చాలాకాలం క్రితం అరేబియా దేశంలోని ఒక పల్లెటూరిలో అబ్దుల్లా హుసేన్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళికూతురుకోసం నగలు కొనుక్కురావాలి. అతని తండ్రి హుసేన్ కు డబ్బులిచ్చి, "నాయనా! నీ భార్యకు ఎలాంటి నగలు చేయించుకుంటావో, మరి నీ యిష్టం. ఈ డబ్బు తీసుకెళ్ళి, పట్నంలో నీకు నచ్చిన నగలు చేయించు. పట్నంలో‌ మోసాలు ఎక్కువ. జాగ్రత్త మరి! కొత్తవాళ్లను తొందరపడి నమ్మకు!" అన్నాడు. హుసేన్ ఆ డబ్బును జాగ్రత్తగా బనీను జేబులో‌దాచుకొని, పట్నం చేరుకున్నాడు.

హుసేన్ తెలివైనవాడే గాని, అమాయకత్వం పాలు కొంచెం‌ఎక్కువే. కొంత సేపు అతను ఆ నగరంలోని వింతలు-విశేషాలను నోరు వెళ్ళబెట్టి చూస్తూ తిరిగాడు. అయితే ఎంత తిరిగినా నగల దుకాణం మాత్రం కనిపించలేదు అతనికి. చివరికి ఇక చేసేదేమీ లేక, దగ్గర్లోనే నిలబడ్డ మనిషినొకడిని 'ఈ ఊళ్లో‌ నగలదుకాణం ఎక్కడుంది?' అని అడిగాడు. అక్కడ నిలబడ్డవాడి పేరు జలాలుద్దీన్. నిజానికి వాడొక పెద్ద మోసగాడు. అమాయకులను మోసం చేసి డబ్బు లాక్కోవటమే అతని వృత్తి! హుసేన్‌కు ఈ సంగతి తెలీదు కద, పాపం!

జలాలుద్దీన్ హుసేన్‌ను పరీక్షగా చూస్తూ "నగల దుకాణమా, నాకు తెలీకేం? బాగా తెలుసు. అయినా ఎందుకు బాబూ, నీకది?" అని అడిగాడు, మరొక అమాయకుడు తన చేత చిక్కినందుకు లోలోపలే సంతోషిస్తూ. హుసేన్ ఆ సరికి బాగా అలసి ఉన్నాడేమో, అడిగినదే తడవుగా తన పేరు, ఊరు, పెళ్లి సంగతి, తన దగ్గర ఎంత డబ్బున్నదీ- అంతా చెప్పేశాడు జలాలుద్దీనుకు.

డబ్బు మాట వినగానే జలాలుద్దీన్ కళ్లు మెరిశాయి. "చూడు బాబూ! ఈ నగరంలో చాలా మంది మోసగాళ్ళుంటారు; జేబు దొంగలుంటారు. ఇలా నీ దగ్గర డబ్బున్న సంగతి ఎవ్వరికీ‌ చెప్పకూడదు. నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది గానీ, మరొకరైతే నీ పని ఇవాల్టితో ఆఖరయ్యేది" అన్నాడు. "అవునవును, మా నాన్నకూడా ఆ సంగతే చెప్పారు నాకు, మరచాను" అన్నాడు హుసేన్, ఒకింత సిగ్గు పడుతూ. "పరవాలేదులే. నావెంట రా. నిన్ను నీకు కావలసిన చోటికి చేర్చుతాను" అని, జలాలుద్దీన్ వాడిని తన వెంటబెట్టుకు పోయాడు.

కొద్దిసేపు నగరంలో ఆ వీధీ- ఈ వీధీ తిప్పేసరికి, హుసేన్ కు ఆకలైంది. "అయ్యో! ఆకలిగా ఉండకూడదు. నాకు తెలిసిన ఒక హోటలుంది. చక్కని మాంసం దొరుకుతుంది అక్కడ" అని, జలాలుద్దీన్ అతన్ని ఒక హోటల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. పదార్థాలు వచ్చేలోగా, వాడు బయటికి వెళ్ళి, తన కూతురు అమీనాతో రహస్యంగా మంతనాలాడి, హుసేన్‌కి ఎలా టోకరా వేయాలో‌నిర్ణయించి, తిరిగి వచ్చి కూర్చున్నాడు.

వాళ్ళిద్దరూ భోజనం ముగించి బయటికి వచ్చేసరికి, అటువైపునుండి అమీనా గట్టిగా ఏడుస్తూ వచ్చి హుసేన్ చేయి పట్టుకున్నది. "ఏంటిది, వదులు! నా చెయ్యి వదులు!" అన్నాడు హుసేన్ కంగారుగా. "ఇప్పుడు ఇక నన్ను తప్పించుకొని పోలేవు. నీతోటే నా జీవితం" అన్నది అమీనా గొంతు పెంచి.

ఆ సరికే దోవన పోయే మనుషులందరూ అక్క డ గుమిగూడారు. వాళ్ళంతా "పాపం! ఆడకూతురు!" అని జాలి కురిపిస్తూ "ఏమైంది తల్లీ! ఏమిటి నీ బాధ?" అని అడిగారు.

"చూడండి బాబూ! ఇతను నా భర్త. విపరీతంగా తాగుతాడు. మా నాన్న ఇతన్ని మా యింట్లో ఇల్లరికపు అల్లుడుగా పెట్టుకున్నాడు.." అని అమీనా ఇంకా ఏదో‌చెప్పబోతుండగానే "పచ్చి అబద్ధం. ఈమె ఎవరో నాకు తెలీదసలు" అని మొత్తుకున్నాడు హుసేన్.

"చూశారా, ఇదీ వరస! ఇతని పేరు అబ్దుల్లా హుసేన్, ఊరు ఫలానా" అని వివరాలన్నీ‌చెప్పి, "కాదంటాడేమో అడగండి. నేను అతని భార్యనే అని మీకైనా నమ్మకం వస్తుంది." అన్నది అమీనా ఏడుపు పండిస్తూ.

"అవన్నీ నిజమే, గానీ నాకు మాత్రం ఈమె ఎవరో తెలీదు" అని ఎంత గొణిగినా హుసేన్ ని అక్కడచేరిన వాళ్లెవరూ నమ్మలేదు. "నా యీ తాగుబోతు మొగుడు మా ఇంట్లో ఉన్న సొమ్మంతా దొంగిలించి ఎక్కడికో పారిపోవాలని బయలుదేరాడు. నిన్నటినుండీ వెతుకుతుంటే ఇప్పటికి దొరికాడు- నా అదృష్టం బాగుండబట్టి. కావాలంటే అతన్ని సోదా చెయ్యండి" అనగానే జనాలు హుసేన్ జేబుల్లో వెతికి, అతను నగలకోసం తెచ్చుకున్న డబ్బును బయటికి లాగారు.

ఆలోగా జలాలుద్దీన్ అమీనా తండ్రిలాగా వచ్చి, మరికొంత మసాలా జోడించి, ఆ డబ్బును కాస్తా చేత పుచ్చుకొని చక్కా పోయాడు- "అమ్మా! నీ మొగుడూ, నువ్వూ మీ ఇష్టం- నా యింట్లో ఉండటం ఇష్టం లేకపోతే అతను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో అడుగు- ఇద్దరూ అక్కడికే పొండి" అని చెబుతూ. అమీనా హుసేన్ చేయిపట్టుకొని లాగుతూ "నువ్వూ వచ్చెయ్యి. మా నాన్న ఇంట్లోనే ఉండు నోరు మూసుకొని" అని ఏడవసాగింది. హుసేన్‌కి అప్పటికిగానీ తెలివి రాలేదు. "వీళ్లిద్దరూ తోడు దొంగలు! తనని మోసంచేసి తన డబ్బును ఎత్తుకు పోతున్నారు!" ఈ విషయం అర్థం కాగానే వాడు అమీనా చేతిని దొరకపుచ్చుకొని, వెంట లాక్కుని పోసాగాడు.

"బాగానే ఉందయ్యా, మీ వరస! భార్యా భర్తల మధ్య తగవులాటలుంటే ఇంట్లో తీర్చుకోవాలిగానీ, ఇలా రచ్చకెక్కవచ్చా?" అని అక్కడ మూగిన జనాలంతా ఎవరిదారిన వాళ్ళు పోయారు.

కొంత దూరం పోయాక, హుసేన్ అమీనాని "నిజం చెప్పు. నువ్వెవరు అసలు?" అని అడిగాడు. "జలాలుద్దీన్ మా నాన్న. నీలాంటి వాళ్ళని మోసం చేయటమే మా వృత్తి. అర్థమైంది గదా, ఇక నన్ను పోనీ" అని నవ్వి, చెయ్యి విడిపించుకోబోయింది అమీనా.

"అటుకాదు, ఇటు, నడు. ఇప్పుడు నేను నీ భర్తను. పదిమంది ఎదుటా నువ్వు అలా ప్రమాణం కూడా చేశావు. మీ నాన్న కూడాను. కనుక నేనెట్లా చెబితే నువ్వు అట్లా చేయాలి. మన దేశపు చట్టం ప్రకారం భార్యలు భర్త ఆస్తి కిందే లెక్క. రా, నువ్వు!" అని, హుసేన్ ఆమెను సంతకు తీసుకు వెళ్ళాడు.

ఆ రోజుల్లో అరేబియా దేశపు సంతల్లో మనుషుల్ని బానిసలుగా అమ్మటం, కొనటం జరుగుతుండేది. ఇప్పుడు హుసేన్ సంతలో తన భార్య 'అమీనా'ను బేరానికి పెట్టాడు. ఒకరు వంద దీనారాలు ఇస్తామంటే ఒకరు వెయ్యి ఇస్తామంటున్నారు. అమీనా 'వీడు అసలు నా భర్తే కాదు ' అని ఏడుస్తున్నది.

సంగతి తెలిసి జలాలుద్దీన్ కూడా ఆదరా బాదరాగా అక్కడికి చేరుకున్నాడు. "నా కూతురు! నా కూతురు" అంటూ. "నీ కూతురు కాదు- నా భార్య!" ఇందాక రోడ్డు మీద పదిమంది ఎదుటా ఈమెను నాకు అంటకట్టేశావు కద నువ్వు!" అని మంకుపట్టు పట్టాడు హుసేన్. ఆ గొడవ విని రాజభటులు అందరినీ పట్టుకొని పోయి న్యాయాధికారి ముందు నిలబెట్టారు.

న్యాయాధికారి ముందు హుసేన్ నిర్భయంగా జరిగిందంతా చెప్పాడు. అమీనా, జలాలుద్దీన్‌లు గతంలో అనేకమందిని మోసగించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దాంతో న్యాయాధికారి హుసేన్‌కు డబ్బులు వెనక్కి ఇప్పించటమేగాక, నేరస్తులను కఠినంగా శిక్షించాడు. తెలివిగా నేరస్తులను పట్టించినందుకు హుసేన్ ను ప్రశంసించాడు.

ఆపైన హుసేన్‌కు నగల దుకాణం సులభంగానే దొరికింది!