అనగనగా ఒక ఊళ్లో విష్ణు అనే పిల్లవాడు ఉండేవాడు. విష్ణు చాలా తెలివైన పిల్లవాడు. అతనికి విజ్ఞానశాస్త్ర ప్రయోగాలంటే చాలా ఇష్టం ఉండేది. రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉండేవాడు. వాళ్ల బడిలో చక్కని ప్రయోగశాల ఉండేది ఒకటి. అందులో రకరకాల పరికరాలు, చాలా రసాయనాలు పెట్టి ఉండేవి. వీలు చిక్కినప్పుడల్లా విష్ణు ఆ రసాయనాల పేర్లు చదివి, వాటిని గురించి అడిగి తెలుసుకొని మురిసిపోతూ ఉండేవాడు.
"మొక్కల్లో కూడా రసాయనాలు ఉంటాయిరా, మట్టిలోకూడా ఉంటై- అసలు రసాయనాలు లేని పదార్థమే లేదు" అని వాళ్ళ సైన్సు టీచరు గారు చెబుతుంటే, వినీ వినీ విష్ణుకు కొత్త కొత్త ఐడియాలు చాలా వచ్చేవి. అప్పటినుండీ వాడు మొక్కలతోటీ, గడ్డితోటీ, మట్టితోటీ కూడా ప్రయోగాలు మొదలుపెట్టాడు.
"ఆ రసాయనాలతో అంతగా ఆడకురా, ఏమౌతుందో ఏమో!" అనేవాడు వాళ్ళ చిన్నాన్న. విష్ణు వాళ్ళ చిన్నాన్న కమ్మరి పని చేసేవాడు. ఆయనకు విష్ణుకున్న ప్రయోగాల పిచ్చి తెలుసు. జాగ్రత్తగా ఉండమని ఎప్పుడూ హెచ్చరిస్తూండేవాడు. అయితే విష్ణు మాత్రం ఆయన మాటల్ని కొట్టి పారేసేవాడు- "వీటితో ఏమీ కాదులే చిన్నాన్నా! ఇవన్నీ నిజానికి వ్యర్థ పదార్థాలేనట, తెలుసా? కంపెనీల్లో ఇంతకంటే చాలా శక్తివంతమైన పదార్థాలు వాడతారట" అనేవాడు.
ఒకసారి విష్ణు సబ్బు నీళ్ళతో బుడగలు చేయటం ప్రారంభించాడు. రకరకాల సైజుల్లో బుడగలు వస్తుంటే, సూర్యుడి కాంతిలో అవి రంగులు రంగులుగా మెరుస్తుంటే వాడికి చాలా సంతోషం వేసింది. కానీ కోతి బుద్ధిఎక్కడికి పోతుంది? ఆ నీళ్లలో రకరకాల రసాయనాలు, మొక్కల రసాలు కలపటం మొదలు పెట్టాడు. రాను రాను ఆ నీళ్ళు చిక్కబడి, పెద్ద పెద్ద బుడగలు తయారవ్వసాగాయి. ఆ బుడగలు ఇప్పుడు తొందరగా పగలటంలేదు కూడాను!
విష్ణుకి చాలా ఉత్సాహం కలిగింది. 'ప్రపంచంలోకెల్లా అతి పెద్ద బుడగను తనే తయారు చేస్తే ఎలాగుంటుంది?' అనిపించింది. 'అప్పుడు అందరూ తన పేరును గిన్నెస్ బుక్ లో రాస్తారు. మొహాలకు రంగులు పూసుకొని, అందరూ 'విష్ణు-విష్ణు-విష్ణు' అని అరుస్తుంటారు!'
ఇక విష్ణు ఆగలేకపోయాడు- ఆ నీళ్ళున్న బక్కెట్టును పట్టుకొని దగ్గర్లోనే ఉన్న ఒక పెద్ద కొండను ఎక్కాడు. పెద్ద బుడగనొకదాన్ని ఊదటం మొదలు పెట్టాడు. ఇప్పుడు నీళ్ళు చాలా చిక్కగా, జిడ్డుగా ఉన్నాయి. సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. విష్ణు సంబరంగా ఊదుతుంటే పెద్ద బుడగ ఒకటి తయారవ్వసాగింది. ఎంత ఊదితే అంత పెద్దదౌతున్నది. పగిలేటట్లే లేదు అది! విష్ణు ఉత్సాహం అవధులు దాటింది. ఊదుతూ పోయాడు. అది ఇంకా పెద్దదైంది. విష్ణుకంటే పెద్దదైంది..ఆరడుగుల ఎత్తు..పది అడుగులు..ఇరవై అడుగులు.. చూస్తూండగానే అది తాటిచెట్టంత పెద్దదైంది!
విష్ణు ఒకసారి ఊదటం ఆపి, దూరం జరిగి చూసుకున్నాడు దాన్ని- తృప్తిగా. అంతలోనే గాలివల్లనేమో, అది బక్కెట్లోంచి విడివడింది. జారి, దొర్లుకుంటూ పోసాగింది క్రిందికి. పైనుండి విష్ణు దాన్ని చాలా సంబరంగా చూస్తూ గంతులు వేయసాగాడు. అది పగలలేదు! రానురాను వేగం పుంజుకొని క్రిందికి దొర్లుతున్నది. మొదట్లో అది దొర్లటం మొదలు పెట్టినప్పుడు, దానికి అంటిన గడ్డిపోచలు, మట్టీ దానికి అతుక్కొని, దానితోబాటే దొర్లి పోవటం గమనించాడు విష్ణు- అయితే ఇప్పుడు దాని బంకగుణం ఎక్కువైనట్లుంది- బండలకు బండలే దానిలోకి ఇమిడిపోతున్నై! అది బండల్నేకాదు- అడ్డం వచ్చిన వాటిని అన్నిటినీ మింగేస్తున్నది! రాళ్ళు, చెట్లు, తుప్పలు- ఏవి అడ్డమొస్తే అవి ఆ బుడగలోకి చేరుకుంటున్నై.
చూస్తూండగానే ఆ బుడగ ఊళ్ళోకి ప్రవేశించింది. ఇళ్ళకి ఇళ్ళు ఆ బుడగలోకి చేరుకుంటున్నై. మనుషులంతా ఆ బుడగలోపల అతుక్కుని గింగిరాలు కొడుతున్నారు. ఊరంతా కకావికలైంది. ఎవరికి తోచిన దిక్కులో వాళ్ళు పరుగెడుతున్నారు. బంతి అన్నిటినీమింగుతూ ఇంకా ఇంకా పెద్దదౌతూ పోయింది!
విష్ణుకి చెమటలు పోశాయి. ఆ బంతినెలాగైనా ఆపాలి. దాన్ని ఎలాగైనా పగలగొట్టేయాలి! ఎలాగ? ఆ కంగారులో వాడికి తను ఏఏ రసాయనాలు వాడాడో, వాటి విరుగుడు ఏమిటో- ఏమీ గుర్తుకు రాలేదు. వృధాగా వాడు దాని వెనక పరుగెడుతూ 'కాపాడండి, కాపాడండి' అని అరవటం మాత్రం చేయగల్గాడు.
బుడగ విష్ణు వాళ్ళ ఇంటి సమీపానికి వచ్చేసరికి, విష్ణు వాళ్ళ చిన్నాన్న ఒక గునపాన్ని ఎర్రగా కాల్చి సరిచేస్తున్నాడు. ఈ అరుపులూ పెడబొబ్బలూ విని, ఆయన దాన్ని చేతబట్టుకొని బయటికి వచ్చాడు. చూస్తే పరమ భయంకరమైన బుడగ ఒకటి, సూటిగా తమ ఇంటిమీదికే వస్తున్నది. ఆయన ధైర్యంగా తన చేతిలోని గడ్డపారను ఎత్తి పట్టుకొని దాని మీదికి ఉరికాడు. బాగా వేడెక్కి ఎర్రగా కాలిన ఆ గునపం తగలగానే, అంత వేగంగా వస్తున్న బంతీ ఠపాలున పగిలింది. దానిలోఇరుక్కుని హాహాకారాలు చేస్తున్న మనుషులంతా ఎక్కడెక్కడికో విసిరేయబడ్డారు! ఆ బండలూ, రాళ్ళూ తగిలి కొందరికి గాయాలయ్యాయి గానీ, 'రాక్షసి బంతి ఇక లేదు' అన్న వాస్తవం అందరికీ సంతోషం కలిగించింది.
ఊళ్ళో వాళ్లంతా చిన్నాన్న ధైర్యాన్ని, సాహసాన్ని కొనియాడారు. చిన్నాన్నకు పూలమాలలు వేసి ఊరేగింపు చేశారు. 'ఎంత కష్టం తొలగించాడు!' అని పొగిడారు. ఆ హడావిడిలో విష్ణు మెల్లగా జారుకొని, ఇంట్లో ఓ మూలన నక్కి కూర్చుని, నిద్రలోకి జారుకున్నాడు. చాలా సేపటికి, చిన్నాన్న ఇంటికి వచ్చి, "ఒరే విష్ణూ, ఇకమీద ఎప్పుడూ రసాయనాలతో నీకు తెలీని ప్రయోగాలు చెయ్యకురా!" అనేంతవరకూ వాడికి మెలకువ రాలేదు! మెలకువ వచ్చాక ఆలోచిస్తే, తన బుడగ కథ నిజమో-కలో కూడా అర్థం కాలేదు వాడికి!