అవంతీపురాన్ని చంద్రవర్మ అనేరాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు తన రాజ్య ప్రజలంటే చాలా ఇష్టం. ఆయనకు చక్కని సలహాలిస్తూ అనేక సంవత్సరాలు పనిచేసిన మంత్రికి వయసు పైబడింది. ఇప్పుడు పని భారం అవుతున్నది. విశ్రాంతి కోరుతున్నాడాయన.
రాజుగారు ఆయనతో "మంత్రిగారూ! మీరు మీ ఇష్ట ప్రకారమే విశ్రాంతి తీసుకోవచ్చు- అయితే దానికంటే ముందు, మీ స్థానంలో సమర్థత గల వేరొక మంత్రిని నియమించే బాధ్యత మీదే" అన్నాడు.
వృద్ధ మంత్రి తెలివైనవాడూ, మంచివాడు కూడానూ. ఆయన "సరే మహారాజా! నేనే స్వయంగా మన రాజ్యంలో తగిన వ్యక్తిని నా వారసుడిగా ఎంపిక చేస్తాను" అని, మంత్రి పదవికి అర్హతలున్న వారినందరినీ రమ్మని చాటింపు వేయించాడు. తెలివితేటలకూ, మేధస్సుకూ సంబంధించి ఆయన పెట్టిన రకరకాల పరీక్షల్లో ముగ్గురు అభ్యర్థులు ఉత్తములుగా ఎంపికయ్యారు. మంత్రి పదవి వారిలోఎవరిని వరించాలో వృద్ధ మంత్రి స్వయంగా నిర్ణయించుకోవలసి ఉన్నది.
మంత్రిగారి ఇంట్లో మంత్రి, అతని అవ్వ మాత్రమే ఉండేవారు. పరీక్షలు పెట్టిన రోజున, మంత్రిగారు ఈ ముగ్గురినీ తమ ఇంట్లోనే ఉండమన్నారు. "ఇప్పుడు రాత్రి అవుతున్నది కదా, ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి పడుకోండి. ఉదయం లేవగానే రాజుగారి వద్దకు వెళ్దాము" అని చెప్పాడు వాళ్ళకు.
వాళ్ళు ముగ్గురూ భోజనం చేశాక, అవ్వ "నాయనలారా, మీకు ముగ్గురికీ మూడు గదులిమ్మన్నారు. లోపల ఉన్న మూడు గదులూ మీవి. వెళ్ళి పడుకోండి" అన్నది వాళ్ళతో. మొదటి ఇద్దరూ "మేము బాగా అలసి పోయాం అవ్వా, పడుకుంటాం" అని వెళ్లి, లోపలి గదుల్లో పడుకున్నారు. చివరి వాడు మాత్రం "అవ్వా! కొత్త ప్రదేశం కదా, నేను బయట పడుకుంటాను" అన్నాడు.
అందుకు అవ్వ "నాయనా! బయట చాలా చలిగా ఉన్నది; అదీ కాక ఈ రాజధానిలో దొంగల భయం ఎక్కువ. వద్దు నాయనా! ఇంట్లోకి వచ్చి పడుకో !" అన్నది. "లేదు అవ్వా, నాకు ఇది మామూలే. ఎంత పెద్ద దొంగలైనా నేను భయపడేది లేదు. లోపల వద్దు- బయటే పడుకుంటాను. ఈరోజు వచ్చారంటే దొంగలు దొరికారన్నమాటే!" అని చెప్పి పడుకున్నాడు.
అర్థరాత్రి కావస్తుండగా మొదటివాడికి మెలకువ వచ్చింది. చూడగా, గది కిటికీ దగ్గర ఏదో ఆకారం, తెల్లటి ముసుగు వేసుకొని, నిలబడి ఉన్నది. వాడికి స్వతహాగా దయ్యాలంటే భయం. అందుకని, వాడు వణుక్కుంటూ లేచి, హడావిడిగా రెండోవాడున్న గదిలోకి మారిపోయాడు.
రెండోవాడికి మొద్దునిద్ర. వాడొకసారి నిద్రపోయాడంటే ఏ దయ్యాలూ వాడిని నిద్ర లేపలేవు. తన గదిలోకి మొదటివాడు వచ్చి పడుకున్న సంగతే తెలియదు, వాడికి!
అయితే ఆ అలికిడికి బయట పడుకున్న మూడోవాడు లేచాడు. బయట తిరుగుతున్న ఆ ఆకారాన్ని చూడగానే అది ఎవరోమనిషని వాడికి అర్థం అయ్యింది. ఆ ఆకారం మంత్రి గారి ఇంట్లోకి జొరబడుతుండగా చూసి, మూడోవాడు దాన్ని వెంబడించాడు. ఆ ఆకారం నేరుగా మంత్రిగారి నగల భోషాణం దగ్గరికి వెళ్లింది. తన జేబులోంచి తాళాల గుత్తిని తీసి భోషాణం తలుపులు తెరిచింది. లోపలున్న నగనొకదాన్ని అందుకునేందుకు చేతులు లోపల పెట్టిందో, లేదో- మూడోవాడు దాని వెనకగా వెళ్ళి, గది తలుపులు మూసి గొళ్ళెం పెట్టేశాడు.
"ఎందుకు, మంత్రిగారి ఇంట్లోనే దొంగతనానికి వచ్చావు? ఏమేమి తీసుకెళ్దా-మనుకున్నావు? మర్యాదగా చెప్పు! లేక పోతే అందరినీ పిలుస్తాను. అందరూ వచ్చి నిన్ను చితక బాదుతారు. నీకు ఉరిశిక్ష ఖాయం!" అన్నాడు మూడోవాడు, బయట కిటికీలోంచే, ఆ ఆకారంతో.
"ఉష్.. గట్టిగా అరవకు! నన్ను వదులు. ఎన్నోరోజులు కష్టపడి నేను ఈ తిజోరీ తాళం చెవులు సంపాదించాను. నన్ను వదిలితే ఈ నగల్లో సగం నీకే ఇస్తాను" అన్నది ఆ ఆకారం, మూడోవాడితో, గుసగుసగా.
"నాకే డబ్బులు ఆశ చూపిస్తావా?" అని, మూడోవాడు గట్టిగా అరిచి, అందరినీ నిద్రలేపాడు.
అయితే, ఆ దొంగను పంపింది స్వయంగా వృద్ధ మంత్రే! ఈ ముగ్గురు అభ్యర్థుల లక్షణాలనూ పరిశీలించటంకోసమే ఆయన తన సేవకుడిని అలా నటించమని ఆదేశించాడు! అందరికీ ఆయన ఆ సంగతిని తెలియజేసి, మూడవవాడి ధైర్యాన్నీ, తెలివినీ, నిజాయితీనీ ప్రశంశించాడు. అతనినే తన వారసుడిగా ఎంపిక చేసుకున్నాడు!