ముసలి వితంతువు ఒకావిడకు ఒక్కడే కొడుకు. అతనికి రాత్రిపూట చూపు సరిగా ఆనేది కాదు. అయితే ఆ సంగతిని దాచిపెట్టి, ఆమె తన కొడుక్కు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన మంచి పిల్లను చూసి పెండ్లి చేసింది. "తర్వాత కోడలికి తెలిసినా ఏమీ అనదు. ఎటొచ్చీ ఈ సంగతిని ఆ పిల్ల అన్నదమ్ములకు మాత్రం తెలియనివ్వకూడదు" అనుకున్నది గడుసు ముసలమ్మ.

పెళ్లైన తర్వాత సంక్రాంతి పండగ వచ్చింది. పండక్కి కొత్త అల్లుడిని ఆహ్వానించారు అత్తింటివారు. గడుసు ముసలమ్మ కొడుకును ముందుగానే హెచ్చరించింది - "జాగ్రత్తరా నాయనా! చీకటి పడిందంటే నీకు ఏ ఒక్క వస్తువూ కనబడదు. అందుకని చీకటిపడ్డ తర్వాత ఎక్కువగా బయట తిరక్కు. పగటిపూట మాత్రమే ప్రయాణించు. మీ మామగారింట్లో ఒక్క రాత్రికి మించి ఉండకు" అని.

చీకటి పడకముందే మామగారింటికి చేరుకోవాలనే ఆత్రం కొద్దీ అల్లుడు చాలా వేగంగానే ప్రయాణించాడు; కానీ ఆ ఊరి పొలిమేరలు చేరేసరికి ప్రొద్దుగుంకి పోయింది. రేచీకటి అల్లుడికి ఇప్పుడు ఇక ఏమీ కనిపించటం లేదు. తల్లి ఉపదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని, తడుముకుంటూనే అతను ఒక ఎత్తైన స్థలాన్ని చేరుకొని, అక్కడే కూర్చుండిపోయాడు - ఎలాగో ఒకలా రాత్రి గడిస్తే చాలు’ అనుకుంటూ.

అయితే దురదృష్టం కొద్దీ, అతను కూర్చుండిన ఆ స్థలం వేరేదేదో కాదు - అతని అత్తింటివారి పేడ దిబ్బనే! అల్లుడు అలా కూర్చున్నాడో లేదో, అత్తగారు ఆ నాటి చెత్తా చెదారం, పేడ అన్నీ తీసుకొచ్చి దిబ్బలోకి వేసేసింది - సూటిగా అల్లుడి నెత్తిమీదే!

అకస్మాత్తుగా తలపై ఏదో వచ్చి పడేసరికి భయపడ్డ అల్లుడు ‘అయ్యో!’ అని మొత్తుకున్నాడు - అత్తగారు నిర్ఘాంతపోయి చూస్తే - ఏముంది? అక్కడ తమ- గౌరవనీయుడైన అల్లుడు- ఉన్నాడు, నిండా పేడలో మునిగి! "కొత్త అల్లుళ్లను దేవతలతో సమానంగా చూడాలి, మరి తనేం చేసింది? అయ్యో ఎంత అపచారం!" అని అత్తగారి మనసు ఘోషించింది. పశ్చాత్తాపంతో ఆమె తన ముఖాన్ని చీర చెంగులో దాచుకొని, ఇంటికి పరిగెత్తింది.

దారిలో ఆమెకు తన చిన్నకొడుకు-పదేళ్లవాడు- కనబడ్డాడు. వాళ్ళ బర్రెల్ని వాడు ఇంటికి తోలుకు పోతున్నాడు. అమె గబగబా వాడి దగ్గరకు పోయి - "ఒరే, చూడు, మీ కొత్త బావ వచ్చాడు - కానీ ఎందుకో మరి, ఆయన మన పేడ దిబ్బలో కూర్చుని ఉన్నాడు. మూత్ర విసర్జనకు వెళ్ళి ఉంటాడు బహుశ:. అయితే నేను ఆయన్ని గమనించకుండా చెత్త, పేడ అంతా ఆయన నెత్తినే కుమ్మరించాను. ఆయన చాలా కోపగించుకొని ఉండాలి. నువ్విప్పుడు వెంటనే పరిగెత్తిపోయి, ఎలాగోలా ఆయన్ని శాంతపరిచి, ఒప్పించి, మెల్లగా మనింటికి పిలుచుకురావాలి. ఆయనకి నువ్వంటే ఇష్టం. నీ మాట కాదనడు". అన్నది.

పిల్లవాడికి కూడా కొత్త బావ అంటే చాలా ఇష్టం. వాడు " ఓ బావా? ఎక్కడున్నావ్ నువ్వు?’ అని దారంతా అరుచుకుంటూ పరిగెత్తాడు. వాడు వెళ్లేసరికి, కొత్త బావ ఇంకా పేడదిబ్బలోనే కూర్చుని ఉన్నాడు.

"నువ్విక్కడ ఎందుకు కూర్చుని ఉన్నావు? రా, మన ఇంటికి పోదాం" అని వాడు కొత్త బావ చేయి పట్టుకొని లాగాడు. కొత్త బావకి రేచీకటి ఉన్నది తప్పిస్తే, తెలివి బాగానే ఉన్నది. అతనన్నాడు - "నేనిక్కడ ఊరికే కూర్చోలేదురా బాబూ! మీ దిబ్బలోంచి ఎన్ని బళ్ల ఎరువు అవుతుందో లెక్కగడుతూ ఉన్నాను. ఒకటి రెండెకరాలకు సరిపడా ఎరువు ఉంది ఇక్కడ". అలా అంటూనే అతను ఆప్యాయంగా పిల్లవాడి భుజంపై చేయి వేసి అతనితో పాటు నడవటం మొదలుపెట్టాడు. కొంచెం దూరం పోయేసరికి బర్రెలు అతని కళ్లముందు మసక మసకగా భూతాల మాదిరి కనబడ్డాయి. "ఓయ్! ఇవేమిటి?" అని అడిగాడతను.

"అవి మన బర్రెలే. నేను వాటిని మేపటం కోసం అడవికి తీసుకెళ్లాను. ఇప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నాయి." అన్నాడు బావమరిది.

"ఓహో... బాగున్నై బాగున్నై. పెద్దగా, ఆరోగ్యంగా ఉన్నై" అన్నాడు కొత్త అల్లుడు ఒక బర్రెను అదిమి, దాని తోకను చేతిలోకి తీసుకుంటూ. ఇక ఆ పైన అతను బర్రె తోకను ఆధారంగా పట్టుకొని ధైర్యంగా నడవటం మొదలెట్టాడు- ఏమీ కనబడకపోయినా.

దారి చూపే ఆ బర్రె ధాన్యం నిలువచేసే కల్లాల పక్కనుండి పోతూండగా, కాలుజారి నేరుగా ధాన్యపు కల్లంలో కొత్తల్లుడు పడిపోయాడు. "ఏమైంది? మీకు చూపు సరిగ్గా ఆనదా, ఏమిటి? అన్నాడు బావమరిది ఒకింత అనుమానంగా.

"అయ్యో, నాకు బాగానే కనబడుతుంది. మీ ధాన్యపు కల్లం ఎంత లోతున్నదో చూడాలని ఇందులోకి దూకాను అంతే. మా ఇంట్లో ఇలాంటిదే ఒకటి చేయిస్తున్నాను. ఊ, ఇప్పుడు ఓసారి చేయి అందించు - అద్దీ, అలాగ. నువ్వు మంచి బావమరిదివోయ్!" అంటూ రేచీకటి అల్లుడు మళ్లీ నేలమీదికి ఎగబ్రాకాడు. ఇక అక్కడ అతనికి ఒక గోడ దొరికింది. ఆ గోడను ఆధారంగా చేసుకొని, దాన్ని వదలకుండా పట్టుకొని నడవటం మొదలెట్టాడతను.

"బావా, ఇదేంటి? నువ్వు ఇట్లా గోడను పట్టుకొని గోడ వెంబడే నడుచుకొని వస్తున్నావు? నీ కళ్లు సరిగ్గానే ఉన్నాయికదా?" అడిగాడు చిన్న బావమరిది.

"ఛ, ఛ.! నువ్వేం మాట్లాడుతున్నావు? ఏదో ముచ్చటకొద్దీ మీ ఇంటి ప్రహరీగోడ ఎంత పొడవున్నదో కొలుస్తున్నాను నేను." అని సర్దుకున్నాడు అల్లుడు.

ఇంటి వాకిట్లోనే అత్తగారు గొర్రె పొట్టేలును ఒకదాన్ని కట్టివేసి ఉంచారు. బావా బావమరుదులు ఇద్దరూ ఇంటికి చేరుకోగానే హడావిడిగా లోనికి పోబోయిన అల్లుడు, నేరుగా ఆ పొట్టేలు మీదికే ఉరికాడు. ఏమీ అర్థం కానట్లు చెలరేగి, కొమ్ములతో పొడిచి పొడిచి వదిలింది ఆ పొట్టేలు, కొత్త అల్లుడనైనా చూడకుండా.

కొత్తబావ అరుస్తూ కిందపడిపోగానే బావమరిది పొట్టేలును గట్టిగా ఓ దెబ్బ వేసి తరిమాడు. ఆపైన, బావగారికి లేచేందుకు చేయి అందిస్తూ "అక్కడ పొట్టేలు ఉండగా చూసుకోలేదా బావా?" అని అడిగాడు.

"ఓహ్, నేను దాన్ని చూడకేం? దాని వాలకం నచ్చి, ఓసారి గట్టిగా రుద్ది ముద్దు చేద్దామనుకున్నాను. కానీ చూడు, అది ఏం చేసిందో! కొత్తవాళ్లతో ఇలా ప్రవర్తించమని నేర్పిస్తారా, మీరు?" అన్నాడు అల్లుడు.

ఆ పాటికి చీకటి పడిపోయింది. అందరూ నేల మీద వరసగా భోజనాలకు కూర్చున్నారు. వాళ్లముందు పీటలమీద వడ్డించిన విస్తళ్లున్నాయి. కొత్త అల్లుడు ఇంటికి వచ్చిన ప్రత్యేక సందర్భం కనుక స్వయంగా అత్తగారే వంగి వంగి వడ్డిస్తున్నారు. ఆవిడ లేచి నిలబడ్డప్పుడూ, వంగినప్పుడూ, నడిచినప్పుడూ, అడుగు అడుగుకూ ఆమె ధరించిన వెండి ఆభరణాలు ఘల్లు ఘల్లుమంటున్నాయి. అల్లుడిని అకస్మాత్తుగా భయం ఆవరించింది. "ఇందాక తనను కుమ్మిన పొట్టేలు, ఎలా వచ్చిందో మరి, మళ్లీ ఇక్కడికి వచ్చింది - తనను కుమ్మబోతున్నది" ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం విస్తరి కింద ఉన్న పీట అల్లుడి చేతిలోకి వచ్చేసింది. అతను దాన్ని గిరగిరా తిప్పి తన ముందుకొచ్చి నిలబడ్డ ఆకారం మీదికి విసిరాడు బలంగా. అత్తగారు కీచుమంటూ వంటగదిలోకి పరిగెత్తింది, దాన్నించి తప్పించుకొనేందుకు. తను సాయంత్రం చెత్త, పేడ వేసినందుకుగాను అల్లుడు తనపై కోపగించుకుంటున్నాడని ఆవిడ బలంగా నమ్మింది.

ఇక, "తన భార్య కాకుండా అత్తగారు వడ్డించినందుకు బావ నొచ్చుకున్నాడని మిగిలిన బావమరుదులు అనుకున్నారు. వెంటనే అతని భార్య బయటికి వచ్చి, మిగిలిన వడ్డనంతా నిర్వహించి, అయిందనిపించింది.

భోజనాలైనాక అందరూ వేర్వేరుచోట్ల పడుకునేందుకు వెళ్ళిపోయారు. అల్లుడు, కూతురు పడుకునేందుకు ఒక చిన్న గదిని కేటాయించారు. చిన్న బావమరుదులంతా బయట వరండాలో పడుకున్నారు. మధ్యరాత్రి అల్లుడుగారికి మెలుకువ వచ్చింది - "మూత్రాశయం నిండిపోయింది. ఖాళీ చేసుకోనిదే పని జరగదు." కానీ ఎలాగ?

అత్తగారింటిని తనకు గుర్తున్నంతమేర గుర్తుకుతెచ్చుకొని, గోడలు పట్టుకొని కొలుచుకుంటూ, అతి కష్టం మీద స్నానాల గదిని కనిపెట్టి, పని కానిచ్చాడు. అయితే ఎంత గుర్తుపెట్టుకుందామనుకున్నా నిద్రమత్తులో వెనక్కి రావటంలో దారితప్పి, తమ గదికి బదులు అత్తగారు-మామగారు పడుకున్న గదిలోకి చేరాడు. తడుముకుంటూ తడుముకుంటుండగా అతని చేతికి అత్తగారి కాళ్లు దొరికాయి. భార్యకాళ్లే అనుకున్నాడతను, పాపం.

కాళ్లనెవరో పట్టుకొనే సరికి అత్తగారికి గబుక్కున మెళుకువ వచ్చింది. ఆమె కెవ్వున అరిచింది ‘ఎవరది?’ అని.

"నేను, నేను " అన్నాడు కొత్తల్లుడు.

‘ఇంత రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు?’ అన్నది ఆవిడ.

అల్లుడికి తన తప్పు అర్థమైంది ఈ పాటికి. అతనన్నాడు "అబ్బే, మరేంలేదు. మీరు అన్నం వడ్డిస్తుండగా నేను మీ మీదకి పీట విసిరేశానుగదా, అందుకు నేను చాలా చింతిస్తున్నాను. మీరు నన్ను క్షమించాలి. నేను మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలనుకున్నాను, అడిగాను. అంతే. నావల్ల తప్పు జరిగింది. క్షమించండి." అని.

అల్లుడి మాటలు విని అత్తగారికి మరింత సిగ్గైంది. "అయ్యో ఏమీ ఫరవాలేదులే. వెళ్లి పడుకోండి" అన్నది.

కానీ అల్లుడు ఆమె కాళ్లు వదలలేదు. "నన్ను క్షమించాలి. క్షమించాల్సిందే" అంటున్నాడు కళ్లు మూసుకొని, తల ఊపుకుంటూ.

ఆ సరికి భార్య మేలుకున్నది. "అయ్యో!, ఈయన రాత్రిపూట ఒంటేలుకని లేచి, వెళ్లి మా అమ్మను లేపి మాట్లాడుతున్నాడు. ఇరుగుపొరుగు వాళ్లు ఏమనుకుంటారు?" అని ఆమె లేచి వచ్చింది. "పద, పద. మనం ఈ సంగతులన్నీ తెల్లవారాక మాట్లాడుకుందాం. ఇప్పుడు పడుకోవాలి, పద." అని రెక్క పట్టుకొని తమ గదిలోకి లాక్కుపోయింది.

రాత్రి గడిచి తెల్లవారేసరికి అల్లుడి కష్టాలన్నీ తీరాయి. కొత్తల్లుడి ఠీవీ, దర్పం తిరిగి వచ్చేశాయి. ఇంట్లో వాళ్ళందరి ముఖాలూ కళకళలాడాయి. అందరినీ మురిపించి, ఇంకా సాయంత్రం కాకుండానే ఎవ్వరెంత చెప్పినా వినకుండా ఇంట్లో పనులున్నాయని చెప్పి బయలుదేరాడు కొత్తల్లుడు. చీకటిపడితే వేరే ఎక్కడ ఆగినా పరవాలేదు - ఇంకొక్క రాత్రిని ఇక్కడ గడిపేదెలాగ, మరి?