కొత్తపల్లి పత్రిక ప్రారంభమై సంవత్సరం గడిచింది!

ఈ సంవత్సర కాలంలో అనుకున్నంత గొప్పగా కాకపోయినా, కొంత వరకు బాగానే నడిచింది పత్రిక. ఇప్పుడు ప్రతి నెలా నాలుగువందల మందికి పైగా పత్రికను చదువుతున్నారు. ఒక వంద పత్రికలు మా దగ్గరే అచ్చవుతున్నాయి; ఇరవై నుండి ముప్ఫై మంది వరకూ పత్రికను పూర్తిగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కొత్తపల్లి పత్రిక గురించి దాదాపు అన్ని వార్తా పత్రికలూ ఏదో ఒక రూపంలో, తమకు నచ్చినట్లు, ప్రశంసిస్తూ రాసుకున్నాయి. ఒక దినపత్రికైతే, పేరు చెప్పకుండా ఏకంగా కొత్తపల్లి పత్రికలోని కథను, బొమ్మను వాళ్ల చిన్న పిల్లల పేజీలో ముద్రించుకున్నది!

పత్రిక కోసం హైదరాబాదు శాలిబండ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులైన శర్మ గారు, ఆదిలాబాదు జిల్లా భావురావుపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు రాంరెడ్డి గారు చొరవ తీసుకొని, వాళ్ల బళ్లల్లో పిల్లల చేత కథలు రాయించి, బొమ్మలు వేయించి, పాటలు పాడించి పంపారు. హైదరాబాదు జె.ఎన్.టి.యు పైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల బృందం ఒకటి కొత్తపల్లిలోని కథలకు చిత్రాలు వేసే బాధ్యతను నిర్వహించటం మొదలుపెట్టింది. ఇంకా అనేకమంది రచనలు పంపటం మొదలుపెట్టారు. ఇలా చాలా మంది మిత్రులౌతున్నారు.

అయినా ఇంకా వెలితి ఉన్నది.

పత్రికను చదివే వాళ్లందరికీ చాలా కథలు, పాటలు వచ్చు. అలవోకగా తెలుగులో రాసి పంపే వీలుంటే అందరూ విరివిగా రాస్తారు కదా! కొత్తపల్లి మాధ్యమంగా అలాంటి ఒక వ్యవస్థను అందుబాటులోకి తేగలిగితే, అలా ఇంటర్నెట్లోకి మరింత తెలుగు రాగలదు కదా, అని ఒక ఆలోచన.

కొత్తపల్లి పత్రిక వెనుక చాలామంది పిల్లల కృషి ఉన్నది. రచనలు చేయటం, సేకరించటమే కాదు, వాటిని టైపు చేయటం, తప్పులు సరిచూడటం, బొమ్మలు వేయటం, వాటిని ఒక క్రమంలో కూర్చటం - ఇవన్నీ పిల్లలే చేస్తున్నారు. వీళ్లలో ఎవరి కష్టాలు వారివి! కొందరి సమస్యలకు కుటుంబ కలహాలు కారణమైతే, కొందరికి అసలు కుటుంబాలు లేకపోవటం కారణం! కొందరివి ఆరోగ్య సమస్యలైతే, కొందరివి పై చదువులకు వీలుకాని పరిస్థితులు! వీళ్లను సమయానుకూలంగా ఆదుకొనే దాతలు కొత్తపల్లి మాధ్యమంగా ముందుకు వస్తే బాగుండు కదా, అని ఇంకో ఆలోచన.

కొత్తపల్లి పత్రిక మరింత అందంగా, ఆకర్షణీయమైన రంగులతో రావాలని చాలామంది సూచించారు. పనుల ఒత్తిడి వల్ల ఇన్నాళ్లూ అది సాధ్యం కాలేదు. రాబోయే కొన్ని నెలల్లో రంగుల పరంగానూ, లేఔట్ పరంగా కూడానూ మార్పులు తేగల్గితే బాగుండుకదా, అని మరో ఆలోచన.

కొత్తపల్లి పత్రికను గత నెల నుండి రంగుల్లో ముద్రిస్తున్నాం. అయితే పత్రికను సమయానికి పంపే వ్యవస్థ ఇంకా బలపడాల్సి ఉంది. ప్రింటులో పత్రికకు మంచి ముఖచిత్రం, ఆ చిత్రాన్ని ముద్రించేందుకు ప్రత్యేకమైన కాగితం, ఇంకులు - ఈ పరంగా కూడా పని జరగాల్సి ఉన్నది.

కొత్తపల్లి పత్రికలో మరిన్ని శీర్షికల్ని - ముఖ్యంగా పిల్లలు గీచిన బొమ్మలు, సీరియళ్లు, నాటికలు, పద్యాలు - గద్యాలు చేర్చేందుకు కసరత్తు మొదలైంది. "కూడిక మెట్లు, సుడోకు, దారి కనుక్కోండి, క్విజ్ " వంటివి బహుముఖంగా విజ్నాన వినోదాల్ని అందించగలవు. మీ అందరి ఆదరాభిమానాలతో ఈ శీర్షికలన్నీ ఒకటొకటిగా త్వరలో మొదలవుతాయి.

ఇక, ఈ సంచికలో పతాకచిత్రం (డా.భీంరావు అంబేద్కర్, వసంతం, గుడ్ ఫ్రైడే) అడవిరాముని కృషి ఫలం. భారత రాజ్యాంగ నిర్మాతల్లో ప్రథముడైన డా.అంబేద్కర్ ఏప్రిల్ పధ్నాలుగు,1891న జన్మించారు. ఈ నెల్లోనే వచ్చే గుడ్ ఫ్రైడే, ఏసు ప్రభువు పాప క్షమాపణకోసం రక్తాన్ని ధారవోసిన పవిత్ర దినం. ఇటువంటి మహనీయుల స్ఫూర్తితో మన జీవితాలను పునీతం చేసుకుందాం.

ఈ పిల్ల(ల) పత్రికను సంవత్సర కాలంగా ఆదరించిన మీకందరికీ విరోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! విరోధిలో విరోధాలన్నీ సమసిపోవాలని ఆశిస్తూ,

స్నేహాభిలాషులు-

కొత్తపల్లి బృంద సభ్యులు.