వెంటనే లఘుపతనకుడు చాలా వేగంగా ఎగురుకుంటూ పోయి, యీ సంగతినంతా మంధరుడితోటీ, హిరణ్యకుడితోటీ చెప్పింది. ఆపైన అది హిరణ్యకుడితో "మనం తొందరగా పోవాలి. నువ్వు నాఅంత వేగంగా రాలేవు- ఇంతలో ఏమి అవుతుందో తెలీదు. అందుకని, నువ్వు నా వీపు మీద ఎక్కు. నిముషంలో నిన్ను అక్కడికి చేరుస్తాను" అని, దానిని ఒప్పించి , తన పైన కూర్చోబెట్టుకున్నది.

ఇక దాని రెక్కలు 'రింగ్, రింగ్' అని శబ్దం చేస్తూండగా, అది బాణంలాగా దూసుకొని- పోయి, చిత్రాంగుడి దగ్గర వాలింది. వెనువెంటనే హిరణ్యకుడు చిత్రాంగుడి కట్టుత్రాళ్లను తెగకొరికి కాపాడి- “మిత్రమా, నువ్వు చాలా తెలివిగలవాడివి గదా, ఈ వలలో ఎట్లా చిక్కుబడ్డావు?” అని అడిగింది.

జింక ఏదో అనబోయేంతలోనే లఘుపతనకుడు దాన్ని వారించి- “మనం ఇక్కడ నిలవకూడదు. ముచ్చట్లు మళ్లీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ముందు లేచి ఇక్కడి నుండి పదండి!" అని, వాళ్లను బయల్దేర-దీసింది. ఆపైన అది వాటికి దగ్గరగా పైన ఆకాశంలో ఎగురుకుంటూ పోసాగింది.

నడుస్తూ-నడుస్తూ చిత్రాంగుడు హిరణ్యకుడితో- "ఎంత తెలివైనవాడికైనా, తెలివి తక్కువవాడికైనా- దు:ఖమో, సుఖమో- ఏ సమయంలో ఏది అనుభవించాలో దాన్ని అనుభవించక తప్పదు. సుఖ దు:ఖాలన్నవి, పుట్టిన ప్రతి ప్రాణికీ ఆ పుట్టుకతోబాటే ఏర్పడతాయి. నేను గతంలో చేసుకున్న కర్మ ఎలాంటిదోగాని, చాలా సార్లు ఇట్లాంటి ఆపదలకే లోనయ్యాను”-అని తన ఆత్మకథను చెప్పసాగింది.

“నాకు ఆరు నెలల వయసున్నప్పుడు, నేను మా జాతి వారితో కలిసి తిరుగుతుండగా, ఒక వేటగాడు మాకు తెలీకుండా వచ్చి, వలపన్ని, మంచి పచ్చికను తెచ్చి ఎరగా పెట్టి, కొంత దూరాన- పొదమాటుగా కూర్చొని, చూడసాగాడు. నేనేమో పిల్లతనం కొద్దీ మా మందను విడిచి ముందు పరుగెత్తుతూ, నాలుగు కాళ్లతోటీ ఎగురుకొని దాటుతూ పోయి, అక్కడ ఎరగా పెట్టిన పచ్చికను చూసి, మేయబోయి, ఆ వలలో చిక్కుకున్నాను.

వెనువెంటనే నేను భయపడి అరవటంతో, మా మందలోని జింకలన్నీ తలలెత్తి, చెవులు రిక్కించి చూసి, మరుక్షణంలో బెదిరి, బండరాతిమీద కొట్టిన కుండ పెంకుల మాదిరి కకావికలై, నలుదిక్కులకూ పారిపోయాయి. ఆ తర్వాత వేటగాడు పొద మాటు నుండి బయటికి వచ్చి, నా దగ్గరే కూర్చున్నాడు."

"నేను చిన్న పిల్లను, జింకను, మా మందనుండి విడిపోయిన ఒంటరిని, వలలో చిక్కుకొని ఉన్నాను, పక్కనే యముడిలాంటి వేటగాడు కూర్చున్నాడు - ఇక నేనేం చెప్పాలి? అప్పటికే నా ప్రాణం మూడు వంతులు పోయింది. తర్వాత వాడు ఒక తాడును నా మెడకు కట్టి, నన్ను పట్టుకొని, నాకు నొప్పి పుట్టకుండా ఆ వల త్రాళ్లను తప్పించి, నన్ను విడిపించాడు. నాకు ఇంకా ఆయుష్షు మిగిలిఉన్నది- కనుకనే వాడు నన్ను చంపలేదు - నన్ను భుజాన పెట్టుకొని పోయి, ఆ దేశపు రాజకుమారుడికి కానుకగా ఇచ్చాడు."

"ఆ రాజకుమారుడు నన్ను తమ గుర్రపుశాలకు ఎదురుగా ఒక కొట్టంలో కట్టేయించి, నాకు గడ్డీ వగైరాలు ఎప్పటికప్పుడు అందించేలా అక్కడి సేవకులకు ఆజ్ఞాపించి, నాపైన గల అనురాగం చేత, ప్రతిరోజూ నా యోగక్షేమాలు విచారిస్తూ వచ్చాడు."

"కాలం గడిచేకొద్దీ నాకు బెదురుపోయింది. మనుష్యులకు మచ్చిక అయ్యాను. ఇక రోజూ కావలివాళ్ళు రాజకుమారుని ఆజ్ఞతో నా కట్టు వదిలి తిరుగవిడిచేవాళ్లు. నేను ఇష్టంవచ్చిన చోట్లల్లా స్వేచ్ఛగా తిరిగేదాన్ని. రోజంతా తోపులలోను దొడ్లలోను లేత పచ్చికను మేసి, కొలనులలో నీళ్లు త్రాగి, చల్లటి చెట్టు నీడన కొంచెంసేపు నెమరువేస్తూ పడుకొని, చివరికి సాయంకాలానికి- నన్ను కట్టివేసే చోటుకు వచ్చి చేరుకునేదానిని."

"ఒకరోజున నేను ఆ పట్టణవీధుల్లో సంచరిస్తుండగా పిల్లలు కొందరు గుంపుగా నా వెంటపడి అరుస్తూ, `కో' అని కూతలు పెడుతూ, తరిమారు. నేను బెదిరి, చెంగుమని గెంతులు వేసుకొని, దగ్గరలోనే ఉన్న రాజోద్యానవనం ఒకదానిలోకి దూరాను. అక్కడే ఉన్న అంత:పుర స్త్రీలు నన్ను పట్టుకొని-పోయి, రాజ భవనంలోనే, రాకుమారుడు పడుకోనే గదికి దగ్గరగా, ఒక స్తంభానికి కట్టిపెట్టారు."

"ఆనాటి రాత్రి కళ్లు మిరిమిట్లు గొలిపే మెరుపులతో, చెవికి చిల్లులు పడతాయేమోనన్నంత భీకరమయిన ఉరుములతో, కడవలతో వంచి పోసినట్లు నిరంతరమయిన ధారగా, 'భూమి-ఆకాశం ఏకమైనాయేమో' అన్నట్లు కమ్మిన నల్లటి మబ్బులతో- గొప్ప వర్షం కురిసింది. ఆ వర్షాన్ని చూసి నేను చాలా ఉత్సాహపడ్డాను."

"ఆ సంతోషంతో, మనుషుల భాషలో "ఆహా! ఇలా వాన చినుకులు పడుతుంటే, మెల్లగా చల్లగాలి వీస్తుంటే, మా మందతోబాటు చెంగు చెంగున గెంతుతూ, పరుగులు తీస్తూ తిరగగలిగే భాగ్యం నాకెప్పటికి కలుగుతుందో!" అని నాలో నేను అనుకున్నాను."

"అదే సమయానికి రాజకుమారుడు వసారాలోకి వస్తూ, నా మాటలు విని, అన్ని దిక్కులా కలయజూశాడు. చూసి, తన వెనుక ఉన్న పరిచారకుడితో "అరే, ఇక్కడ వేరే వాళ్లెవ్వరూ లేరు. ఇందాకటి మాటలు నువ్వు కూడా విన్నావు కదా? -ఇదేం వింత? ఈ జింక పిల్ల ఒక్కటే గదా, ఇక్కడ ఉన్నది? ’ఇదే అట్లా మాట్లాడింది’ అని నాకు అనిపిస్తున్నది. నువ్వేమంటావు?" అన్నాడు."

"'ఏలినవారి మాట అబద్ధం కాదు. మనం విన్న మాటల్లోని ఆ కోరిక మనిషికి పుట్టదు' అని బదులిచ్చాడు పరిచారకుడు."

"'ఔనౌను, సరిగ్గా చెప్పావు!' అని రాజకుమారుడు నోరు, ముఖం కడుగుకొని పోయి పడుకున్నాడు. ఆ పైన మరునాడు కొలువు కూటమికి వచ్చి కూర్చోగానే, అతను జ్యోతిష్యుడు ఒకడికై పిలువనంపి, జరిగిన సంగతిని మొత్తం వివరించాడు. అది విని ఆ పండితుడు- "జింక మనుష్య భాషను మాట్లాడటం చాలా అనర్థాన్ని సూచిస్తుంది. దీనికోసం జపాలు, హోమాలు చేయించండి. ఆ జింక ఉన్న ఇంటిలో క్షణ కాలం కూడా నిలువరాదు" అని చెప్పాడు."

"అది విన్న రాజకుమారుడు అంత:పురం నుండి నన్ను తెప్పించి "ఈ జింకను దూరంగా అడవిలో విడిచేసి రండి " అని సేవకులను ఆజ్ఞాపించాడు. సేవకులు నన్ను పట్టుకొని పోయి అడవిలో వదిలిపెట్టారు. నేనక్కడ అడవిలో తిరగటం మొదలుపెట్టానో, లేదో- ఒక వేటగాడు నన్ను తరుముకొని వచ్చాడు. నేను భయపడి పారిపోయి, మీ ఆశ్రయం సంపాదించుకున్నాను."

"ఇవాళ్ల ఇక్కడ, వలలో చిక్కి, మళ్లీ నీ దయవల్ల బ్రతికాను. ఇప్పటికీ ముప్పు తప్పిందనలేము- ఇక ముందు జరగనున్నదేమిటో తెలియదు కదా?! నువ్వెంత తెలివైన వాడివో నాకు తెలుసు. నీ కథనంతా మంధరుడు, లఘుపతనకుడు చెప్పారు నాకు. నువ్వు పడ్డ కష్టాలు మాత్రం, ఎంత చెబితే తీరతాయి? ఇన్ని మాటలక్కరలేదు- విధికి లోబడని ప్రాణి ఈలోకంలోనే ఉండదు." అని తన కథను వినిపించింది, చిత్రాంగుడు.

అలా ముచ్చటించుకుంటూ, "మంధరుడు మన రాక కోసం వేచి ఉంటాడు. మనల్ని చూసేంతవరకూ అతని ప్రాణాలు కుదుటపడవు" అని మాట్లాడుకుంటూ వస్తున్నారు వాళ్లిద్దరూ.

ఆలోగా, అక్కడ మంధరుడు తన మిత్రులందరూ పోయిన వైపుకే చూసు-కుంటూ- "పోయిన వాళ్లు ఇంత వరకూ రాలేదు, ఎందుకు? వాళ్లు పోయిన పని సక్రమంగా జరిగిందో, లేదో? పని జరిగితే ఇంత ఆలస్యం ఎందుకౌతుంది? అయ్యో, ఎట్లాంటి సమాచారం వినాల్సి వస్తుందో, ఏమో! ఏంచేయాలి?" అని ఆందోళన చెందటం మొదలు పెట్టింది. కొంతసేపటికి అది ఇక అక్కడ నిలువలేక, మెల్లగా తనూ ఆ దిశలో నడవడటం మొదలుపెట్టింది.

వెనక్కి తిరిగి వస్తున్న హిరణ్యకుడు మొదలైన మిత్రులు, మధ్య దారిలోనే ఎదురయ్యారు దానికి- అది సంతోషంతో "అయ్యలారా! వచ్చారా! నా కడుపులో పాలు పోసినట్లు అయ్యింది. ఇక త్వరగా పదండి" అని, తను కూడా వాళ్లతోబాటు వెనక్కి రాసాగింది.

అప్పుడు హిరణ్యకుడు ఆ తాబేలుతో "ఒక నిముషం అటు-ఇటూగా రాక మానము కదా? ఇంతలో ఏం మునిగిపోతుంది? ఇట్లాంటి సాహసము చేయకూడదు. ఇక్కడ ఏదైనా ఆపద ఎదురైతే, మేము ఎలాగో ఒకలాగా తప్పించుకోగలము- కానీ నీళ్లల్లో పోయినట్లు, నేలమీద నువ్వు వేగంగా పోలేవు- అందువల్ల 'ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం మంచిపని' అని నాకైతే ఏమాత్రం అనిపించటం లేదు." అన్నది.

అప్పుడు మంధరుడు "మీరు ఇంత ఆలస్యం చేశారు. మీలో ఒకరైనా ముందుగావచ్చి, జరిగిన సంగతి నాతో చెప్పవచ్చు కదా? అదీ లేదు! పై పెచ్చు, 'పోయినవాళ్లు ఏమైనారో, ఎలాంటి ఆపదలో చిక్కుకున్నారో' అని నా మనసులో ఆదుర్దా ఎక్కువైపోయింది. నువ్వే చెప్పు, ఇక అక్కడే ఎట్లా ఉండగలను? మిమ్మల్ని చూసిన తర్వాత గానీ నా గుండె కుదుటపడలేదు" అని బదులిచ్చింది.

అవన్నీ ఇట్లా మాట్లాడుకుంటున్న సమయానికి, అక్కడ వేటగాడు తను వల పన్నిన చోటికి వెళ్లి చూశాడు . వలలో పడిన జింక వల త్రాళ్లను తెంచుకొని పారిపో-యిందని కనుగొని, వాడు ఆశ్చర్యపడ్డాడు. ఆపైన వాడు విల్లు ఎక్కుపెట్టి చేతపట్టుకొని , అడుగుల జాడ చూసుకుంటూ, జింక పోయిన దారిలోనే రాసాగాడు .

వాడి రాకను ముందుగానే చూసిన లఘుపతనకుడు "అయ్యో ! మాటల్లో పడి -మీరంతా పెండ్లి నడక నడుస్తున్నారు. వేటగాడేమో, ఇదిగో- వెంబడించుకొని మీదికి వచ్చేశాడు! మాటలకు సమయం లేదు! వెంటనే పారిపోండి!" అని అరిచింది.

మరుక్షణంలో హిరణ్యకుడు ఒక బొరియలోకి దూరింది. చిత్రాంగుడు పారిపోయింది. మెల్లనైన తన స్వభావానికి భయం కూడా తోడవ్వగా , మంధరుడు మాత్రం- నడిచేందుకు కాళ్లు రానట్లు- మెల్లగా పోసాగింది.

మంధరుడు - ఆపద

'తనను చూసి జింక పారిపోయిందే' అని వేటగాడు బాధపడ్డాడు. అయితే ఆ దగ్గరలోనే వాడికి తాబేలు కనిపించడంతో, వాడు కొంత సంతోష పడి , దాని దగ్గరికి వెళ్లి, పట్టుకొని, దాన్ని తన విల్లుకొనకు కట్టుకొని, ఆ ధనస్సును భుజాన పెట్టుకొని ఇంటిత్రోవ పట్టాడు. …
('మిత్రలాభం' ముగింపు వచ్చేమాసం.)