అనగనగా ఒక ఊరు. ఆ ఊరిపేరు పాతచెరువు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలోఅమ్మ, నాన్న, వాళ్ళిద్దరి కొడుకు విష్ణు అనేవాడు- ఉండేవాళ్ళు. వాడిని వాళ్ళ అమ్మానాన్నలు బాగా చదివిస్తూ ఉండేవాళ్ళు- కానీ విష్ణు మాత్రం ఏమీ చదవకుండా, స్కూలులో పిల్లలతో పోట్లాడుతూ, చెడ్డమాటలు మాట్లాడుతూ, అల్లరి చేస్తూ ఉండేవాడు. ఎలాగో ఒకలాగ వాడు 5వ తరగతి వరకూ ఉన్న ఊళ్ళోనే చదువుకున్నాడు.
అప్పుడు వాళ్ల అమ్మానాన్నలు వాడిని చూసి "ఇక్కడే ఉంటే వీడు చాలా అల్లరిపట్టిపోతాడు. వీడిని వీళ్ల మామ ఇంట్లో ఉంచి చదివించటంమంచిది" అనుకున్నారు. వాళ్ళ మామ కూడా దానికి ఒప్పుకుని, సెలవల్లో వచ్చి వాడిని పిలుచుకు పోయి, వాళ్ళ ఊళ్ళో ఉన్న ఒక చిన్నబడిలో చేర్పించాడు వాడిని.
ఆ బడిలో పిల్లల్ని కొట్టరు. వాళ్ళు చదివితే చదివిస్తారు; లేకపోతే కూడా ఏమీఅనరు. ఆ బడిలో చేరుకున్నాక కూడా విష్ణు అల్లరి మానలేదు. ఎప్పటిలాగానే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొని, విష్ణు వాళ్ళ మామ మొదటగా మాటలతో చెప్పి చూశాడు. అయినా కూడా విష్ణు మారకపోవటంతో వాళ్ల మామకు కోపం వచ్చి, విష్ణుని కొట్టి, తిట్టి, కసురుకొని చెప్పాడు. ఏం చేసినా విష్ణులో మార్పు రాలేదు. ఎప్పటిలాగానే అల్లరి చేస్తున్నాడు.
విష్ణుకి మంచి స్నేహితుడు భాస్కర్. భాస్కర్ కూడా అల్లరి పిల్లవాడే; కానీ అతనుకూడా విష్ణుకు ఎన్నో రకాలుగా చెప్పి చూశాడు. "విష్ణూ! మీ అమ్మనాన్నలు నీకోసం ఎంతో కష్టపడి పనిచేసి నిన్ను చదివిస్తున్నారు. మీ మామవాళ్ళు కూడా నీగురించే తన్నుకలాడుతున్నారు. ఇలా చేస్తే ఎలాగ?" అని చెప్పి చూశాడు. ఎంత చెప్పినా విష్ణులో మాత్రం పెద్దగా మార్పు వచ్చినట్లు లేదు.
అయితే కాలం గడిచేకొద్దీ విష్ణులో చాలా మార్పు వచ్చింది. అల్లరి కొద్ది కొద్దిగా తగ్గ సాగింది. ఏడవ తరగతిలో తను అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకొన్నాడు. పోట్లాటలు తగ్గించేశాడు. ఏడవ తరగతిలోమంచి మార్కులు వచ్చేసరికి, వాడికి చదువంటే ఇష్టం పెరిగింది. అల్లరి అల్లరిగానే 8-9 తరగతులు చదివిన విష్ణు, ఆపైన పదవ తరగతిలో ఎంత చక్కగా చదివాడంటే, వాడిప్పుడు 500కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు!
(అంతకంటే గొప్పసంగతి ఒకటుంది- చాలా చక్కని కథలు రాస్తున్నాడు, కల్పించి -కల్పించి!)