ఒకసారి ఒక ఋషి అడవిలో పోతున్నాడు. ఎండ మండిపోతున్నది. అప్పుడాయనకు ఒక నిమ్మచెట్టు కనబడింది. "రండి స్వామీ! నా నీడన కూర్చోండి! నా పళ్ళ రసం తాగండి" అని పిలిచింది నిమ్మ.

ఋషికి నిమ్మ చెట్టు చాలా నచ్చింది. "నీకొక వరం ఇస్తాను నిమ్మా! అయితే ఇప్పుడు కాదు. సరిగ్గా నెల తర్వాత, కొండల అవతల నేనుండే గుహకు రా, నువ్వు. సరేనా?" అన్నాడు.

"సరే" అని, నెల తర్వాత కొండలు దాటేందుకని బయలుదేరింది నిమ్మ. దారిలో పేరులేని చెట్టొకటి కలిసింది దానికి. చిన్న చిన్న ఆకులతో, వికారంగా ఉంది అది. "నేనూ వస్తానమ్మా, నీతో! ఋషిని నేనూ చూస్తాను" అన్నదది.

"సరే" అని దాన్నీ‌ వెంట బెట్టుకొని, కొండలు దాటటం మొదలెట్టింది నిమ్మ.

దాటీ దాటీ నిమ్మకు చాలా అలసట వచ్చింది. "నువ్వు ముందు నడుస్తుండు" అని పేరులేని చెట్టును ముందుగా పంపింది అది.

పేరులేని చెట్టు గుహను చేరుకునే సరికి, ఋషి కళ్ళు తెరిచాడు- "దా,నిమ్మా" అని పిలిచాడు. పేరులేని చెట్టు భయపడుతూనే ఋషిముందుకెళ్లి నిలబడింది. వంగి నమస్కారం చేసింది. "నేను నిమ్మను కాదు. నాకు పేరు లేదు. నిమ్మ చెట్టుకు నీరసం వచ్చి, వెనకబడ్డది. కొంత సేపట్లో వస్తుంది- ఆగండి!" అన్నది. అంతలోనే నిమ్మకూడా అక్కడికి చేరుకొని ఋషికి నమస్కారం చేసింది.

ఋషి నిమ్మ చెట్టుతో "అందరి నీరసాన్నీ పోగొట్టే నీకు నీరసం ఏంటి? నీ రసం తాగితే ఎంత నీరసించిన మనుష్యులకైనా నీరసం పోయి శక్తి చేకూరుతుంది. నీ విత్తనాలను ఎవ్వరూ తినరు. అలా నీ వంశం వృద్ధి చెందుతుంది. జంతువులు నిన్ను బాధించకుండా నీకు ముళ్ళను ప్రసాదిస్తున్నాను. సంతోషంగా బ్రతుకు" అన్నాడు.

చెట్లు రెండూ నమస్కారం చేసి వెనక్కి తిరిగాయి. అప్పుడు ఋషి రెండవ చెట్టుతో అన్నాడు "నీకు పేరు లేదనుకోకు. ఇందాక నిన్ను పిలిచానుకదా, 'దా,నిమ్మా' అని? ఇకనుండీ నీ పేరు అదే. నీ విత్తనాలు తినేందుకు ఎక్కడెక్కడి మనుషులూ తహతహలాడతారు. నీ పండ్ల తొక్కు, గుజ్జు- అన్నీ మందులుగా పనికి వస్తాయి. మీరిద్దరూ మానవజాతికి దేవుడిచ్చిన వరాలుగా పేరుగాంచుతారు. సంతోషంగా వెళ్ళండి" అన్నాడు.

ఆనాటినుండి నిమ్మ, దానిమ్మలు మానవులకు శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తూ ఉన్నాయి. నిజంగానే అవి మనకు దేవుడిచ్చిన వరాలైనాయి!