కొత్తపల్లిలో నివసించే రామయ్యకు ఒక్కగానొక్క కూతురు సౌందర్య. పేరుకు తగ్గట్లే సౌందర్య చాలా అందంగా ఉండేది. పదవ తరగతిలో ఉన్న సౌందర్య, వాళ్ల బడిలో ఏ పోటీ జరిగినా అన్నింటిలోనూ మొదటి స్థానంలో ఉండేది.

రామయ్య ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. పేరుకు రైతేగాని, ఆయనకున్న మూడెకరాల చేనునుండి వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోయేది కాదు. "మీ అమ్మాయి కూడా పెద్దదవుతున్నది. ఇక పెళ్ళి చేసెయ్యి. లేకపోతే రేప్పొద్దున కట్నం ఎక్కడినుండి తెస్తావు? పెళ్లి కాని బిడ్డ-గుండెల మీద కుంపటి" అనటం మొదలుపెట్టారు అతని పరిచయస్తులు.

వాళ్ల ఒత్తిడికి లొంగిన రామయ్య, ఇంకా పదహారేళ్లయినా రాని సౌందర్యకోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. ఒకరేమిటి, చేసుకుంటామని పదిమంది ముందుకొచ్చారు. వచ్చిన వాటిలో తనకు నచ్చిన సంబంధాన్ని ఒకదాన్ని నిశ్చయించేశాడు రామయ్య.

అయితే సౌందర్య మాత్రం పెళ్ళి చేసుకోనని మొండి కేసింది. అంత చిన్న వయస్సులో పెళ్ళి చేసుకోకూడదని తెలుసు, ఆమెకు. అదీగాక, ప్రభుత్వం బాల్యవివాహాలను నిషేధించింది కూడానూ- "పద్ధెనిమిదేళ్ళు నిండని అమ్మాయికి పెళ్ళి చేయటం చట్టరీత్యానేరం" అని సౌందర్య చదువుకొని ఉన్నది.

కానీ ఎన్ని విధాలుగా చెప్పినా రామయ్య ఒప్పుకోలేదు. 'పెళ్లి ఆపటం వీలవదు' అని తేల్చి చెప్పేశాడు. సౌందర్య ఏడిచింది, అలిగింది, 'నాకు ఇంకా చాలా చదువుకోవాలని ఉంది' అన్నది- ఎంత చెప్పినా రామయ్య మాత్రం పట్టించుకోలేదు.

ఇక 'వచ్చే వారమే పెళ్లి' అనగా సౌందర్య ఇంట్లోంచి పారిపోయి, హైదరాబాదు వెళ్ళే రైలు ఎక్కేసింది!

అయితే ఆమె అదృష్టం కొద్దీ‌ అదే రైలులో ఎక్కారు, వాళ్ళ సోషల్ అయ్యవారు. బాగా చదువుకొనే సౌందర్య అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. "ఏమ్మా, సౌందర్యా, ఒక్కదానివే ఎటు, బయలుదేరావు?" అని అడిగారాయన. సౌందర్యకు ఏడుపు ఆగలేదు. జరిగిందంతా చెప్పి, "సార్! నేను బాగా చదువుకుంటాను సార్! నన్ను ఏదైనా హాస్టలులో చేర్పించండి సార్!" అని భోరుమని ఏడ్చింది.

వాళ్ల సోషల్ అయ్యవారు మంచివాడూ, లోకం తెలిసినవాడు కూడానూ. ఆయన ముందుగా సౌందర్యను చీవాట్లు పెట్టారు-"ఏమనుకుంటున్నావు నువ్వు? ఇట్లా ఒక్కదానివీ రైలెక్కేస్తే ఎంత ప్రమాదమో తెలుసా, నీకు అసలు? పట్టణాలలో ఎంతమంది మోసగాళ్ళుంటారో నీకేమి ఎరుక? ఇంట్లో ఏమైనా కష్టాలొస్తే, పెద్దవాళ్లతో చర్చించి, సామరస్యంగా వాటికి పరిష్కారం వెతకాలి తప్ప, ఇట్లా ఇల్లు వదిలి పారిపోతారా? పద పద, వెనక్కి. నేను కూడా వచ్చి నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను. నేను చెబుతానులే, మీ నాన్నకు" అని. ఆయన కూడా సౌందర్యతోబాటు తరవాతి స్టేషన్‌లో రైలు దిగి, ఆమెను వెంటబెట్టుకొని రామయ్య దగ్గరికి వచ్చారు.

ఆసరికి సౌందర్య కనబడటంలేదని రామయ్య కుటుంబం అంతా గందరగోళపడుతున్నది. సౌందర్యను చూడగానే వాళ్ల ప్రాణం లేచివచ్చినట్లైంది. సోషల్ అయ్యవారు రామయ్యను, అతని భార్యను పిలిచి,"అమ్మాయి ఇష్టానికి విలువనివ్వండి. చదవనివ్వండి. ముందు చదువు-ఆ తర్వాతే పెళ్ళి! ఒక వేళ చదివించటం మీకు కష్టమనిపిస్తే, మన ఊరికి దగ్గర్లోనే ప్రభుత్వ హాస్టల్ ఉంది- అందులో చేర్చండి. ఈ సంబంధం వాళ్లని ఆగమనండి కొన్నేళ్ళు. ఏమీ పరవాలేదు. అలా చెయ్యకపోతే, మీ అమ్మాయి భవిష్యత్తు నాశనం కాదా?" అని చెప్పి ఒప్పించారు.

అటు తర్వాత రామయ్య తన కూతురును పెళ్ళి విషయమై ఒత్తిడి చేయలేదు. ప్రభుత్వ సహకారంకూడా తోడై, సౌందర్య చక్కగా చదువుకున్నది. ప్రతి తరగతిలోనూ ఆమెకు బహుమతులూ, స్కాలర్‌షిప్పులూ వచ్చేవి. పెద్ద చదువులు చదివి, పోటీ పరీక్షల్లో నెగ్గి, సౌందర్య ప్రభుత్వ ఆఫీసర్ అయ్యింది.

"ఎంత చక్కని ఆఫీసర్!" అని అందరూ ఆమెను పొగుడుతుంటే, రామయ్య దంపతుల కళ్ళు గర్వంగా మెరిసేవి- "అయ్యో, ఈ పాపకు చిన్నప్పుడే పెళ్ళి చేసేసి ఉంటే ఏమయేది? ఆ సోషల్ సారు దేవుడిలాగా అడ్డుపడ్డాడు కాబట్టి సరిపోయింది." అనుకునే వాళ్ళు ప్రతిరోజూ.