అలా సింహం విలాసంగా తల ఎగురవేయగానే, నక్క దానికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ వెనక్కి తిరిగి పోయి, సంజీవకుడిని కలిసింది: "నీ అదృష్టం బాగున్నది- మృగరాజు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. కనిపించటానికి ఇదే తగిన సమయం. ఆలస్యం చెయ్యకు- వెంటనే రా" అని దాన్ని పిలుచుకొని వచ్చి, రాజుకు ఎదురుగా నిలబెట్టింది. ఆపైన అది వంగి చేతులు కట్టుకొని, కొంత దూరంలో నిలబడింది. ఆ సమయంలో సంజీవకుడికి ఒకేసారి భయమూ, వినయమూ, ఆశ్చర్యమూ మేళవించినట్లైంది. ఎంతో‌ గౌరవంగా అది పింగళకుడికి అభివాదం చేసింది.

అప్పుడు మృగరాజు తన కనుసన్నల నుండి దానివైపు ప్రసన్న దృష్టిని ప్రసరింపజేస్తూ, " నిన్ను మా దమనకుడు అనేక విధాలుగా మెచ్చుకోగా, విని సంతోషించాము. నీలాంటి ధైర్యవంతుడు మా కొలువులో చేరేందుకు అంగీకరించటం మాకు సంతోషాన్నిచ్చింది. 'నువ్వు చేరటం వల్ల మాకు కూడా చాలా లాభం కలుగుతుంది' అని ఆశిస్తున్నాము. నీకు మంత్రి పదవిని ఇస్తున్నాము. మెలకువ కలిగి, మా ఆజ్ఞలకు అనుగుణంగా వర్తిస్తూ, మాకు బదులుగా పాలనా వ్యవహారాలను నిర్వహిస్తూ, మా పరివారాన్ని కాపాడుతూ, పనులన్నీ సజావుగా జరిగేటట్లు చూడు" అని ఆజ్ఞాపించింది.

ఇక ఆనాటినుండీ సింహం, ఎద్దు చాలా మంచి స్నేహితులైపోయాయి. ఏ పని చేయాలన్నా సింహం ఎద్దు పైనే ఆధారపడసాగింది. సింహం వెంట తిరిగే చిల్లర జంతువులకు పనిలేకుండా పోయింది- అవన్నీ‌సింహం వెంట తిరగటం మానుకున్నాయి. సింహరాజు పరివారం కూడా తగ్గిపోయింది!

దాంతో దమనకానికి చాలా విచారం వేసింది. అది ఇంటికైతే పోయింది గానీ, దాని మనసు మనసులో లేదు. అది అట్లా బాధపడుతుండటాన్ని గమనించి కరటకుడు "తమ్ముడా! నీ ముఖం చిన్నబోయింది. విచారంగా ఉన్నావు- ఎందుకు?" అని అడిగింది. దమనకం దానికి జరిగినదంతా చెప్పింది.

కరటకం అప్పుడు కొంతసేపు మౌనంగా ఉండి, "జరిగిపోయిన దానికి ఊరికే విచారించి ఏమి లాభం? ఎన్నడో నేర్చిన నీతులన్నిటినీ నువ్వు అంతగా వల్లించావుగానీ, నేను చెప్పేది ఒక్కటైనా చెవిన వేసుకున్నావా? వెనకటికి ఎవరో తనను కట్టేందుకు త్రాళ్ళు తానే కొని తెచ్చుకున్నాడట! -అట్లాగే నువ్వూనూ! జరగబోయే నష్టాన్ని గుర్తించకుండా, నీ నోటి దురదకొద్దీ ఆ ఎద్దు గురించి ఉన్నవీ లేనివీ కలిపి చెప్పి, దానికి రాజుతో స్నేహం కల్పించావు. ఇప్పుడు అనుభవించక తీరేనా? ఇది నువ్వు చేసిన తప్పే గదా?" అన్నది.

అప్పుడు దమనకుడు గట్టిగా నిట్టూర్చి, తలను అటూ ఇటూ ఊపి, చివరికి తలెత్తి "కరటకా, నువ్వన్నది నిజం. ముందు చూపు లేక, అట్లా చేశాను. ఇక ఇప్పుడు ఏమి చేయగలను? దైవం ప్రతికూలించినప్పుడు మానవ ప్రయత్నం ఏదైనా‌వృధాయే అవుతుంది. కాబట్టి నన్ను ఊరికే తిట్టకు. ఇట్లా నేనే కాదు- 'ఆషాఢభూతి' అనేవాడి చేతిలో చిక్కి, వాడి గురువు తన ధనం యావత్తూ పోగొట్టుకున్నాడు. పొట్టేళ్ళ పోరులో చిక్కుకొని ఒక నక్క తన ప్రాణాలనే కోల్పోయింది"- నీకు ఆ రెండు కథలూ చెబుతాను విను- అని ఇలా చెప్పసాగింది:

ఆషాఢభూతి కథ:

చాలా కాలం క్రితం దేవశర్మ అనే దొంగ సన్యాసి ఒకడు ఉండేవాడు. అతని మనస్సు నిండా డబ్బు పట్ల వ్యామోహమే ఉండేది- కానీ పైకి మాత్రం అతను కోరికలు లేనివాడి మాదిరి, ఎప్పుడూ వేదాంతం గురించి, దాని అర్థం గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు. అతని ఉపన్యాసాలు వినే జనాల మనస్సులు విప్పారేవి. వాళ్ళు అతని మాటల్ని వినేందుకు ఎగబడేవాళ్ళు. అలా తనను కొలిచే భక్త సమూహం తనకు తెచ్చి ఇచ్చే డబ్బును చూసి అతను చిరునవ్వు నవ్వేవాడు. ఆ చిరునవ్వులో‌ భక్తులకు ఆ డబ్బుల పట్ల ఆయనకున్న తృణీకార భావం వ్యక్తమయ్యేది. మరోవైపున ఆయన 'వారిని అనుగ్రహించటం‌కోసమేనా' అన్నట్లు ఆ ధనాన్ని స్వీకరిస్తున్నట్లుగానూ- అనిపించేది. చిరునవ్వుతో కూడిన ఆయన సుందర వదనం, అలా ఒకేసమయంలో‌రెండు భావాలనూ వ్యక్తం చేసేది.

అట్లా తాను భక్తులను మోసగించి సంపాదించిన డబ్బునంతా ఆ దొంగ సన్యాసి ఒక బొంతలో వేసి, పదిలంగా కుట్టుకొని, ఆ బొంతను దూరం పోనివ్వక, దానినే ఎల్లప్పుడూ కప్పుకొని తిరిగేవాడు. అలాంటి ఆ సన్యాసి ధనాన్నంతా దొంగిలించాలి అనుకున్నాడు ఒక మోసగాడు! అయితే ఎన్ని రోజులు వేచి చూసినా వాడికి బొంతను కొట్టేసే ఉపాయం దొరకలేదు.

చివరికి ఒకనాడు- సన్యాసి తన భక్తుల ముందు కూర్చొని మోక్షం గురించీ, ధర్మం గురించీ శ్రవణానందకరంగా ఉపన్యసిస్తూండగా ఆతని సమ్ముఖానికి పోయాడు మోసగాడు. తన శరీరభాగాలన్నీ‌ భూమికి తాకేటట్లు, ఆ సన్యాసికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆపైన లేచి, అతని కంట పడేటట్లు, ఒక ప్రక్కకు ఒదిగి నిల్చున్నాడు. ఆ సన్యాసి చెప్పే ధర్మ పన్నాలను మనసు పెట్టి వింటున్నవాడి మాదిరి ముఖం‌పెట్టాడు. పెద్దగా విప్పారించిన కళ్ళు, ఆశ్చర్యాతిరేకంతో టప టపా కొట్టుకుంటుండగా, సంభ్రమంతో కూడిన వాని మాదిరి ముఖం‌ పెట్టాడు. చాలా కాలంగా తనకేవో ధర్మ సందేహాలున్నట్లూ, స్వాముల వారి అప్పటి ప్రసంగంలో ఆ సందేహాలన్నిటికీ‌ సమాధానం దొరికిపోతున్నట్లూ, తల ఊపుతూ‌నిలబడ్డాడు. మధ్య మధ్యలో ఎవరైనా జనాలు సద్దు చేస్తే, వారివైపు చికాకుగా, తిరస్కార పూర్వకంగా, కనుబొమ్మలు ముడివేసి చూస్తూ- తనకు వినటంలో ఆసక్తి ఉందనీ, తనకు శ్రవణభంగం కలిగించవద్దనీ చేతులెత్తి వారిస్తూ నిలబడ్డాడు. ఆ మహానుభావుడి అమృతవాక్యాలు వినటం వల్ల తనకు కలుగుతున్న ఆనందంతో వివశుడైపోయినట్లు, మూసుకున్న కళ్ళలోకి నీళ్ళు తెచ్చుకొని మరీ వణుకుతూ నిలబడ్డాడు.

సన్యాసి ఉపన్యాసం ముగించిన తరువాత వాడే పెద్దమనిషి మాదిరి అక్కడి ప్రజలతో "స్వాములవారు చాలా అలసిపోయి ఉన్నారు. ఇక్కడున్నవాళ్లంతా కొంచెం సేపు ఎడంగా ఉండండి. భిక్ష తర్వాత మళ్ళీ రండి, పొండి" అని వాళ్లందరినీ పంపించేసి, ఆపైన ఒక తాటాకు విసనకర్రను చేత బుచ్చుకొని, ప్రక్కన నిలబడి మెల్లగా వీచసాగాడు.

అప్పుడా దొంగ సన్యాసి ప్రేమగా అతనిని చూసి "ఓయీ! నువ్వెవరివి? మాకు సేవలు చేస్తున్నావెందుకు? మావల్ల నీకు ఏమి లాభం?" అని అడిగాడు.

అప్పుడా మోసగాడు "స్వామీ! నా పేరు ఆషాఢభూతి. ఇతరులకు అసాధ్యమైన గొప్ప సంపద మీలో దాక్కొని ఉన్నదని గ్రహించి, ఆ ధనాన్ని కోరి వచ్చాను. నన్ను మీ శిష్యుడిగా ఉండనివ్వండి. నాకోరికను నెరవేర్చి నన్ను అనుగ్రహించండి. ఇదికాక మరేది ఇచ్చినా నేను అంగీకరించను. నేను నిజమే తప్ప అబద్ధం చెప్పేదిలేదు" అన్నాడు (రెండు అర్థాలూ ధ్వనించేటట్లుగా).

అది విని సన్యాసి కొంచెంసేపు ఆలోచించి "సరే కానిమ్మ"న్నాడు. ఆపైన ఆషాఢభూతి మహా వినయాన్ని నటిస్తూ, సన్యాసికి ఎల్లవేళలా సపర్యలు చేస్తూ, అతని వెంబడే దేశాటన చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ గడిపాడు.

ఒకనాడు ఆ సన్యాసి ముందుగా దారివెంబడి పోతుండగా, వెనకనుండి పరుగెత్తుకొని వచ్చిన దొంగశిష్యుడు అతనికి ఒక గడ్డి పరకను చూపుతూ "స్వామీ! నిన్న రాత్రి మనం ఒక గృహస్తు ఇంటి చావడిలో‌పడుకున్నాం గదా! వాళ్ళ ఇంటి గడ్డి పరక ఒకటి, నా బట్టలను అంటుకొని వచ్చింది. ఇతరుల సొమ్ము-ఒక్క గడ్డిపోచ అయినా సరే, తీసుకోకూడదు. నేను వెంటనే వెనక్కి పరుగెత్తుకొని పోయి దీన్ని ఆ ఇంటి వాళ్ళకు ఇచ్చి వస్తాను" అని, కొంత దూరం వెనక్కి పోయి, ఆ గడ్డి పరకను అక్కడ పడేసి, కొంతసేపు అటూ ఇటూ తిరిగి, మళ్ళీ వెనక్కి వచ్చి సన్యాసిని చేరుకున్నాడు.

అది చూసి సన్యాసి ఆశ్చర్యపోయాడు: "ఆహా!‌ ఈ ఆషాఢభూతి నిజంగా కోరికలు లేనివాడు; మచ్చలేని చరిత్రగలవాడు; చాలా విశ్వాసపాత్రుడు" అనుకున్నాడు. తను చాలాకాలంగా శ్రమకోర్చి సంపాదించిన డబ్బునంతా దాచుకున్న ఆ బొంతను మోసేందుకు ఇప్పుడు అతనికి బద్ధకం వేసింది. తన వెంట వస్తున్న ఆ నయవంచకుడిని ప్రేమగా చూస్తూ, ఆ దొంగ సన్యాసి "ఓ ఆషాఢభూతీ! ముసలితనంతో బలహీనుడినవ్వటంచేత ఈ మాత్రపు కప్పుడు బొంతను కూడా మోయలేక పోతున్నాను. దీనిని జాగ్రత్తగా వెంట తీసుకొని రా నాయనా!" అని బొంతను వాడి చేతికి ఇచ్చాడు. దాన్ని అందుకుంటున్నప్పుడు ఆ మోసగాడి మనస్సు సంతోషంతో పులకరించి-పోయింది. వాడు చాలా ఒద్దికతో "మహా ప్రసాదం" అంటూ‌ దాన్ని అందుకొని, చాలా జాగ్రత్తగా మోసుకొని రాసాగాడు. కావలసిన చోట దాన్ని సన్యాసికి పరుపుగాను, పైన కప్పుకునేందుకు రగ్గుగాను వినియోగిస్తూ, ఇదివరకటికంటే ఎక్కువగా నమ్మకం పుట్టే విధంగా సేవలు చేస్తూ వచ్చాడు.

ఒకనాడు ఆ సన్యాసి దారిన పోతూ ఉన్నాడు. సాయం సమయమైంది. 'సమయం' అనే పరశురాముడు వెయ్యి చేతులనూ ఖండించగా, బలాన్ని కోల్పోయి, రక్తంతో తడిసినట్లు ఎర్రని రంగుపూనిన కార్తవీర్యార్జునుడి లాగా కనిపిస్తున్నాడు సూర్యుడు. అక్కడికి దగ్గరలోనే ఒక చెరువు కనబడింది సన్యాసికి. అతను వెంటనే ఆ చెరువులోనికి దిగి, స్నానం చేద్దామని కొన్ని నీళ్ళు నోట్లో పోసుకున్నాడు.

అదే సమయానికి , ఎదురుగా, చెరువు ఒడ్డున రెండు పొటేళ్ళు భీకరంగా యుద్ధం చేసుకుంటూ కనబడ్డాయి అతనికి. రెండూ ఆవేశంతో‌ ముందుకు వచ్చి ఢీ కొంటుంటే, చుట్టూ ఉన్న పర్వతాలనుండి వాటి ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలకు అవి మరింత రెచ్చిపోయి, ముందుకు దూకి -'ఫెడిల్' అని ఢీకొంటున్నాయి. అలా అవి దారుణమైన యుద్ధంలో మునిగిఉండి, వాటి తలలు పగిలిన సంగతిని కూడా‌ గమనించలేదు. అలా వాటి తలలనుండి కారిన రక్తం క్రింద నేలమీద పడి గడ్డకట్టింది.

అలా గడ్డకట్టిన రక్తాన్ని చూసి, దాపులనున్న ఒక నక్క 'మాంసపు ముక్క' అనుకున్నది. వెంటనే దాన్ని తినాలని ఆశ పుట్టింది దానికి. ఇక అది అటూ-ఇటూ చూసుకోలేదు; 'ఆ తావు పొటేళ్ళ యుద్ధరంగానికి మధ్యభాగం' అనికూడా గుర్తించక, ముందుకు ఉరికి, ఆ రక్తపు గడ్డను నాకటం మొదలు పెట్టింది. అంతకు ముందే ఒకదానినికటి ఢీకొని, వెనక్కి జరిగిన గొర్రెపొటేళ్ళు రెండూ మళ్లీ పరుగున ముందుకు వచ్చి ఢీకొన్నాయి. వెర్రి నక్క ఆ రెండిటి మధ్యా చిక్కుకొని, నలిగి చచ్చిపోయింది.

స్నానానికి వెళ్ళిన సన్యాసి ఈ జరిగిన దాన్నంతా గమనించి- " అరే! మాంసం ముక్క మీది ఆశ నక్కను ఈ దశకు తెచ్చిందే! అన్ని దుర్గుణాల్లోకీ‌చెడ్డది దురాశే గదా!" అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి, చెరువు గట్టెక్కి చూసేసరికి- తన దొంగ శిష్యుడు కనబడలేదు! "ఓహో! ఆషాఢభూతీ! ఓ, ఆషాఢభూతీ!" అని ఎంత అరిచినా ప్రయోజనం లేకపోయింది. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులకు చెయ్యి అడ్డం పెట్టుకొని, ఎంత దూరం వీలైతే అంత దూరం వరకూ చూస్తూ, వచ్చే పోయే జనాల దగ్గరికి పరుగులెత్తి, ఆ మోసగాడి గుర్తులు చెప్పి"ఇలాంటి వాడు, ఒక బొంత మోసుకొని పోతున్నాడు- వాడు మీకేమైనా ఎదురు పడ్డాడా?" అని అడుగుతూ, అన్ని దిక్కులా వెతికి వెతికి, చివరికి తనను ఆ దుర్మార్గుడు మోసం చేశాడని గుర్తించి, తల వంచుకొని, నిట్టూర్చుతూ "పొటేళ్ళ యుద్ధంలో దూరిన నక్క, ఆషాఢభూతి చేజిక్కిన నేను- ఇద్దరమూ మా సొంత తప్పుల వల్లనే చెడ్డాము. ఇక ఏం చేస్తాం?" అని బాధపడ్డాడు ఆ దొంగ సన్యాసి.

ఈ కథ చెప్పి, కరటకం ఇలా అన్నది: (మిగతాది మళ్లీ వచ్చే మాసం..)