సీతమ్మ చక్కని చుక్క. పైగా గర్భవతి. అయినా ఆమె మొగుడు ఆమెను చీదరించుకునేవాడు. అత్త-మామ ఇద్దరూ ఆశపోతులు. అడిగినంత కట్నం తేలేదని ఆమెను ఎప్పుడూ తిడుతుండేవాళ్ళు. 'నువ్వు చచ్చిపోతే మా కొడుక్కి మళ్ళీ పెళ్ళి చేస్తాం" అని సాధించేవాళ్ళు. సీతమ్మ ఇవన్నీ భరిస్తూ జీవితాన్ని ఎలాగో ఒకలా నెట్టుకొచ్చేది.
సీతమ్మకు మాంసంకూర అంటే చాలా ఇష్టం. ఒకరోజున అత్త మామ మాంసం కూర చేశారు. తీరా సీతమ్మ తినాలనుకునేసరికి, వాళ్ళు "కందికట్టె పూర్తిగా అయిపోయింది- చేనుకెళ్ళి కందికట్టె తీసుకురా" అని పంపించారు. సీతమ్మ చేనుకు వెళ్ళి తిరిగి వచ్చేలోగా ఆమె అత్త, మామ, భర్త ముగ్గురూ కూరను పూర్తిగా లాగించేశారు. అంతేకాకుండా, రోడ్డుమీద దొరికిన పామునొకదాన్ని ముక్కలు చేసి, దాన్ని వండి పెట్టారు సీతమ్మకోసం!
ఆకలిగా ఉన్న సీతమ్మ పాపం, ఆ పాము చారునే తిన్నది. తినగానే ఆమెకు వాంతులు-బేదులు మొదలయ్యాయి. నాలుగైదు గంటలపాటు ఆమె బాధపడినా అత్తమామలుగాని, భర్తగాని ఆమెను పట్టించుకోలేదు. చివరికి ఊరి చివరనున్న తోటలోకి పరుగెత్తిన సీతమ్మ అక్కడే చనిపోయింది.
"అయ్యో నా భార్య! చనిపోయింది" అని దొంగ ఏడుపులు ఏడిచి, భర్త, అత్త-మామలు కలిసి ఆమెను అక్కడే సమాధి చేసేసి, 'పీడ విరగడైంది' అని సంతోషపడ్డారు. త్వరలోనే ఆ సమాధి మీద చాలా అందమైన పూలు- చేమంతులు, గులాబీలు, గుండుమల్లెలు పూసాయి.
ఈ సంగతంతా తెలీదు, సీతమ్మ తల్లిదండ్రులకు. వాళ్ళు పాపం, సీతమ్మకు శ్రీమంతం చేద్దామని బయలుదేరి వచ్చారు. ఇంకా ఊళ్ళోకి పోకనే వాళ్ళకు ఒక చక్కని తోట కనబడింది. ఆ తోటలో ఒకచోట అందమైన పూలు కనబడితే, సీతమ్మ చెల్లెలు తన అక్క శ్రీమంతం కోసం ఆ పూలు తెద్దామని వెళ్ళింది. ఆమెను చూడగానే అక్కడున్న చేమంతులు
"రావద్దు చెల్లీ!
రావద్దు చెల్లీ!
వస్తే ప్రమాదం చెల్లీ!
పాము తినిపిస్తారు!
వెళ్లిపో చెల్లీ" అని పాడాయి.
సీతమ్మ చెల్లెలు గబగబా వెనక్కి వెళ్ళి వాళ్ల అమ్మతో "అమ్మా! అక్కడ అక్క మాటలు వినబడుతున్నాయి. చేమంతులు ఏమేమో చెబుతున్నై, నువ్వు పోయి చూడు" అన్నది. "పూలు మాట్లాడేది ఏమిటి", అని సీతమ్మ తమ్ముడిని పంపింది వాళ్లమ్మ.
వాడిని చూడగానే చేమంతులు
"రావద్దు తమ్ముడా!
రావద్దు తమ్ముడా!
వస్తే ప్రమాదం తమ్ముడా!
పాము తినిపిస్తారు,
వెళ్ళిపో తమ్ముడా!" అని పాడాయి.
వాడు కూడా వెనక్కి వచ్చాక ఈసారి సీతమ్మ తల్లి స్వయంగా వచ్చి చూసింది. ఆమెను చూడగానే చేమంతులు ఏడుస్తూ
"రావద్దు తల్లీ!
రావద్దు తల్లీ!
వస్తే ప్రమాదం తల్లీ!
పాము తినిపిస్తారు,
వెళ్ళిపో తల్లీ!" అన్నాయి.
వాటి గొంతును గుర్తు పట్టిన సీతమ్మ తల్లి, "అయ్యో! పదండి త్వరగా! సీతమ్మకు ఏదో అయినట్లుంది. వీళ్ళు ఏదో చేసినట్లున్నారు. పోయి చూద్దాం పదండి" అని, అందరినీ వెంటబెట్టుకొని త్వరత్వరగా వెళ్ళింది సీతమ్మ అత్తగారింటికి.
వీళ్లను చూడగానే సీతమ్మ భర్త, అత్త-మామలు అందరికీ పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లైంది. "మా బిడ్డ సీతమ్మ ఏది?" అని అడిగితే వాళ్ళు నీళ్ళు నమిలారు- ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెప్పారు. సీతమ్మ బంధువులందరికీ మోసం అర్థమైంది. వాళ్లంతా ఆమె భర్తమీద, అత్త మామలమీద పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుననుసరించి పోలీసులు దర్యాప్తు జరిపే సరికి, నిజం బయట పడింది. సీతమ్మ భర్తను, అత్తను, మామను అందరినీ పోలీసులు జైలులో పెట్టారు. దుర్మార్గులకు తగిన శిక్షలే పడ్డాయి.
ఇప్పుడు సీతమ్మ సమాధి చుట్టూ చక్కని పూలతోట ఏర్పడ్డది.
దాని చుట్టూ పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం తయారైంది.
పిల్లలంతా సంతోషంగా ఆడుకుంటుంటే, చేమంతులు పాడుతున్నై-
"రండి రండి పిల్లలూ!
చక్కని పిల్లలూ!
ఆడుకోండి, పాడుకోండి,
మంచి వ్యక్తులుగా ఎదగండి!
కల్లలొద్దు, కపటం వద్దు,
అందరు ఒకటేనండీ!
రండి రండి పిల్లలూ!
ఆడుకోండి పిల్లలూ" అని.