ఆదివారం కావటంవలన పార్కు అంతా చాలా సందడిగా ఉంది, పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు.
"పూజా...తమ్ముణ్ణి చూస్తూఉండు- పరిగెత్తకుండా, నెమ్మదిగా ఆడుకోండి.." కొద్దిగా దూరంగా ఉన్న సిమెంటు బెంచ్ పై కూర్చొని, పిల్లల ఆటల్ని గమనిస్తూ చెప్పింది పూజా వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్నగారుకూడా అక్కడే కూర్చొని ఉన్నారు.
"అలాగే మమ్మీ..." అని, మళ్ళీ తమ్ముడు బబ్లుతోపాటు ఆటలో మునిగింది పూజ.
చల్లని సాయంత్రం..గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పిల్లల ఆనందాన్ని ప్రతిబింబిస్తూ మెల్లగా ఊగుతున్నాయి పూల కొమ్మలు. పూజ-బబ్లు ఇద్దరూ తాము తెచ్చుకున్న బంతితో ఫుట్ బాల్ ఆడుతున్నారు. బబ్లు బంతిని గట్టిగా తన్నేసరికి, అది పోయి దూరంగా కూర్చొని ఉన్న బిచ్చగాడి ముందు పడింది. వాడి ముందు ఉన్న సత్తు పళ్లెం బంతి తాకిడికి దబ్బుమన్నది. ఆ పళ్లెంలో రూపాయి నాణాలు రెండు, రెండు రూపాయిల బిళ్ళ ఒకటి- మొత్తం మూడు రూపాయలు ఉన్నాయి.
బిచ్చగాడికి ఏమంత వయసు లేదు- పది, పన్నెండు సంవత్సరాల మధ్య ఉంటుందేమో. వాడు వేసుకున్న నిక్కరు పూర్తిగా మాసిపోయి ఉంది. ఒకకాలు చాపుకొని ఉన్నాడు- రెండో కాలుకు మోకాలి క్రింది భాగం ఖాళీగా ఉంది. లేచి బంతిని అందించే పరిస్థితిలో లేడు వాడు. అయినా విరిగిన తన కాలుకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న కర్రతోటే బంతిని పూజ వైపుకు నెట్టాడు. ఆ క్షణంలో వాడి మొహంలో చిన్న ఆనందం మెరుపులా వచ్చి మాయంఅయ్యింది- బహుశ: ’నేను కూడా బంతిని కొట్టాను’ అన్న సంతోషమేమో అది.
బంతిని అందుకొని, వాడివైపు ఒకసారి చూసింది పూజ. వంటి పైన చొక్కాలేదు, కడుపు నిండా తిని చాలా రోజులు అయినట్లు చెప్పకనే చెబుతున్నది అతని కడుపు. మళ్ళీ తమ్ముడితో ఆడుకోవటానికి వచ్చేసింది పూజ.
"ఐస్...ఐస్..." అక్కడున్న పిల్లల దృష్టిని తన బండిపైకి మరలించేందుకు గట్టిగా అరుస్తున్నాడు బండివాడు. "ఐస్...ఐస్..." మరోసారి గట్టిగా అరిచాడు. వాడి ప్రయత్నం ఫలించింది. "ఐస్ ..కొనుక్కుందామా.. అక్కా...?!" బండివాడి వైపు చూస్తూ అడిగాడు బబ్లు "డాడీని అడుగుదాం..పద.." అంటూ కొద్దిగా దూరంగా కూర్చుని ఉన్న అమ్మ-నాన్నల దగ్గరికి వెళ్ళారు పూజా, బబ్లూ.
"డాడీ.. ఐస్...కొనుక్కుంటాం..." అడిగాడు బబ్లు, వాళ్ళ నాన్నని.
"వద్దు జలుబు చేస్తుంది..." వారించింది వాళ్ళ అమ్మ.
"ఎప్పుడో ఒక్కసారే కదా..... కొనుక్కోనీ!" అంటూ పది రూపాయలునోటు తీసి బబ్లూకి ఇచ్చాడు వాళ్ళ నాన్న. "నువ్వుకూడా కొనుక్కో..." అంటూ మరొక పదిరూపాయల నోటు తీసి పూజకు ఇచ్చాడు.
"థాంక్యు..డాడీ..." అని చెప్పి, ఇద్దరూ పరుగెత్తుకుంటూ ఐస్ బండివాడి దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ఇంకా కొంతమంది పిల్లలు- చేతిలో పదిరూపాయల నోట్లతో- అక్కడ వాలిపోయిఉన్నారు. "ఐస్ ఎంత!?" అడిగింది పూజ.
"కప్ ఐస్ ఎనిమిది రూపాయలు, చాక్లెట్ ఐస్ పదిరూపాయలు" అని చెప్పి, మళ్లీ "ఐస్... ఐస్..." అంటూ గట్టిగా అరిచాడు బండివాడు.
ఒక నిమిషం ఆలోచించి "నాకు ఒక కప్ ఐస్ ఇవ్వు..." అంటూ పదిరూపాయలనోటు అందించింది పూజ.
"పది రూపాయలు ఉన్నాయిగా, చాక్లెట్ ఐస్ కొనుక్కుందాం! అది ఇంకా బాగుంటుంది!" చెప్పాడు బబ్లు.
"నాకు వద్దు- కావాలంటే నువ్వు కొనుక్కో" నవ్వుతూనే చెప్పింది పూజ. "మిగిలిన రెండు రూపాయలూ ఏమిచేస్తావ్..?!" అనుమానంగా అడిగాడు బబ్లు ఏం సమాధానం చెబుతుందోనని ఆసక్తిగా చూస్తున్నాడు బండివాడు.
అక్కడకు కొద్ది దూరంలో కూర్చొని ఉన్న బిచ్చగాణ్ణి చూపిస్తూ- "అతనికి ఇస్తాను- పాపం వాణ్ణి చూస్తుంటే- ఐస్ కాదుకదా, కనీసం అన్నంకూడా సరిగా తింటున్నట్లు లేడు. మన దగ్గర ఉన్న మొత్తం కాకపోయినా, మన అవసరాలకు సరిపోను ఉంచుకొని, మిగిలినదానితో లేనివారికి సహాయం చేయమని మా టీచర్ చెప్పారు. అందుకే ఆ రెండు రూపాయలూ అతనికి ఇస్తాను- ఏదో ఒక చిన్న సాయం..." అన్నది పూజ.
బబ్లుతో పాటు అక్కడ ఉన్నపిల్లలు, బండివాడు కూడా ఆసక్తిగా వింటున్నారు. బబ్లుకి ఏదోకాస్త అర్థం అయినట్లుంది.
"నాకు కూడా కప్ ఐస్ ఇవ్వు!" అంటూ బండివాడికి పదిరూపాయలనోటు అందించాడు బబ్లు. "నేను కూడా రెండు రూపాయలు అతనికి ఇస్తాను" అని అక్కతో చెబుతూ.
అక్కడే ఉండి, పూజ చెప్పింది విన్న ఆ పిల్లలందరూ "మాకు కూడా కప్ ఐస్ ఇవ్వు!" అని అడిగారు బండివాడిని. పూజవైపు చూస్తూ "మేము కూడా రెండు రూపాయలు అతనికి ఇస్తాం!" అని చెప్పారు. అందరూ వెళ్ళి, తమవద్ద మిగిలిన రెండురూపాయల్ని బిచ్చగాడి పళ్ళెంలో వేశారు. త్వరలోనే వాడి పళ్ళెం రెండు రూపాయల బిళ్ళలతోటీ, వాడి మనసు ఆనందంతోటీ నిండిపోయాయి.
ఐస్ బండివాడు కూడా వచ్చి, ఒక ఐస్ ను బిచ్చగాడికి ఇస్తూ- "తీసుకో! డబ్బులు ఏమీ వద్దులే!" అన్నాడు. ఆ క్షణంలో రెండుకన్నీటి బొట్లు వాడి చెంపలపైనుండి మెల్లగా క్రిందికి జారాయి.