అనగనగా ఒక అడవిలో ఒక నక్క. ఆ నక్కకు వున్నట్టుండి 'తాను కూడా పక్షిలాగా ఎగిరితే ఎంత బాగుండును' అని కోరిక పుట్టింది. ఆ కోరిక అంతకంతకూ బలపడిపోయింది. 'ఎలాగైనా సరే ఎగిరెయ్యాలి' అనుకున్నది.

సరిగ్గా అప్పుడే చెట్టు మీద ఒక పిట్ట కనిపించింది. నక్క దాని దగ్గరికి వెళ్లి "పిట్ట పాపా, పిట్ట పాపా! ఎగరటంలో వున్న రహస్యం ఏమిటో చెప్పవా, ప్లీజ్?" అంటూ బ్రతిమిలాడింది .

"ఓస్! దానిదేముంది? నిజానికి ఎగరటం అనేది చాలా సులభం. నువ్వేం చేయాలంటే, ముందు ఒక ఎత్తైన చెట్టును చూసుకోవాలి. దాని పైకి ఎక్కి, ఒక్కసారిగా క్రిందికి దూకెయ్యాలి. ఒకవేళ నువ్వు క్రిందకి పడిపోతున్నావనుకో, అప్పుడు "పైకి..పైకి!"అని అరవాలి. మరీ పైకి కూడా ఎగరకూడదు. సూర్యుడి వేడి తగిలితే కష్టం. నువ్వు ఎగరటం మొదలు పెడితే మిగిలిన సంగతులన్నీ నీకే అర్థమవుతాయి" నిజాయితీగా చెప్పింది ఆ పిట్ట.

"నిజంగా అంతేనా?" అనుమానంగా అడిగింది నక్క"

"ఏమో, మా అమ్మైతే నాకు అంతే చెప్పింది. నేను అట్లాగే మొదలుపెట్టాను- ఎగరటం" చెప్పేసి తుర్రున ఎగిరిపోయింది పిట్ట.

నక్క వెతికి వెతికి ఒక పెద్ద చెట్టును ఎంచుకున్నది. ఆ చెట్టు చిటారు కొమ్మదాకా ఎక్కి, "ఇప్పుడు నేను ఎట్లా ఎగురుతానో చూడండి" అంటూ క్రిందకు వంగి అక్కడ గుమిగూడిన తన బంధుమిత్రులందరికీ అరిచి చెప్పింది.

వాళ్ళంతా "వద్దు..వద్దు!" అని అరిచారు- కానీ నక్క వాళ్ల మాటలు పట్టించుకోలేదు; ఒక్క దూకు దూకింది గాలిలోకి. 'పైకి..పైకి.. అనుకోవాలి" అని అనుకుంటూనే ఉన్నది పాపం. అయితే ఇంకా ఆ మాట మనసులో ఉండగానే నేల వచ్చి తగిలింది బలంగా. ఆ దెబ్బకి దాని కాలు కాస్తా విరిగిపోయింది!

నక్కకి బుద్ధి వచ్చింది. మళ్లీ ఇంకెప్పుడూ పక్షిలాగా ఎగిరే ప్రయత్నం చెయ్యలేదు.

అప్పటినుండీ నక్కలకు పిట్టలంటే చాలా కోపం.