బాబీ ఎనిమిదేళ్ళ అల్లరి పిల్లవాడు. వాడి అసలు పేరు ఏంటో తెలీదు- వాళ్ళమ్మ వాడిని 'బాబీ' అని పిలుస్తుంది కాబట్టి, మనం కూడా 'బాబీ' అందాం. వాడికి అల్లరెక్కువ. ఎప్పుడూ ఏదో ఒక తుంటరి పని చేసి వాళ్ళమ్మని విసిగిస్తూ ఉంటాడు.
ఒక రోజు ఎప్పటిలాగే, బాబీ స్నానం చేసి బడికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ స్కూలు కావడంతో, పదకొండు కల్లా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే అమ్మ బాబీతో - "బాబీ, సబ్బును ఏం చేశావు? పొద్దున్నే కదా కొత్త సోప్ తీశాను, ఇప్పుడు అది లేదేమిటి?" అని అడిగింది.
"నాకు తెలీదమ్మా, నేను స్నానం చేసినప్పుడు అక్కడే ఉంది"- అనేసి, బాబీ మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయి బొమ్మలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు.
"మరి ఎక్కడికి పోయింది?" మళ్ళీ అతని దగ్గరకు వచ్చి అడిగింది వాళ్ళమ్మ.
"నాకు తెలీదు మా. నువ్వు, నాన్ననో, అక్కనో, లేకపోతే పనిమనిషి ఆంటీనో అడుగు." అన్నాడు బాబీ, అమ్మ వైపుకి చూడకుండా.
వాళ్ళమ్మ ఇంక బాబీని అడగడం దండగ అనుకుని, వెళ్ళిపోయింది. సాయంత్రం అక్క కాలేజీ నుంచి రాగానే, వాళ్ళమ్మ మళ్ళీ ఆమెని అడిగింది సబ్బు గురించి.
"నాకెలా తెలుస్తుంది అమ్మా, పొద్దున్నే అందరికంటే ముందు స్నానం చేసింది నేనే కదా? నా తర్వాత మీరంతా చేసారు కదా..." -అన్నది బాబీ వాళ్ళక్క.
"ఓహో, అవునవును- చివరగా స్నానం చేసింది బాబీనే . వాడికే తెలియాలి" -అని, వాళ్లమ్మ "ఒరే బాబిగా, ఇలారా!" -అని పిలిచింది.
"ఆడుకోవడానికి వెళ్తున్నాను, విక్రం తో..." అని నసిగాడు బాబీ.
"వెళ్దువు గానీ, ఆ సోప్ ఏం చేశావు, చెప్పు మొదట..." అంది వాళ్ళమ్మ.
"నేనేం చేయలేదు అమ్మా...నిజం. మొన్న టీవీలో చూపించారే... ఏదో దయ్యం కథ? అది మనింటికి వచ్చి తీస్కెళ్లి పోయిందేమో...." అన్నాడు బాబీ.
"ఏరా, వేషాలేస్తున్నావు? దయ్యం వచ్చి సోపు ఎందుకు తీస్కెళ్తుంది?"
"ఏమో అమ్మా, దయ్యం దగ్గర సోప్ లేదేమో. మనింట్లో నువ్వు కొత్త సోపు తీయడం చూసి, తీసుకు వెళ్ళిందేమో."- అమాయకంగా అన్నాడు బాబీ.
"దయ్యం మనింటి చుట్టూ ఎందుకు తిరుగుతుంది?"
"నిన్న దయ్యం సీరియల్ వస్తూ ఉంటే కరెంటు పోయింది కదమ్మా, దాంతో అది ఇక్కడే ఉండిపోయి ఉంటుంది. పొద్దున్న మేము వెళ్ళగానే నువ్వు టీవీ ఆన్ చేసి ఉంటావు కదా, అప్పుడు మళ్ళీ టీవీలోకి వెళ్ళిపోయిందేమో"- బాగా ఆలోచించి చెప్పాడు బాబీ.
ఆ జవాబుకి అమ్మా, అక్కా ఇద్దరూ గట్టిగా నవ్వారు. అంతలో బాబీ వాళ్ళ నాన్న ఆఫీసు నుండి వచ్చేయడంతో కాసేపు, ఈ విషయం వదిలేశారు అందరూ. బాబీ ఆడుకోడానికి వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక, రాత్రి భోజనాల సమయంలో బాబీ వాళ్ళమ్మ నాన్నతో చెప్పింది - సోపు మాయమైన సంగతి.
"సబ్బే కదా, ఎందుకంత కంగారు , నీకు అసలు?" అన్నారు నాన్న. "నిజమేలెండి. ఏమిటో, కొంచెం వింతగా అనిపించి చెబుతున్నా, అంతే. ఐనా, బాబిగాడు మాత్రం భలే కథ చెప్పాడండీ -దయ్యం ఎత్తుకుపోయిందని..." అని నవ్వింది అమ్మ.
అమ్మ చెప్పటం పూర్తయ్యేసరికి, బాబి గాడు ఉన్నట్లుండి ఏడుపు మొదలుపెట్టాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.
"ఏరా బాబీ, ఎందుకు ఏడుస్తున్నావు?" - అని అడిగారు నాన్న.
"నాన్నా, మరే.. మీరు నన్ను కొట్టనంటే చెబుతాను..." అన్నాడు బాబీ ఇంకా ఏడుస్తూనే.
"చెప్పరా..ఎవ్వరం ఏమీ అనంలే..." అంది అమ్మ.
"ఆ సోప్ ఏమైందో నాకు తెలుసు" - అని ఆపాడు బాబీ.
"అనుకుంటూనే ఉన్నా. ఏం చేశావు?" - అంది అమ్మ.
"పొద్దున్న స్నానం చేస్తున్నప్పుడు సోపు తో ఆడుకుంటూ ఉంటే, అది జారి, కాలువలో పడిపోయింది. మీకు చెబితే తిడతారని, చెప్పలేదు.." అన్నాడు బాబీ.
"మరెందుకు రా ఇప్పుడు చెప్తున్నావు?" - అని అడిగింది అక్క ఆశ్చర్యంతో.
"ఏమో, ఇప్పుడు 'ఏమీ అనరులే' అనుకొని, చెప్పేసాను" అన్నాడు బాబీ అమాయకంగా.
"విషయం దాచిపెట్టేద్దాం అనుకున్నాడు. పాపం, వాడే చెప్పేశాడు! అమాయకపు బాబీ.." అని నవ్వింది అక్క.
అమ్మా, నాన్నా కూడా పెద్దగా నవ్వారు.
కొన్ని క్షణాలు అయోమయంగా చూసినా, ఆ తర్వాత బాబీ కూడా నవ్వటం మొదలుపెట్టాడు.