూ కలిసి మర్రి చెట్టు దగ్గరికి బయలు దేరారు. ఈ వింతను చూసేందుకని ఎక్కడెక్కడినుండో చేరుకున్న జనాలందరూ ఎవరికి తోచినట్లు వాళ్లు ముచ్చటించుకుంటుంటే, ఆ శబ్దంతో ఆకాశం అంతా నిండిపోయింది.
అప్పుడు న్యాయాధికారులు ఆ చెట్టు ముందు నిలబడి, పెద్ద గొంతుతో‌ "ఓ వృక్షరాజమా! ఈ వాది-ప్రతివాది ఇద్దరూ ఇక్కడ డబ్బును దాచిపెట్టారు కదా, ఆ తర్వాత ఏమి చేశారు? దానికి నువ్వే సాక్షివి; కనుక నీకు తెలిసినది మొత్తం, నిజమే పలుకు!" అన్నారు.

మరుక్షణం చెట్టునుండి ధ్వని వెలువడింది: "ఇక్కడ పాతిపెట్టిన డబ్బునంతా ఒక రోజు అర్థరాత్రిపూట ఒంటరిగా వచ్చిన సుదర్శనగుప్తుడు తీసుకెళ్ళాడు" అని. ఆ చిత్రానికి అక్కడి జనాలంతా నిశ్చేష్టులై బొమ్మల్లాగా నిలబడిపోయారు. న్యాయాధి-కారులు కూడా‌ నివ్వెరపోయారు. ముందుగా తేరుకున్న సుదర్శనగుప్తుడు మనసులో కొంచెం ఆలోచించుకొని, "ధర్మాధి-కారులారా! ఇదంతా నిజమని భావించకండి. లేకుంటే చెట్టేమిటి, సాక్ష్యం చెప్పటమేమిటి? 'చెట్టును తంతే పన్ను ఊడింది' అన్నట్లున్నది ఇది. మీరు నాకు అనుమతి ఇచ్చారంటే ఈ చెట్టు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నదీ నేను ఇప్పుడే తేటతెల్లం‌ కావిస్తాను" అన్నాడు.

వాళ్ళు అందుకు అంగీకరించగానే అతను ఆ చెట్టునెక్కి, దాని కొమ్మల మధ్య దూరాన్ని, వాటి దిశలను అన్నింటినీ జాగ్రత్తగా గమనించాడు. వాటిలో‌ఒక కొమ్మ గుబురులో పెద్ద చీకటి గుహ లాంటి తొర్ర కనిపించింది అతనికి. అయితే అందులో దూరేందుకు భయపడి, అతను ఒక మోపెడు ఎండుగడ్డిని తెప్పించి, ఆ తొర్రలోకి జొనిపి, మంట పెట్టాడు.

ఎండుగడ్డి అంటుకొని మంటలు వ్యాపించే సరికి, తొర్రలో కూర్చొని ఉన్న ముసలాయనకు ఊపిరి ఆడలేదు. వేడికి శరీరం అంతా కాలిపోయింది. ఆ బాధను తట్టుకోలేక అతను హాహా కారాలు చేస్తూ బయటికి వచ్చి పడ్డాడు.

న్యాయాధికారులు అతన్ని "ఎవరు నువ్వు? ఇందులో ఎందుకు దాక్కున్నావు?" అని గద్దించి అడిగే సరికి అతను నిజం చెప్పేశాడు- "నేను నందిగుప్తుడి తండ్రిని. వాడు నేను ఎంత చెప్పినా వినలేదు. నా మాటల్ని పెడచెవిన పెట్టి, నాకు ఇలాంటి ఆపద తెచ్చి పెట్టాడు. నా శరీరం అంతా కాలిపోయింది, ప్రాణాలు నిలిచేటట్లు లేవు" అని విలవిల లాడుతూ చనిపోయాడు.

న్యాయాధి-కారులు నందిగుప్తుడిని కఠినంగా శిక్షించి, అతను దొంగిలించిన ధనాన్నంతా సుదర్శన గుప్తుడికి ఇప్పించారు. అలా దురాశకు లోనై మిత్ర ద్రోహానికి ఒడిగట్టిన నంది గుప్తుడు ఆ డబ్బుతో‌బాటు తండ్రినీ కోల్పోవలసి వచ్చింది.

కరటకుడు దమనకుడితో‌ ఈ కథ చెప్పి "తొందరపాటులో దూరం ఆలోచించక, నువ్వు చెప్పిన మాటలు విన్నాను. 'ఇది చెడ్డపని' అని ముందు తోచనే లేదు, నాకు. సంజీవకుడు ఏనాడూ‌ మనకు ఒక్క కీడు కూడా తలపెట్టలేదే! ఏ పాపమూ ఎరుగనివాడు- పాపం అతని ప్రాణాలకే ఎసరు పెట్టావు నువ్వు. పాపిష్టివాడిని, నేనూ నీ కుతంత్రంలో‌ భాగం పంచుకున్నాను. ఇది మనకు మంచిది కాదు. ఇతరులను మోసగించాలనుకున్నవాడు తానే మోస-పోతాడు. దీనికి నిదర్శనంగా నీకొక కథ చెబుతాను విను-

'అజస్తుదం' అనే పట్టణంలో ఇంద్రపాలితుడు అనే వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతనికి ధనగుప్తుడు అనే స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు అరవై బారువుల ఇనుమును కూలివాళ్ల చేత మోయించుకొని మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు.

వెళ్ళి, "అన్నా! ఉన్నట్లుండి వేరే దేశం‌ పోవలసి వస్తున్నది. మానే వీలు లేదు. రేపే నా ప్రయాణం. ఈ ఇనుమును నీ దగ్గర ఉంచుకో. పోయిన సంవత్సరం ఈ సరుకును నువ్వూ, నేనూ కలిసే కొన్నాం- ధర నీకు తెలుసుగా? రూపాయికి అర్థ అణా లాభం వచ్చినా చాలు- మొదటినుండి ఇప్పటివరకూ అయిన వడ్డీని కలుపుకొని,నేను చెబుతున్నంత లాభం వస్తే చాలు- అమ్మెయ్యి. ఇతరుల నుండి నువ్వు వాడుకగా ఎంత తరుగు తీసుకుంటావో అంత తరుగు తీసుకో. నేను చెప్పినంత ధర రాకపోతే సరుకును కదల్చకు. ఇనుము చెడిపోయే వస్తువు ఎలాగూ కాదు- ఇవాళ్ల కాకపోతే రేపు- మంచిధరకే అమ్ముకోవచ్చు. రేపే నా ప్రయాణం, కనుక చాలా పని ఉన్నది. క్షణం తీరిక లేదు. సరుకు ఇదిగో, అప్పగించుకో వెంటనే!" అన్నాడు.

ధనగుప్తుడు అది విని "అయ్యో, మిత్రమా! నేనేమైనా పరాయివాడినా? నాకు ఇంత చెప్పాలా? నువ్వు నాకిచ్చే తరుగు కోసం ఆశపడేవాడినా, నేను? గురువు సాక్షిగా చెబుతున్నాను విను- నీ సొమ్మును నా సొమ్ముగా చూస్తాను తప్ప, వేరుగా చూడను. నన్ను నమ్ము" అని చెప్పి ఇనుమును ఇప్పించుకున్నాడు.

మరునాడు ఉదయాన్నే ఇంద్రపాలితుడు విదేశాలకు బయలుదేరాడు. అక్కడ తన పనులన్నీ పూర్తి చేసుకొని, కొంతకాలానికి తిరిగి వచ్చి, తీరికగా మిత్రుని ఇంటికి పోయాడు. అతన్ని చూడగానే ధనగుప్తుడు లేచి ఎదురు వచ్చి ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేశాడు; ప్రయాణం‌ గురించి, తను చూసిన వింతలు విశేషాల గురించి అడిగాడు. ఇంద్ర పాలితుడు వాటన్నిటికీ‌ సమాధానాలు ఇస్తూ కొంతసేపు గడిపి, మిత్రుడి వ్యాపారం ఎలా జరుగుతున్నదో అడిగి, అటుపైన అసలు విషయానికి వచ్చాడు- "ఈమధ్య ఇనుము రేటు బాగా పెరిగిందని విన్నాను. మన ఇనుము ఎట్లా ఉన్నది?" అని అడిగాడు. ఇనుము సంగతి వినగానే ధనగుప్తుడి ముఖం‌ చిన్నబోయింది.

"అప్పుడు మనం కలిసి కొన్న ఇనుము నా దగ్గరకూడా మరికొంత నిలవ ఉంటే, దాన్ని కూడా నీ ఇనుముతో కలిపి గదిలో పెట్టి, తలుపు మూసి, తాళం వేసి జాగ్రత్త చేశాను.

నిన్ననే కొందరు వర్తకులు వచ్చి, 'ఇనుము కావాలి' అని అడిగారు. 'సరే, చూద్దాం' అని గది తలుపు తీసి చూద్దును గదా, లోపల ఇనుమన్నదే లేదు!

'నా సొమ్ము పోయిందే' అని నాకు రవ్వంత కూడా‌ బాధ కలుగలేదు- మిత్రుడు నన్ను నమ్మి నా దగ్గర దాచుకున్న సొమ్మును, అతను రాగానే "ఇదిగో నాయనా నీ సొమ్ము" అని ఇచ్చెయ్యకుండా, 'పోయింది' అని చెప్పవలసి వస్తున్నదే, అని నా మనసు క్రుంగిపోయింది. నా మీది విశ్వాసంతో నువ్వు నష్టాన్ని ఖాతరు చెయ్యకపోవచ్చు; కానీ‌ లోకులు ఊరుకోరు కదా, మర్యాద దక్కదు గదా!" అని విచారపు బరువుతో‌ క్రుంగిపోతున్నవాడిలాగా కొంచెం సేపు ఊరుకున్నాడు.

అటుపైన నిట్టూరుస్తూ "గది తలుపులు మూసి, పెట్టిన తాళం పెట్టినట్లు ఉండగానే లోపలి సరుకంతా ఎలా మాయం అవుతుంది' అని జాగ్రత్తగా ఆలోచించి చూశాను. మా ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువ. ఏ సరుకును గానీ అవి బ్రతకనివ్వవు. అవే మన ఇనుమును కూడా‌ తినేసి ఉంటాయని అనుకున్నాను, చివరికి!" అన్నాడు.

అది విని ఇంద్రపాలితుడు వాడి మోసాన్ని తెలుసుకొని, "ఓహో! వీడు నా సొమ్మును కాజేసేందుకే ఇక్కడ ఇన్ని పన్నాగాలు పన్నాడు. వేరే ఏదైనా మోసం చేసి వీడినుండి సొమ్మును రాబట్టుకోవాలి గాని, మంచితనంతో‌ కాదు " అనుకున్నాడు.

తన ఆలోచనల్ని మొహం‌ మీదికి రానివ్వకుండా "అన్నా! దీనికి ఇంత చెప్పాలా? నేను ఏమైనా క్రొత్తవాడినా? నీ స్వభావం ఎలాంటిదో‌ నాకు తెలీనిదా? దైవం‌వల్ల వచ్చిన కష్టానికి మనం ఏం‌చేస్తాం? దీనికోసం నువ్వేమీ చింతించకు, పోయి వస్తాను" అని సెలవు పుచ్చుకొని తన ఇంటికి పోయాడు. ఆ తర్వాతకూడా లేని స్నేహభావనను తెచ్చిపెట్టుకొని, ఎప్పటిలాగానే మిత్రుడి ఇంటికి రాకపోకలు కొససాగించాడు.

(వచ్చేసారి మిత్రభేదం ముగింపు ..)